కేబుల్ ఆపరేటర్ల మరణాలు దేనికి సంకేతం?

తెలంగాణలో ఇద్దరు కేబుల్ ఆపరేటర్లు గుండె ఆగి చనిపోగా ఆంధ్రప్రదేశ్ లో ఇంకో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్దారు. ఒకప్పుడు రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నట్టే ఇప్పుడు కేబుల్ ఆపరేటర్లు నేలరాలుతున్నారు. ట్రాయ్ అమలు చేస్తున్న అనాలోచిత విధానాలు, బ్రాడ్ కాస్టర్ల ధన దాహం, ఎమ్మెస్వోల మొండి వైఖరి వలన కేబుల్ ఆపరేటర్ ఇక తన మనుగడ ప్రశ్నార్థకమైపోయిందన్న అభిప్రాయానికి రావటమే అందుకు కారణం.

ట్రాయ్ ఇచ్చిన గరిష్ఠ పరిమితిని తమకు అనుకూలంగా మార్చుకొని భారీగా ధరలు నిర్ణయించిన బ్రాడ్ కాస్టర్లు ఒక కారణమైతే, ట్రాయ్ ఇచ్చిన వెసులుబాటు ఆధారంగా చేసుకొని వాటా విదల్చటానికి ఎంతమాత్రమూ ముందుకు రాని ఎమ్మెస్వోలు కూడా ఈ దారుణానికి మరో కారణం. ట్రాయ్ సూచించిన పంపిణీ నిష్పత్తి కంటే ఎక్కువగా ఇవ్వటానికి చాలామంది ఎమ్మెస్వోలు నిర్ణయించారంటే దానర్థం ట్రాయ్ లెక్కలు వాస్తవ దూరమని. ఎమ్మెస్వోఖెడ్ ఎండ్, సేవల ఖర్చు కంటే ఆ ఎమ్మెస్వో పరిధిలోని ఆపరేటర్ల నెట్ వర్క్ ఖరీదు, సేవల విలువ చాలా ఎక్కువని స్పష్టంగా తేలిపోయింది. దాన్నిబట్టి ట్రాయ్ అనుసరించిన విధానంలో పెద్ద తప్పిదం ఉన్నదని.

హిందుజా వారి హిట్స్ వేదికతోబాటు కొంతమంది  స్వతంత్ర ఎమ్మెస్వోలు ట్రాయ్ సూచనతో సంబంధం లేకుండా వాటా పెంచటానికి ఒప్పుకోగా సిటీ నెట్ వర్క్స్, హాత్ వే మాత్రం పట్టు వదల్లేదు. ఈ దిగులుతోనే ఇప్పటికి నాలుగు ప్రాణాలు పోయాయి. ఆపరేటర్లు మనోధైర్యం కోల్పోవటానికి కారణం అరకొరవాటాతో వ్యాపారాన్ని ముందుకు నడపటం సాధ్యం కాదన్న అభిప్రాయంతోనే.

కేబుల్ ఆపరేటర్ల సంఘాలు ఎంతగా ధైర్యం నూరిపోసినా సిటి నెట్ వర్క్స్, హాత్ వే వైఖరిలో మార్పు రాకపోవటం, ఈ రెండు సంస్థల పరిధిలో పాతిక లక్షలకు పైగా కనెక్షన్లు ఉండటం వాళ్ళ పరిధిలోని ఆపరేటర్లను ఇబ్బంది పెడుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆపరేటర్ల మనోధైర్యం మరింత తగ్గే ప్రమాదముంది. ఈలోపు ఆపరేటర్ల సంఘాలు తమవంతు ప్రయత్నంగా ధైర్యం నింపే పనిలో ఉన్నాయి. ట్రాయ్ తన తప్పు తెలుసుకొని ఆదాయ పంపిణీ నిష్పత్తిలో మార్పు చేస్తే తప్ప కార్పొరేట్ ఎమ్మెస్వోలు మారే అవకాశం కనబడటం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!