కార్యక్రమాల నియమావళి- CONTENT CODE

cabletv_final_2

సినిమా విడుదల కావటానికి ముందు అందులో అభ్యంతకర సన్నివేశాలు, సంభాషణలు ఉంటే వాటిని తొలగించేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి బి ఎఫ్ సి) ఉంటుంది, దాన్నే మనం సెన్సార్ బోర్డ్ అని కూడా పిలుస్తున్నాం.  కానీ టెలివిజన్ కార్యక్రమాల విషయంలో అలా కుదరదు. ఎందుకంటే,ఎక్కువ భాగం ప్రత్యక్ష ప్రసారాలుంటాయి కాబట్టి వాటిని సెన్సార్ చేయటం కుదరదు. అందుకే, కార్యక్రమాల తీరుతెన్నులను గమనిస్తూ, అభ్యంతరకర కార్యక్రమాలను నియంత్రించటానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. కేబుల్ టీవీ చట్టాన్ని రూపొందించి అవసరమైన మేరకు సవరణలు చేస్తూ ప్రజోపయోగాలను పరిరక్షించేందుకు ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ చాలా సమయాల్లో ప్రయివేట్ శాటిలైట్ టీవీ ఛానల్స్ హద్దు మీరి ప్రవర్తిస్తున్నాయనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, ఛానల్స్ సరిదిద్దుకుంటున్న తీరును గమనించాలి. కార్యక్రమాల రూపకల్పనకు,ప్రకటనల తయారీకి రూపొందించిన మార్గదర్శక సూత్రాలు  ఏ మేరకు పాటిస్తున్నారనేది గమనిస్తే ముందుగా మనకు కేబుల్ టీవీ చట్టం గుర్తుకొస్తుంది.

కార్యక్రమాల రూపకల్పన నియమావళి

1994 నాటి కేబుల్ టీవీ నెట్ వర్క్ నియమావళి ప్రకారం కార్యక్రమాల రూపకల్పనలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో పొందుపరిచిన నియమాలు ఇలా ఉన్నాయి.

 1. ఉత్తమాభిరుచికి, హుందాతనానికి భంగం కలిగించే కార్యక్రమాలు ప్రసారం చేయకూడదు.
 2. మిత్రదేశాలను విమర్శించే కార్యక్రమాలు రూపొందించకూడదు.
 3. మతాల మీద, వర్గాల మీద దాడి చేసే దృశ్యాలు, మాటలు వాడటం లేదా మత విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు నిషిద్ధం.
 4. ఘర్షణ వాతావరణానికి దారి తీసే విధంగాను, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేది గాను, జాతి విద్వేషాలను రెచ్చగొట్టేదిగాను ఉండకూడదు.
 5. కోర్టు ధిక్కారానికి పాల్పడే ఏ అంశమైనా సరే ప్రసారం చేయకూడదు.
 6. రాష్ట్రపతికి, న్యాయవ్యవస్థకు దురుద్దేశాలను ఆపాదించకూడదు.
 7. దేశ సమగ్రతకు భంగం కలిగించే అంశాలు ప్రసారం చేయకూడదు.
 8. అసభ్యకరమైన, పరువు నష్టం కలిగించే, ఉద్దేశపూర్వకమైన అసత్యాలూ, అర్ధసత్యాలూ ప్రసారం చేయకూడదు.
 9. ఒక వ్యక్తిని లేదా ఒక బృందాన్ని కించపరుస్తూ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తూ కార్యక్రమాలు రూపొందించి ప్రసాం చేయకూడదు.
 10. మూఢ నమ్మకాలనూ, గుడ్డి విశ్వాసాలనూ ప్రోత్సహించేలా కార్యక్రమాలు ఉండకూడదు.
 11. మహిళలను అసభ్యకరంగా, అవమానకరంగా చిత్రించిన కార్యక్రమాలు ప్రసారం చేయకూడదు.
 12. పిల్లలను అసభ్యంగా, అనైతికంగా చిత్రించకూడదు.
 13. మతపరమైన, భాషాపరమైన, జాతులపరమైన వారిని కించపరిచేవిధంగా కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయకూడదు.
 14. 1952 నాటి సినిమాటోగ్రఫీ చట్టాన్ని ఉల్లంఘించే పనులేవీ చేయకూడదు.
 15. బహిరంగ ప్రదర్శనకు అనువుగా లేని కార్యక్రమాలేవీ ప్రసారం చేయకూడదు. అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సిబిఎఫ్ సి) వారి అనుమతి పొందని ఫిల్మ్ ట్రెయిలర్ గాని, మ్యూజిక్ వీడియో గాని, సినిమా పాటలు గాని, విదేశీ చిత్రం గానీ ప్రసారం చేయరాదు.
 16. మహిళలను సానుకూల దృక్పథంతో, నాయకత్వపు లక్షణాలతో, సౌశీల్యవంతంగా, నైతికంగా ఉండే అంశాలకు ప్రాధాన్యమిచ్చే ఛానల్స్ చూపటానికి కేబుల్ ఆపరేటర్ ప్రయత్నించాలి.
 17. కాపీరైట్ నియమాలను ఉల్లంఘించే కార్యక్రమాలను కేబుల్ ఆపరేటర్ ప్రసారం చేయకూడదు.
 18. పిల్లల కోసం ఉద్దేశించిన కార్యక్రమాల్లో మితిమీరిన హింస, చెడు భాష లేకుండా జాగ్రత్త తీసుకోవాలి.
 19. పిల్లలు ఎక్కువగా టీవీ చూసే సమయాల్లో వాళ్లకి తగని కార్యక్రమాలు చూపకూడదు.
 20. కేంద్ర ప్రభుత్వం అనుమతించని ఏ ఛానల్ ను కేబుల్ ఆపరేటర్ తన కేబుల్ ప్రసారాల ద్వారా చూపించకూడదు.

ప్రకటనల నియమావళి

conditions

ప్రకటనల విషయంలో కూడా ప్రభుత్వం కొన్ని నియమాలు రూపొందించినది. గంట సేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో 12 నిమిషాలకు మించి ప్రకటనలు ఉండకూడదు. అందులో 10 నిమిషాలు వాణిజ్య ప్రకటనలు, మిగిలిన రెండు నిమిషాలు ఛానల్ సొంత ప్రకటనలకు ఉపయోగించాలి. ప్రకటన కర్తలు ఈ నియమాలను ఉల్లంఘించి ప్రకటనలను రూపొందించినప్పటికీ వాటి ప్రసారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఛానల్ యాజమాన్యాలను ఆదేశించింది.

ప్రకటనల నియమావళి ఇలా ఉంది.

 1. భారతదేశంలోని చట్టాలకు విరుద్ధంగా ఉండకూడదు.
 2. నైతికతకు, హుందాతనానికి కట్టుబడి ఉండాలి.
 3. ఒక జాతి, తెగ, రంగు, జాతీయత ప్రస్తావించే ప్రకటనలు ఉండకూడదు.
 4. భారత రాజ్యాంగంలోని అంశాలకు విరుద్దంగా ఉండకూడదు.
 5. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రేరేపించే విధంగా ఉండకూడదు.
 6. నేరాన్ని ప్రేరేపించే విధంగానో, నేరాన్ని వీరోచితంగా చిత్రీకరించే విధంగానో ఉండకూడదు.
 7. జాతీయ చిహ్నాన్ని, జాతీయ నాయకులను కించపరిచేలా ఉండకూడదు.
 8. మహిళలను కించపరిచే విధంగానూ, ద్వితీయ శ్రేణి పౌరులగా చిత్రీకరించే విధంగానూ ఉండకూడదు.
 9. వరకట్నం, బాల్యవివాహాలు లాంటి సామాజిక నేరాలను సమర్థించకూడదు.
 10. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, వైన్, ఆల్కహాల్ తదితర మత్తుపదార్థాల ఉత్పత్తి అమ్మకాల వాడకాన్ని ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని సమర్థించకూడదు.
 11. ఒకే బ్రాండ్ పేరుతో పైన పేర్కొన్న నిషిద్ధ వస్తువులు అమ్ముతున్న పక్షంలో రెండో వస్తువు ప్రకటనలో నిషిద్ధ వస్తువుల బొమ్మలు చూపించటం కానీ,పరోక్షంగా ప్రస్తావించటం గానీ చేయకూడదు.
 12. ప్రతి ప్రకటనను సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ చూసి ధృవీకరించాల్సి ఉంటుంది. ఆ ధృవీకరణ పత్రాలు పొందిన ప్రకటనలు మాత్రమే ప్రసారం చేయాలి.
 13. చిన్నపిల్లల పాల ఉత్పత్తులు, పాల సీసాలు తదితర ప్రకటనలు చేయకూడదు.
 14. నేరుగా ఒక మతాన్ని గానీ, ఒక రాజకీయపార్టీని గానీ ఉద్దేశించి చేసే ప్రకటనలను అనుమతించకూడదు.
 15. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ప్రకటనలను ప్రసారం చేయకూడదు.
 16. వినియోగదారుల రక్షణ చట్టంలో పేర్కొన్న నియమాలకు అనుగుణంగా ఎలాంటి లోపం లేని వస్తువుల ప్రకటనలు మాత్రమే ప్రసారం చేయాలి.
 17. ప్రకటనల శబ్దం మితిమీరి ఉండకూడదు.
 18. పిల్లలను పిల్లల భద్రతకు వ్యతిరేకంగా గానీ, లేదా వాళ్లను బిచ్చగాళ్ల పాత్రల వంటి అమర్యాదకరమైన పాత్రంలో చిత్రీకరించిన ప్రకటనలు నిషిద్ధం.
 19. అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎ ఎస్ సి ఐ) చేపట్టిన స్వీయ నియంత్రణ నియమావళికి అనుగుణంగా మాత్రమే ప్రకటనలు రూపొందించాలి.
 20. ప్రకటనలకు, కార్యక్రమాలకు మధ్య స్పష్టమైన తేడా ఉండేలా చూడాలి.

బాలల హక్కుల పరిరక్షణ

టీవీ సీరియల్స్, రియాల్టీ షోలూ, ప్రకటనలలో బాల నటీనటులు పెరిగిపోతుండటం మీద ఇటీవలి కాలంలో తీవ్రమైన చర్చోపచర్చలు జరిగాయి. బాల కార్మిక చట్టాలను వీళ్లకు వర్తింపచేయాలని ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలో బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమీషన్  ఈ అంశాన్ని నిశితంగా సమీక్షించి కొన్ని సిఫార్సులు చేసింది. ప్రకటనలలో బాలబాలికల పాత్ర పెరుగుతుండడాన్ని, వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవడాన్ని, షూటింగ్ సమయాల్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవటాన్ని, పనిగంటల విషయంలో సరైన నియంత్రణ లేకపోవడాన్ని కమిషన్ గమనించింది. బాలబాలికలు విద్యాపరంగా కూడా నష్టపోవటం, వారి మానసిక ఎదుగుదలకు కూడా ఈ వాతావరణం దోహదం చేయకపోవడం, రియాల్టీ షోస్ లో శారీరకంగానూ, మానసికంగాను తీవ్రమైన ఒత్తిడికి గురవటం లాంటి ఘటనలను కమిషన్ ప్రత్యక్షంగా పరిశీలించింది.

సంచలనం కోసం టీవీ ఛానల్స్ గేమ్ షోస్ నిర్వహిస్తూ వందలాది మంది స్టూడియో ప్రేక్షకుల సమక్షంలోను, కోట్లాదిమంది టీవీ ప్రేక్షకుల సమక్షంలోనూ పిల్లల మీద ప్రతికూల వ్యాఖ్యలు చేయటం, రౌండ్ల వారీగా తొలగిస్తూ మానసిక వేదనకు గురిచేయటం కూడా కమిషన్ గుర్తించింది. 2009 మే 19న జరిగిన ఒక ఘటనలో న్యాయ నిర్ణేతలు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు తీవ్ర మనస్థాపంతో డిప్రెషన్ కు గురై ఒక అమ్మాయి ఆస్పత్రి పాలయి చనిపోవటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అదే విధంగా సీరియల్స్ లో కూడా పిల్లలకు పెద్దవాళ్ల దుస్తులు ధరింపచేసి నోరు తిరగని డైలాగులు వల్లివేయించటం కూడా హింసించటం క్రిందకే వస్తుందని కమిషన్ అభిప్రాయపడింది. చిన్నపిల్లలు ఆ వయసులోనే డబ్బు సంపాదించటం మొదలుపెట్టడంతో తల్లిదండ్రులు కూడా వారిని  ఆ దిశలో మరింతగా ప్రోత్సహించటం సర్వసాధారణంగా మారిందని కమిషన్ వ్యాఖ్యానించింది. సినిమా పరిశ్రమలో కూడా ఇలాంటి ధోరణులు ఉన్నప్పటికీ ఈ అధ్యయనంలో టీవీ పరిశ్రమకు సంబంధించిన వారినే పరిగణనలోకి తీసుకున్నారు.

కమిషన్ చేసిన సిఫార్సులు ఇలా ఉన్నాయి.

 1. పిల్లల వయసు, వారి మానసిక పరిణతికి మించిన పాత్రలు ధరించకూడదు.
 2. పిల్లలు పొగత్రాగుతున్నట్లు, ఆల్కహాల్ సేవిస్తున్నట్లు లేదా మరేదైనా సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్టు చూపించకూడదు.
 3. పిల్లలను నగ్నంగా చూపించకూడదు.
 4. మోసానికి గురైన పిల్లలను చూపించాల్సి వచ్చినప్పుడు కూడా చాలా సున్నితంగా వ్యవహరించాలి. వాళ్ల సంక్షేమానికి నష్టం కలిగించే రీతిలో చిత్రీకరణ సాగకూడదు.
 5. పిల్లల చేత వాళ్ల వయసుకు మించిన సంభాషణలు పలికించకూడదు.
 6. శారీరకంగా గానీ, మానసికంగా గానీ హింసను ప్రేరేపించే ఘట్టాలలో పిల్లలను నటింపచేయకూడదు.
 7. రియాల్టీ షోస్ పోటీ పద్ధతిలో నడపకూడదు.
 8. కార్యక్రమాల్లో ఎవరినీ అవహేళన చేయటం గానీ, అవమాన పరచటం గానీ, నిరుత్సాహ పరచటం గానీ, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా గానీ చేయకూడదు.
 9. పిల్లల మానసిక సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని వారి ప్రతిభను అంచనా వేయాలే తప్ప, న్యాయ నిర్ణేతలు అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయకూడదు.
 10. కార్యక్రమ స్వభావాన్ని వ్రాత పూర్వకంగా ముందుగా పిల్లలకు, వారి తల్లిదండ్రులకు తెలియజేసిన తర్వాతనే ఒప్పందంపై సంతకాలు తీసుకోవాలి.
 11. పిల్లలు తమ వయసును బట్టి షూటింగ్ లో గడిపే సమయాన్ని నిర్ధారించాలి. తక్కువ వయసు ఉన్నవాళ్లు తక్కువ సమయం గడిపేందుకు ఈ నియమం ఉపయోగపడుతుంది.
 12. ఒక రోజు ఒక కార్యక్రమానికి మించి షూటింగ్ లో పాల్గొనకూడదు. వీలైనంత వరకూ ఆదివారాల్లో మాత్రమే కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడటం ద్వారా స్కూల్ మిస్సవకుండా చూడవచ్చు.
 13. ఇటీవలే భారత ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టం అనుగుణంగా రూపొందించిన సూత్రం ఇది.
 14. పిల్లలు గంటకొకసారి విరామం తీసుకుంటూ ఒక షిఫ్ట్ లో మాత్రమే పాల్గొనాలి.
 15. తల్లిపాలు, టీకాలు లాంటి ప్రకటనలు తప్ప మూడు నెలలలోపు పిల్లలను ప్రకటనలలో చూపకూడదు.
 16. ఆరు నెలల లోపు పిల్లలు షూటింగ్ లో పాల్గొనాల్సి వస్తే తప్పనిసరిగా తల్లి వెంట ఉండాలి.
 17. షూటింగ్ జరిపే సమయాల్లో పిల్లల తరపున తల్లిదండ్రుల్లో ఒకరు గానీ, బాగా తెలిసిన వ్యక్తులు గానీ ఒకరు తప్పనిసరిగా ఉండాలి.
 18. ఏడాదిలోపు పిల్లలయితే నర్సు కూడా వెంట ఉండటం తప్పనిసరి. ఆరేళ్లు దాటిన పిల్లలయితే తల్లిదండ్రుల్లో ఒకరు ఉండాలి.
 19. కనీసం ముగ్గురు పిల్లలకు ఒకరు చొప్పున ఒక సూపర్ వైజర్ ను ఛానల్ నియమించాల్సి ఉంటుంది.
 20. పిల్లలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు వీలుగా ఛానల్ ఆ సూపర్ వైజర్ కు ఇంకే పని చెప్పకూడదు.
 21. ప్రమాదకరమైన లైటింగ్ కు, రియాక్షన్ కనిపించే మేకప్ సామాగ్రికి పిల్లలను దూరంగా ఉంచాలి.
 22. పిల్లలు షూటింగ్ లో పాల్గొనే సందర్భంలో యూనిట్ సభ్యులకు అంటువ్యాధులేవీ లేవు అనే ధృవీకరణ పత్రం పొందాలి.
 23. షూటింగ్ సమయంలో పిల్లలకు పౌష్టికాహారం, నీరు తదితర పానీయాలు తగినంత సకాలంలో అందించాలి
 24. ప్రొడక్షన్ సెట్ లో పిల్లల వయసుకు తగినట్టుగా వారి విశ్రాంతికి, వినోదానికి తగిన ఏర్పాట్లు చేయాలి.
 25. పిల్లలు డ్రెస్ మార్చుకోటానికి తగిన గదులు ఏర్పాటుచేయాలి.
 26. పిల్లల్లో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకోకుండా తగిన మానసిక తోడ్పాటు ఇవ్వాలి. వారి తల్లిదండ్రులకు తగిన కౌన్సెలింగ్ ఇవ్వాలి.
 27. సెట్ రూపకల్పనలో పిల్లల మానసిక, శారీరక సామర్థ్యాలను వారి భద్రతను దృష్టిలో ఉంచుకోవాలి.
 28. పిల్లలతో చేసే అన్ని రియాల్టీ షోస్ లో సెట్ లో ఒక చైల్డ్ సైకాలజిస్ట్ ఉండటం తప్పనిసరి.
 29. విద్యాహక్కు చట్టంలో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా పిల్లల విద్యాఅవసరాలను తీరుస్తున్నట్టు తల్లిదండ్రుల నుంచి ధృవీకరణ పత్రం తీసుకున్న తరువాతనే షూటింగ్ కు అనుమతించాలి.
 30. అందులో పిల్లల పుట్టిన తేదీ, ఆరోగ్య పరిస్థితి, కార్యక్రమంలో పాల్గొనే తేదీలు, తల్లిదండ్రుల పేర్లు, వారి వృత్తి, పాఠశాల పేరు, తరగతి, స్కూల్లో ఉండాల్సిన సమయం, సెట్ మీద కానీ, ఇంటి దగ్గర కానీ లేదా దూరవిద్య ద్వారా శిక్షణ పొందుతుంటే ఆ వివరాలు పొందుపరచాలి.
 31. మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, కార్మిక ఉపాధి శాఖ, సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ తరచూ టీవీ కార్యక్రమాల్లో బాలల హక్కుల పరిరక్షణను సమీక్షిస్తూ ఉండాలి.
 32. 18 ఏళ్లలోపు పిల్లలకు బ్యాంకు ఖాతా తెరిచే అవకాశం ఉండదు కనుక వాళ్ల చెల్లింపులు ఫిక్స్ డ్ డిపాజిట్ లేదా బాండ్ రూపంలో చెల్లించాలి. అయితే తల్లిదండ్రులకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా 50 శాతం మాత్రమే వారికి చెల్లించి మిగిలినది ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలి.
 33. వార్తలలో పిల్లల ఇంటర్వ్యూలు ప్రసారం చేయాల్సి వస్తే వారి తల్లిదండ్రుల అనుమతి తీసుకోవటం తప్పనిసరి. పిల్లలను వారి సామర్థ్యానికి మించిన అంశాల మీద వ్యాఖ్యానించమని కోరకూడదు.
 34. పిల్లలు ఒక కార్యక్రమంలో పాల్గొనటం వలన భవిష్యత్ లో కలిగే నష్టాలు ఏమైనా ఉంటే ముందుగానే తెలియజేయాలి.

 

మానిటరింగ్ కమిటీలు

వివిధ చానల్స్ లో ప్రసారమయ్యే కార్యక్రమాలను సమీక్షిస్తూ ఆ కార్యక్రమాల మీద వచ్చే ఫిర్యాదులను ప్రాథమికంగా పరిశీలిస్తూ సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖకు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు వీలుగా మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

2008 ఫిబ్రవరి 19న ఈ మేరకు కొన్ని మార్గదర్శక సూత్రాలను రూపొందించి లేఖ రాసింది. రాష్ట్ర స్థాయిలోను, జిల్లా స్థాయిలోను మానిటరింగ్ కమిటీలు ఏర్పాటుచేయాలని, కేబుల్ టీవీ చట్టం సమర్థంగా అమలయ్యేటట్టు చూడాలని కోరింది.

జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ

టెలివిజన్ ఛానల్స్ లో ప్రసారమయ్యే కార్యక్రమాలు నియమాలను ఉల్లంఘిస్తున్నట్టు వచ్చే ఫిర్యాదులను పరిశీలించటానికి జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీలు పనిచేస్తాయి.

కమిటీ నిర్మాణం ఇలా ఉంటుంది.

 1. జిల్లా కలెక్టర్  –  ఛైర్మన్
 2. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ –  సభ్యుడు
 3. జిల్లా పౌర సంబంధాల అధికారి – సభ్యుడు
 4. జిల్లాలోని ఒక మహిళా కళాశాల ప్రిన్సిపాల్ – సభ్యుడు

(జిల్లా కలెక్టర్ ఎంపిక చేస్తాడు)

 1. శిశు సంక్షేమం మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి – సభ్యుడు

(కలెక్టర్ నామినేట్ చేస్తాడు)

 1. మహిళా సంక్షేమం మీద పనిచేసే స్వచ్చంద సంస్థ ప్రతినిధి – సభ్యుడు
 2. విద్యావేత్త/మానసిక శాస్త్రవేత్త/ సామాజిక శాస్త్రవేత్త – ముగ్గురు సభ్యులు

ప్రసారమైన కార్యక్రమాల మీద ఫిర్యాదులను స్వీకరించటం, కేబుల్ టీవీ చట్టాన్ని అమలు చేసే అధికారుల చర్యలను సమీక్షించటం, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ, ప్రజల్లో ఏ వర్గాన్నయినా కించపరిచే కార్యక్రమాలు కానీ ప్రసారమయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయటం స్థానిక కేబుల్ ఆపరేటర్ ప్రసారం చేసే కార్యక్రమాలను పరిశీలిస్తూ స్థానిక వార్తల ప్రసారంలో పక్షపాత ధోరణులకు పాల్పడుతున్నట్టు అనిపిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లటం, కేబుల్ ఆపరేటర్లు చట్టపరంగా ఇవ్వాల్సిన ఛానల్స్ తో పాటు వీలైనన్ని ఎక్కువ ఉచిత ఛానల్స్ ప్రసారం చేసేటట్లు చేయటం.

జిల్లా స్థాయిలో ఒక ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి దానికి తగినంత ప్రాచుర్యం కల్పిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఒక వెబ్ సైట్ కూడా ఉంటుంది. ఈ కమిటీ రెండు నెలలకోసారి సమావేశమై ఫిర్యాదులను పరిశీలిస్తుంది. స్వయంగా తమ దృష్టికి వచ్చిన లోపాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఫిర్యాదులు స్థానిక ప్రచారాల మీద వచ్చిన సందర్భంలో సంబంధిత క్లిప్సింగ్స్ ఇవ్వాల్సిందిగా ఆ ఛానల్స్ ను కోరవచ్చు. కమిటీ సభ్యులు చర్చించి నిబంధనలు ఉల్లంఘన జరిగినట్టు భావిస్తే సంబంధిత కేబుల్ టీవీకి షోకాజ్ నోటీస్ ఇస్తారు. వారి వాదన కూడా విన్న తరువాత తుదినిర్ణయాన్ని రాష్ట్ర కమిటీకి తెలియజేస్తారు. శాటిలైట్ ఛానల్స్ కు సంబంధించిన కార్యక్రమాల మీద ఫిర్యాదులు వస్తే వాటికి తమ సిఫార్సులను జోడిస్తూ రాష్ట్ర కమిటీకి పంపిస్తారు. ఉల్లంఘనలకు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే ఉల్లంఘన తీవ్రతను బట్టి ఆ ఛానల్ కు ఒక సలహా ఇవ్వటం లేదా హెచ్చరించటం లేదా క్షమాపణ కోరుతూ నిర్దిష్టమైన రోజుల పాటు స్క్రోల్ నడపవలసిందిగా ఆదేశించటం లేదా కొంతకాలం పాటు ప్రసారాలు నిలిపివేయటం వంటి చర్యలు తీసుకోవచ్చు. అయితే జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీలు కేబుల్ టీవీ కార్యక్రమాల మీద మాత్రమే చర్యలు తీసుకోగలవు. శాటిలైట్ ఛానల్స్ విషయంలో సిఫార్సులకు మాత్రమే పరిమితం కావాలి.

రాష్ట్రస్థాయి మానిటరింగ్ కమిటీ

రాష్ట్ర స్థాయిలో ప్రైవేట్ ఛానల్స్ టీవీ కార్యక్రమాల పర్యవేక్షణకు ఏర్పాటయ్యే కమిటీలో సభ్యులు ఇలా ఉంటారు.

 1. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కార్యదర్శి – చైర్మన్
 2. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్           – సభ్యుడు
 3. రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి                  – సభ్యుడు
 4. రాష్ట్ర ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి   – సభ్యుడు
 5. మహిళల కోసం పనిచేసే రాష్ట్ర స్థాయి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి  – సభ్యుడు

(రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నామినేట్ చేస్తారు)

 1. ఒక విద్యా నిపుణుడు, ఒక మానసిక శాస్త్రవేత్త, ఒక సామాజిక శాస్త్రవేత్త – ముగ్గురు సభ్యులు

(ఒక్కో విభాగానికి చెందిన ఒక్కో సభ్యున్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నామినేట్ చేస్తారు)

 1. రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ డైరెక్టర్ –  ( మెంబర్ సెక్రటరీ )

నామినేట్ అయిన సభ్యుల పదవీకాలం రెండు సంవత్సరాలు ఉంటుంది. అయితే రెండో విడత నామినేట్ కావటానికి వారు అనర్హులు. ఏదైనా ఖాళీ ఏర్పడితే ఆ ఖాళీలో నామినేట్ అయిన వ్యక్తి రెండేళ్ల పాటు పదవిలో ఉంటారు. ఈ కమిటీ కనీసం ఏడాదికోసారి సమావేశం అయి రాష్ట్ర స్థాయి నివేదికను తయారుచేసి కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖకు ఏటా డిసెంబర్ 31లోగా పంపుతుంది.  జిల్లా కమిటీల ఏర్పాటును పర్యవేక్షించటం, అవి క్రమం తప్పకుండా సమావేశాలు జరుపుతున్నట్టు నిర్ధారించుకోవటం రాష్ట్ర కమిటీ విధి. జిల్లా కమిటీలు వివిధ సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించటం,అవసరమైన సూచనలు ఇవ్వటం కూడా రాష్ట్ర స్థాయి కమిటీలో ఉంటుంది. జిల్లా స్థాయి కమిటీ నుంచి వచ్చిన ఫిర్యాదులనున పరిశీలించి కేంద్ర సమాచార ప్రసారాల శాఖ కార్యదర్శికి పంపించటం రాష్ట్ర స్థాయి ఛానల్స్ మీద చర్యలు తీసుకోవటం, జాతీయ స్థాయి ఛానల్స్ మీద చర్యలకు సిఫార్సులు తీసుకోవటం రాష్ట్ర కమిటీ విధివిధానాల్లో ముఖ్యమైనది. వివిధ శాటిలైట్ ఛాన్సల్స్ ప్రసారం చేసిన కార్యక్రమాల్లో నియమావళిని ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చిన సందర్భంలో ప్రభుత్వం వాటిని పరిశీలించింది. ఉల్లంఘన తీవ్రతను బట్టి 2011 ఏప్రిల్ వరకు 180 అంశాల మీద సలహాలు, హెచ్చరికలు జారీ చేసినట్లు ప్రభుత్వ నివేదిక తెలియజేస్తుంది.

తెలుగు ఛానల్స్ కూడా ఇలాంటి హెచ్చరికలు ఎదుర్కొన్న సందర్బాలు ఉన్నాయి. 2005లో తేజా టీవీ కామసూత్ర ప్రదర్శించినందుకు గాను, 2006 మార్చి 23న జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఆ హెచ్చరికను స్క్రోల్ రూపంలో ప్రసారం చేసింది. జీ తెలుగు ఛానల్ 2006లో సోయగం పేరుతో ప్రసారం చేసిన కార్యక్రమంపై కూడా ఇదే విధమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే 2006 అక్టోబర్ 17న ఒక హెచ్చరిక మాత్రం జారీ చేసింది. మదరసాల పనితీరుమీద టీవీ 5 ప్రసారం చేసిన ఒక కార్యక్రమానికి గాను క్షమాపణ కోరుతూ స్క్రోల్ ప్రసారం చేయాలని 2009 జూన్ 24న కేంద్రం ఆదేశించింది. ఛానల్ ఆదేశాన్ని పాటించింది. 2004 డిసెంబర్ 22న టీవీ 9 మెట్రోపాలిటిన్ సెషన్ జడ్జ్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఒక వార్త ప్రసారం చేసిందన్న ఆరోపణను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం 2010 జనవరి 13న ఒక హెచ్చరిక జారీ చేసింది. చింతామణి బిగ్ స్క్రీన్ శీర్షికలతో అసభ్యకరమైన దృశ్యాలను చూపించినందుకు టీవీ5కు 2010 ఆగస్టు 18న ఒక హెచ్చరిక చేస్తూ క్షమాపణలతో స్క్రోల్ నడపాలని ఆదేశించింది. అదే విధంగా రియాల్టీ షో ‘ఆట’ను అసభ్యంగా చిత్రీకరించినట్లు పేర్కొంటూ జీ తెలుగు ఛానల్ కు 2010 నవంబర్ 16న సలహా పూర్వకంగా కేంద్రం ఒక లేఖ రాసింది.