• Home »
  • Cable »
  • కేబుల్ చానల్స్ నిర్వహణ మీద ట్రాయ్ సిఫార్సులు

కేబుల్ చానల్స్ నిర్వహణ మీద ట్రాయ్ సిఫార్సులు

కేబుల్ చానల్స్ నిర్వహణ మీద ట్రాయ్ సిఫార్సులు

సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ వారు అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ కు అనుమతి ఇస్తారు. అలా అనుమతి పొందిన చానల్స్ ను పంపిణీ వేదికలైన కేబుల్ , డిటిహెచ్ లాంటివి వినియోగదారులకు ఇంటింటికీ అందిస్తాయి. అయితే, కేవలం ఉపగ్రహాలనుంచి అందుకున్నవే కాకుండా మరికొన్ని చానల్స్ ను కూడా ఈ పంపిణీ వేదికలు ప్రసారం చేస్తుంటాయి. అవి కేవలం ఆయా పంపిణీ వేదికలకు మాత్రమే పరిమితం తప్ప అంతకు మించి ఇతర ప్రాంతాలకు అందుబాటులో ఉండవు.

ఇలాంటి కార్యక్రమాలందించే సేవలు సాధారణంగా ఆయా పంపిణీ సంస్థ సొంతగా రూపొందించినవి అయి ఉంటాయి. లేదా స్థానికంగా ఒక చానల్ పెట్టి ఈ పంపిణీ సంస్థల ద్వారా పంపిణీ చేస్తూ ఉండవచ్చు. అంటే, ఒక ఎమ్మెస్వో లేదా కేబుల్ ఆపరేటర్ స్వయంగా ఒక కేబుల్ చానల్ పెట్టి మిగిలిన శాటిలైట్ చానల్ తో బాటు తన పరిధిలోని ప్రేక్షకులకు అందించవచ్చు, లేదా ఎవరైనా ఒక స్థానిక కేబుల్ చానల్ పెట్టి ఆ ఎమ్మెస్వో లేదా ఆపరేటర్ ద్వారా తన చానల్ పంపిణీ జరిగేలా చూసుకోవచ్చు. మామూలు భాషలో వీటిని లోకల్ చానల్స్ అని పిలుస్తారు. ఇవి సాధారణంగా స్థానిక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి.

ఇలాంటి స్థానిక చానల్స్ లో వైవిధ్య భరితమైన వినోద కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాధారణంగా ఇవి ఒకటి కంటే ఎక్కువ కూడా ఉంటాయి. ఎమ్మెస్వోలు స్థానికంగా తమ చందాదారులకోసం స్థానిక వార్తావిశేషాలతో న్యూస్ చానల్స్, సినీ సంగీత కార్యక్రమాలతో మ్యూజిక్ చానల్స్, సరికొత్త సినిమాలతో సినిమా చానల్స్ నడుపుతూ ఉంటారు. ఇవి కేవలం వారి చందాదారులకే పరిమితమయ్యే చానల్స్.

ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ అయితే అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ మార్గదర్శకాల ప్రకారం సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే, ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు తమ చందాదారులకోసం అందించే స్థానిక చానల్స్ మాత్రం ఎలాంటి అనుమతులూ అవసరం లేకుండానే నడుస్తున్నాయి. వీటి మీద ఎలాంటి నియంత్రణా లేదు.

గతంలో 2008 జులై 25 న ట్రాయ్ కేబుల్ టీవీ సర్వీసుల పునర్వ్యవస్థీకరణ పేరుతో సిఫార్సులు చేస్తూ స్థానిక ఆపరేటర్లు తమ సొంత చానల్స్ నడుపుకోవటానికి అనుమతించాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే అవి 1995 నాటి కేబుల్ టీవీ నెట్ వర్క్ ( రెగ్యులేషన్ ) చట్టంలో నిర్దేశించిన కార్యక్రమాల నియమావళికి, ప్రకటనల నియమావళికి కట్టుబడి ఉండాలని సూచించింది. అదే విధంగా సమాచార ప్రసారాలమంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాలను కూడా పాటించాలని పేర్కొంది. స్థానిక ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు స్థానిక చానల్స్ నడుపుకునే విషయంలో సవివరంగా మార్గదర్శకాలు రూపొందించాలని కూడా ట్రాయ్ తన సిఫార్సులలో భాగంగా సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖకు సూచించింది.

ఎ. పంపిణీ సంస్థల ఆధ్వర్యంలో నడిచే కేబుల్ చానల్స్
1. పంపిణీ వేదికల చానల్స్ నిర్వచనం : “పంపిణీ వేదికల చానల్స్ అంటే కేబుల్ ద్వారా శాటిలైట్ చానల్స్ పంపిణీ చేసే ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు, డిటిహెచ్ , హిట్స్ వంటి సంస్థలు తమ చందాదారులకోసం ప్రత్యేకంగా అందించే చానల్స్. వీటిలో దూరదర్శన్ చానల్స్ గాని, నమోదైన శాటిలైట్ చానల్స్ గాని ఉండవు. భారత్ లో నమోదు కాని విదేశా చానల్స్ కూడా ఈ పరిధిలోకి రావు.”

2. స్థానిక కేబుల్ చానల్స్ లో వార్తాంశాలతో బులిటెన్లు ప్రసారం చేసే విషయానికొస్తే, ఈ దిగువన పేర్కొన్న అంశాలను వార్తేతర అంశాలుగా పరిగణించబడతాయి. అందువలన ఇలాంటివి మాత్రమే వార్తేతర కార్యక్రమాలుగా అనుమతించబడతాయి :
(i) స్థానికంగా సేకరించిన స్థానిక కార్యక్రమాలు, వ్యవహారాలకు సంబంధించిన సమాచారం అయి ఉండాలి. అంతే తప్ప ఇతర శాటిలైట్ చానల్స్ నుంచి గాని వార్తా సంస్థలనుంచి గాని తీసుకున్నవి ప్రసారం చేయకూడదు.
(ii) ప్రత్యక్ష ప్రసారాలు కాకుండా క్రీడలకు సంబంధించిన సమాచారం ఇవ్వవచ్చు. అయితే, స్థానిక ఆటలపోటీలకు సంబంధించి వాటి ప్రసారహక్కులు ఎవరూ తీసుకొని ఉండకపోతే మాత్రం ప్రత్యక్షప్రసారం చేస్తూ కామెంటరీ ఇవ్వవచ్చు.
(iii) ట్రాఫిక్, వాతావరణం తదితర సమాచారం
(iv) సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాలు, వేడుకలు, పండుగలకు సంబంధించిన సమాచారం
(v) పరీక్షలు, ఫలితాలు, ప్రవేశాలు, కెరీర్ కౌన్సిలింగ్ లాంటి అంశాలకు సంబంధించిన సమాచారం
(vi) ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారం
(vii) విద్యుత్, నీటి సరఫరా, ప్రకృతి వైపరీత్యాలు, ఆరోగ్యం తదితర అంశాలకు సంబంధించి స్థానిక అధికారులు అందించే సమాచారాన్ని ప్రజల ప్రయోజనం కోసం ప్రసారం చేయవచ్చు.

అంతే కాకుండా, ఇలాంటి స్థానిక కేబుల్ చానల్స్ అధీకృత అధికారి నుంచి అనుమతి పొందేలా ప్రభుత్వం సిఫార్సు చేయాలని కూడా ట్రాయ్ సూచించింది. ఈ అనుమతి మంజూరుకు రాష్ట్రప్రభుత్వం ఎలాంటి రుసుమూ వసూలు చేయకూడదని కూడా పేర్కొంది. ఈ చానల్స్ అందించే ఎమ్మెస్వో లేదా డిటిహెచ్ ప్లాట్ ఫామ్ కచ్చితంగా 1994 నాటి కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ నిబంధనలలో పేర్కొన్న కార్యక్రమాల నియమావళికి, ప్రకటనల నియమావళికి కట్టుబడి ఉండాలి.

3. కేబుల్ ద్వారా చానల్స్ పంపిణీ చేసే ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు సులభంగా నమోదు చెసుకోగలిగేలా సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఒక వ్యవస్థను రూపొందించాలి. ఆ రిజిస్ట్రేషన్ కోసం కొన్ని ప్రాథమిక వివరాలు మాత్రం అడిగితే సరిపోతుంది. ఈ దిగువ పేర్కొన్న వివరాలు తీసుకుంటే సరిపోతుంది:
(i) సంస్థ పేరు
(ii) కంపెనీల రిజిస్ట్రార్ ( RoC) కేటాయించిన కార్పొరేట్ గుర్తింపు సంఖ్య (CIN)
(iii) లబ్ధిపొందే యజమానుల గుర్తింపు
(iv) కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతం చిరునామా
(v) పంపిణీ వేదిక కేబుల్ నడిపేది ఆపరేటర్ అయితే నెట్ వర్క్ డిజిటైజ్ అయిందా, కాలేదా ?
(vi) ప్రసారం చేయాలని ప్రతిపాదించిన కార్యక్రమాల స్వభావం
కేబుల్ చానల్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే దానంతటదే రశీదు అందుతుంది. అల రిజిస్టర్ చేసుకున్న వెంటనే చానల్ ప్రారంభించవచ్చు.
4. రిజిస్ట్రేషన్ అమలులో ఉండే కాలవ్యవధిని ఆ ఎమ్మెస్వో లైసెన్స్ కాలంతో సమానంగా ఉండేట్టు చూడాలి. అలా ఎమ్మెస్వో లైసెన్స్ వ్యవధి పెంచితే కేబుల్ చానల్ రిజిస్ట్రేషన్ గడువు కూడా దానంతటదే పెరుగుతుంది. అందువలన ఒక సారి రిజిస్ట్రేషన్ జరిగితే మళ్ళీ రెన్యువల్ అవసరమే ఉండదు. ప్రసారాలలో తేడా ఉండే పక్షంలో అప్పటికే ఆన్ లైన్ లో తీసుకున్న రిజిస్ట్రేషన్ లో కూడా మార్పులు చేయించుకోవాలి.
5. కేబుల్ చానల్స్ మీద ఎలాంటి వార్షిక ఫీజు వసూలు చేయకూడదు. అయితే, ఏకమొత్తంగా రిజిస్ట్రేషన్ సమయంలో రూ. 1000 వసూలు చేయవచ్చు. సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ అన్ లైన్ ద్వారా చెల్లింపు జరిపే ఏర్పాటు చేయవచ్చు.
6. రిజిస్ట్రేషన్ ను ఇతర నెట్ వర్క్ లకు బదలీ చేయటాన్ని అనుమతించకూడదు
7. డిజిటైజ్ అయిన ప్రాంతంలో స్థానిక ఆపరేటర్లు తమ సొంత చానల్స్ నడుపుకోవాలంటే వీలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలోపెట్టుకొని ఎమ్మెస్వోతో తగిన ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు కూడా అనుమతించిన ప్రసారాంశాలు మాత్రమే డిజిటల్ విధానంలో ఎన్ క్రిప్ట్ చేసి అందించాలి.
8. ఒక వ్యక్తిగాని సంస్థగాని స్థానిక కేబుల్ చానల్ నడపాలనుకున్నా, ఇప్పటికే నడుపుతున్నా భారత కంపెనీల చట్టం, 2013 నిబంధనల ప్రకారం ఒక కంపెనీ నమోదు చేయించాలి.
9. డిజిటైజేషన్ జరగని ప్రాంతంలో అయితే, ఒక ఆపరేటర్ లేదా ఎమ్మెస్వో గరిష్టంగా ఐదు చానల్స్ మించకుండా ఇవ్వవచ్చు. డిజిటైజేషన్ జరిగిన ప్రాంతంలో అయితే గరిష్ఠంగా 15 చానల్స్ ఇవ్వవచ్చు. ఈ సంఖ్య వినియోగదారునికి అందే మొత్తం కేబుల్ చానల్స్ సంఖ్య. అంటే, ఎమ్మెస్వో లేదా ఆపరేటర్ సొంతగా నడిపే చానల్స్ తోబాటు ఇతరులు స్థానికంగా ఎమ్మెస్వో ద్వారా అందించే చానల్స్ కూడా కలుపుకొని ఆ పరిమితి మించకూడదు.
10. ఎమ్మెస్వోలు అందించే కేబుల్ చానల్స్ విషయంలో ఇప్పుడున్న విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల పరిమితిలో ఎలాంటి మార్పూ ఉండదు.
11. స్థానిక కేబుల్ చానల్స్ ప్రసారం చేసే ఏ ఎమ్మెస్వో అయినా ఆ చానల్ ప్రసారాలను యథాతథంగా కనీసం 90 రోజులపాటు రికార్డు చెయ్యాలి. ఆ కార్యక్రమాల పూర్తి వివరాలతో, ప్రసార తేదీలతో సహా కనీసం గడిచిన ఏడాది కాలం పాటు ప్రసారాల వివరాలు నమోదు చేసి జాగ్రత్తపరచాలి. అధీకృత అధికారులు ఎప్పుడైనా వచ్చి ఆ రిజిస్టర్లలో నమోదైన విషయాలను తనిఖీ చేయవచ్చు. సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి/ జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఎప్పుడైనా ప్రసారాంశాలు చూపించమని అడగవచ్చు. దేశవ్యాప్తంగా నడిచే కేబుల్ చానల్ అయిన పక్షంలో స్వయంగా సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖే పర్యవేక్షక సంఘం ( మానిటరింగ్ ఏజెన్సీ ) గా ఉండిపోతుంది.
12. స్థానిక కేబుల్ చానల్ ఏదైనా వాటి నియమావళిని ఉల్లంఘిస్తే ఆ చానల్ ను మొదటి తప్పు కింద 30 రోజుల వరకూ నిషేధించవచ్చు. రెండో సారి ఉల్లంఘిస్తే అలాంటి కేబుల్ చానల్ ను 90 రోజులపాటు నిషేధించవచ్చు. మూడో ఉల్లంఘన జరిగితే దాని లైసెన్స్ ను రద్దుచేసి ప్రసారాలను పూర్తిగా నిలిపివేయవచ్చు. ఆ తరువాత ఎమ్మెస్వో అందించే చానల్స్ గరిష్ఠ సంఖ్యను అందుకు అనుగుణంగా తగ్గించవచ్చు
13. ఈ కొత్త నియమావళి పరిధిలోకి రావటానికి వీలుగా పూర్తిగా 12 నెలల గరిష్ఠ వ్యవధి ఇవ్వాలి
బి. స్థానిక చానల్స్ నియంత్రణకు నిబంధనావళి
14. శాటిలైట్ చానల్స్ కాని చానల్స్ విషయంలో సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఒక నియంత్రణ వ్యవస్థను రూపుదిద్దవచ్చు. వీలైనంత వరకు అది కూడా ఇప్పుడు శాటిలైట్ చానల్స్ కు అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ మార్గదర్శకాలున్నట్టే ఉండవచ్చు. అంటే స్పెక్ట్రమ్ వాడకపు అనుమతి, సైన్స్ శాఖ అనుమతి, వైర్లెస్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ ( WPC) లాంటివి మాత్రం వర్తించవు.
15. ఎమ్మెస్వోల ద్వారా నడిచే చానల్స్ పరిధి చాలా తక్కువగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని ట్రాయ్ సిఫార్సు చేస్తోంది. అదే విధంగా 15 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటే దేశ వ్యాప్తంగా ఉన్నట్టు పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలమండలి లోని రాష్ట్రాలన్నిటినీ కలిపి ఒక రాష్ట్రంగా పరిగణించాలి. అలా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండే కేబుల్ చానల్ యజమాని సంప్రదాయ శాటిలైట్ చానల్ తరహాలో అన్ని బాధ్యతలూ నెరవేర్చాలి. కొద్ది ప్రాంతానికే పరిమితమయ్యే పక్షంలో శాటిలైట్ చానల్ నిబంధనలలో నిష్పత్తి ప్రకారం 7% చొప్పున ఒక్కో రాష్ట్రానికి చెల్లించేట్టు చూడాలి. ఈ నిష్పత్తి వార్షిక ఫీజుకు, నెట్ వర్త్ కు వర్తిస్తుంది. అంటే ఒక రాష్ట్రానికే పరిమితమయ్యే ఒక కేబుల్ చానల్ కోటీ నలభై లక్షల రూపాయలమేరకు ఆస్తులు చూపాల్సి ఉంటుంది. అదే, రెండు రాష్ట్రాలకు విస్తరిస్తే 2 కోట్ల 80 లక్షలు చూపించాలి.

C. ఎఫ్ ఎం రేడియో పునఃప్రసారం
16. హక్కుదారులతో వాణిజ్యపరమైన నిర్దిష్టమైన ఒప్పందాలు చేసుకున్న తరువాతనే ఎఫ్ ఎం రేడియో చానల్స్ పునఃప్రసారాలను అనుమతించాలి. ఎఫ్ ఎం రేడియో చానల్స్ ను టీవీ పంపిణీ నెట్ వర్క్ ల ద్వారా అందించాలనుకుంటే స్థానిక కేబుల్ చానల్స్ కు వర్తించే నిబంధనలనే ఎఫ్ ఎం రేడియో ఆపరేటర్లకూ వర్తింపజేయాలి. అయితే, ఈ విషయాన్ని తరువాత కాలంలో భారతదేశంలో ఎఫ్ ఎం రేడియో పరిశ్రమ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన తరువాత చర్చించవచ్చు.