ఆన్ లైన్ వీడియో కంటెంట్ నియంత్రణకు ఢిల్లీ హైకోర్టు “నో”
నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి ఆన్ లైన్ మీడియా స్ట్రీమింగ్ సంస్థల పనితీరును నియంత్రించటానికి ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించాలంటూ ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు త్రోసిపుచ్చింది. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ కు ఎలాంటి లైసెన్సులూ అవసరం లేదని సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రజలు చూడదగిన ప్రసారాలుగా ఎలాంటి ధ్రువీకరణగాని లేని, నియంత్రణ్ అలేని అంశాలు ఈ అన్ లైన్ వేదికలు ప్రసారం చేస్తున్నాయన్నది పిటిషన్ దారు అభ్యంతరం. సేక్రెడ్ గేమ్స్, గేమ్స్ ఆఫ్ థోర్న్స్, స్పార్టకస్ లాంటి వెబ్ సిరీస్ లో అసభ్యకరమైన, లైంగికంగా రెచ్చగొట్టే, బూతు, అనైతిక కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయని, మహిళలను కించపరచే విధంగ ఉంటున్నాయని ఆరోపించారు.
అయితే, ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి నోటీసూఇవ్వటం లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే ధ్రువీకరణలేని, బూతు ప్రసారాలు వస్తున్నాయన్న ఆరోపణలమీద ప్రభుత్వాన్ని తన అభిప్రాయం తెలియజేయవలసిందిగా మాత్రమే కోరుతున్నామని కోర్టు పేర్కొంది.