కేబుల్ టీవీ కొత్త టారిఫ్ మీద ఎవరి మాట ఎంత నిజం?

కేబుల్ టీవీ డిజిటైజేషన్ లో భాగంగా ట్రాయ్ వెలువరించిన కొత్త టారిఫ్ విధానం మీద పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం మీద, దాని ప్రభావం మీద చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. ఒక నిష్పాక్షిక విశ్లేషణ ద్వారా మాత్రమే నిజానిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇందులో ప్రధాన భాగస్వాములు ట్రాయ్, బ్రాడ్ కాస్టర్, పంపిణీ సంస్థలు, చందాదారు కాబట్టి వాళ్ళ వాళ్ళ కోణాల్లో వాదన, ఆవేదన.నిజానిజాలు  గమనిస్తూ సాగిన సంక్షిప్త పరిశీలన ఇది:

ఎలా ఎంచుకోవాలి ?

నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు రూ.130.  చందాదారు ఇంటివరకూ చానల్స్ తీసుకెళ్ళి ఇస్తున్నందుకు నెట్ వర్క్ కు తీసుకుంటున్న అద్దె ఇది. అందువలన ఇది ఉచిత చానల్స్ అయినా, పే చానల్స్ అయినా అన్నిటికీ వర్తిస్తుంది. మస్ట్ క్యారీ రూల్స్ కింద చందాదారులు కచ్చితంగా 26 దూరదర్శన్ చానల్స్ తీసుకొని తీరాలి. అందువలన చందాదారు రూ. 130 ( ప్లస్ పన్ను) కి పరిమితం కావాలనుకుంటే ముందుగా మిగిలిన 74 చానల్స్ లో పే చానల్స్ తీసుకొని, ఆ తరువాత ఎన్ని మిగిలి ఉంటాయో అవి ఫ్రీ చానల్స్  ఎంచుకోవాలి. ఉదాహరణకు నాలు తెలుగు చానల్స్ ఉన్న బొకేలు తీసుకోవాలనుకుంటే  వాటికోసం 33 చానల్స్ తీసుకుంటున్నట్టు లెక్క. డిడి చానల్స్  పోను మిగిలిన 74 చానల్స్ నుంచి ఈ 33 తీసేస్తే మిగిలేది 41. అంతే తప్ప, ఉచిత చానల్స్ మాత్రమే 100 అనుకోవటం పొరపాటు.

ఇలా తీసుకుంటే పే చానల్స్ కు డబ్బు కట్టనక్కర్లేదనుకోవటం పొరపాటు. చందాదారుడు పే చానల్స్ కు కట్టే డబ్బు బ్రాడ్ కాస్టర్ కు వెళుతుంది. అది విడిగా కట్టాల్సిందే. నిజంగా చందాదారుకు 100 ఉచిత చానల్స్ కావాలని, అవి కాకుండా నాలుగు తెలుగు బొకేలు కావాలనుకుంటే నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద అదనంగా కట్టాలి.  100 చానల్స్ దాటాక ప్రతి 25 చానల్స్ కూ రూ. 20 వంతున కట్టాలి.

ఆ విధంగా 133 చానల్స్ తీసుకుంటే  మొదటి 100 కి రూ. 130, ఆ తరువాత 25 కి రూ.20 మిగిలిన 8 కి రూ. 20 కలిపి రూ. 170 ప్లస్ పన్నులు కేవలం నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కిందనే కట్టాలి. నాలుగు బొకేల ధర 113 ప్లస్ పన్నులు అదనం. అందువలన చందాదారు తన బిల్లు పరిమితం చేసుకోవాలంటే ముందుగా పే చానల్స్ ఏవి తీసుకోవాలో నిర్ణయించుకొని, ఆ తరువాత 100 లో ఎన్ని మిగులుతాయో అన్ని మాత్రమే ఫ్రీ చానల్స్ ఎంచుకోవటం మంచిది.

బొకేల రూపంలో కాకుండా అ లా కార్టే పద్ధతిలో విడివిడిగా కూడా చానల్స్ ఎంచుకోవచ్చు. మా టీవీ తన 4 చానల్స్  తోబాటు స్పోర్ట్స్, నేషనల్ జాగ్రఫిక్ లాంటివి కలిపి కలిపి రూ. 39 ( ప్లస్ పన్నులు) కి ఇస్తోంది. అలా కాకుండా సీరియల్స్ వచ్చే  స్టార్ మా మాత్రమే కావాలనుకుంటే 19 (ప్లస్ పన్నులు) కడితే సరిపోతుంది. అలా తీసుకున్న చానల్స్ అన్నీ కలిపి బిల్లు ఎంత అవుతుందో లెక్కేసుకోవచ్చు. వచ్చేనెల ఇంకొన్ని చానల్స్ కలుపుకోవాలన్నా, తీసుకున్న వాటిలో కొన్ని  తీసెయ్యాలన్నా కుదురుతుంది.

ట్రాయ్ కోణం:

కేబుల్ టీవీ డిజిటైజేషన్ ద్వారా ఈ రంగం వ్యవస్థీకృతమవుతుంది. పారదర్శకత పెరుగుతుంది. చందా ధరలు తగ్గుతాయి అని ట్రాయ్ పదే పదే చెబుతూ వచ్చింది. దశలవారీగా డిజిటైజేషన్ అమలు చేసింది. అనలాగ్ లో 100 చానల్స్ మించి చూడలేని పరిస్థితిలో ప్రేక్షకుల స్వేచ్ఛకోసం డిజిటైజేషన్ తప్పనిసరి అని నమ్మబలికింది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా  ఇందులో భాగస్వాములైన బ్రాడ్ కాస్టర్లు, పంపిణీ సంస్థలు ( డిటిహెచ్, హిట్స్, ఐపిటీవీ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు) , వినియోగదారుల సంఘాల అభిప్రాయాలు తీసుకున్నమీదటే తుది నిర్ణయం వెలువరించానని చెప్పింది. కానీ చందాదారులకు కేబుల్ బిల్లు తగ్గుతుందన్న తప్పుడు అంచనాతో ట్రాయ్ సామాన్య ప్రజల తిట్లు భరించక తప్పలేదు. లాభపడుతున్న బ్రాడ్ కాస్టర్లు, కార్పొరేట్ ఎమ్మెస్వోలను చూస్తున్నప్పుడు సహజంగానే ట్రాయ్ వైపు అనుమానంగా చూడాల్సి వస్తుంది.

అనలాగ్ లో 100 చానల్స్ తో ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాగుతున్న సమయంలో కేవలం డబ్బున్న పట్టణప్రాంత ప్రజల ఎంపిక స్వేచ్ఛ పెరగాలన్న  అభిప్రాయంతో అందరిమీద ఈ భారం మోపటం నిజం. కనీసం 500 చానల్స్ నుంచి ఎంచుకోవచ్చు అని చెప్పినా వాస్తవానికి దేశంలో 75% నెట్ వర్క్స్ లో 400 మించి చానల్స్ లేవు. అప్పుడు 300 పే చానల్స్, 500 పైగా ఉచిత చానల్స్ నుంచి ఎంచుకునే స్వేచ్ఛ ఎలా ఉంటుంది?

పే చానల్స్ తమ నెలవారీ చందా ధర రూ.19 వరకు నిర్ణయించుకునే అవకాశమివ్వటం ట్రాయ్ చేసిన అతి పెద్ద తప్పు. ఒక్కో రకం చానల్ కు ఒక్కో రకమైన పరిమితి విధించాలని చాలామంది చేసిన విజ్ఞప్తిని ట్రాయ్ పెడచెవినపెట్టింది. సినిమాల చానల్స్ కు, స్పోర్ట్స్ చానల్స్ కు గరిష్ఠంగా రూ.19 నిర్ణయించినా మిగిలినవాటికి రూ.5 మించకుండా చూడమని అడిగినా పట్టించుకోలేదు. టీవీ చానల్స్ కు ఖర్చు ఎంతవుతున్నదో లెక్కలు చెబితే దాని ఆధారంగా ధరలు నిర్ణయించటం సమంజసమన్న ప్రతిపాదన వచ్చినప్పుడు చానల్స్ నిరాకరించాయి. ఆ విషయంలో పట్టుబట్టకుండా బ్రాడ్ కాస్టర్లకు తలొగ్గింది.

ప్రేక్షకులు ఆసక్తి చూపని చానల్స్ ను కూడా అంటగట్టే  బొకేల విధానం  అదుపులో ఉంచేలా  చానల్స్ విడి విడి ధరల మొత్తంలో డిస్కౌంట్ 15% మించకుండా బొకే ధర నిర్ణయించాలని చెప్పడం వరకు బాగానే ఉంది. ఇది కచ్చితంగా ధరలను అదుపు చేయటానికి వీలుండే అంశమే. అయితే మద్రాసు హైకోర్టు ఈ నిబంధనను కొట్టివేసినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్న కనీస జ్ఞానం ట్రాయ్ కి లేకపోయింది. నెలల తరబడి ఆలస్యంగా  మేలుకొని వెళితే , మీరు ఇన్నాళ్ళూ నిద్రపోయారా అని సుప్రీంకోర్టు అడగ్గానే  పిటిషన్ వెనక్కు తీసుకొని “బ్రాడ్ కాస్టర్లు తగ్గిస్తే తగ్గవచ్చునేమో వేచి చూద్దాం” అనటం సిగ్గు చేటు.

ఇంత జరిగాక కూడా కొత్త టారిఫ్ ప్రకారం నెలవారీ బిల్లు తగ్గుతుందని పదేపదే వాదించటమే ట్రాయ్ మూర్ఖత్వానికి నిదర్శనం. ట్రాయ్ అధికారులెవరూ క్షేత్ర స్థాయిలో పరిశీలించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కేవలం ఆదేశించటానికే పరిమితమయ్యారు. 6 వ తేదీ నాటికి 20% మంది చందాదారులు కూడా చానల్స్ ఎంపిక పూర్తి చేయలేదని తెలుస్తూ ఉంటే ట్రాయ్ మాత్రం చాలా వరకు పూర్తయినట్టు ప్రకటించుకుంది. రేటింగ్ సంస్థ క్రిసిల్ కొత్త టారిఫ్ ఆర్డర్ లో బిల్లు పెరిగినట్టు సర్వే నివేదిక వెల్లడిస్తే ట్రాయ్ దాన్ని కొట్టిపారేసింది.

బ్రాడ్ కాస్టర్ల కోణం:

టీవీ కార్యక్రమాల నాణ్యత గత పదేళ్లలో ఎంతగా పెరిగిందో తెలుసు. ఆ కార్యక్రమాల నిర్మాణానికి అయ్యే ఈ ఖర్చులన్నీ ప్రకటనల ద్వారా రాబట్టుకోవటం అసాధ్యం. అదే విధంగా  కొత్త సినిమాల శాటిలైట్ హక్కులు కోట్లు ఖర్చు చేసి కొనాల్సి వస్తోంది. ఒకప్పుడు లక్షల్లో ఉన్న ధరలు ఇప్పుడు కోట్లలోకి వచ్చాయి. ఇక స్పోర్ట్స్ ప్రసార హక్కులైతే వేలకోట్లకు చేరాయి. అందువల్లనే కొంతభారం ప్రేక్షకులమీద మోపక తప్పదన్నది పే చానల్ బ్రాడ్ కాస్టర్ల వాదన. అయితే మాత్రం మరీ అంత భారీగా పెంచుతారా అంటే, పదేళ్ళుగా ధరలు పెరగని మాట గమనించాలని కూడా బ్రాడ్ కాస్టర్లు కోరుతున్నారు.

 అసలు ప్రపంచంలో ఏ వస్తువు తయారీ దారుడైనా, ఏ సేవలు అందించే వారైనా వాళ్ళ వస్తువులకు, సేవలకు వాళ్ళే ధరలు నిర్ణయించుకుంటారు గాని మాకు మాత్రం ఇలా పరిమితి పెట్టటమేంటి అనేది వాళ్ళ ప్రశ్న.  విడివిడిగా చానల్స్ అన్నీ తీసుకోలేరు కాబట్టి పెద్ద ఎత్తున డిస్కౌంట్ ఇచ్చి మరీ అందుబాటులో ఉంచామంటున్నారు. అంతే కాదు, చందాదారులనుంచి వసూలయ్యే మొత్తంలో 20% పంపిణీ దారులకు డిస్కౌంట్ రూపంలో పోతుంది. ప్లేస్ మెంట్ రూపంలో మరో 15% వరకు పోవచ్చు. అందువలన బ్రాడ్ కాస్టర్ కు నిజంగా దక్కేది మూడింట రెండొంతులేనన్నదీ వారి వాదన.

అయితే బ్రాడ్ కాస్టర్ల ధన దాహం మీద విమర్శలు తక్కువేమీ లేవు. ఒక ఎంటర్టైన్మెంట్ చానల్ ప్రారంభించి కొంత కాలం గడవగానే సినిమా చానల్, మ్యూజిక్ చానల్, కామెడీ చానల్ అంటూ అదే కంటెంట్ ను రకరకాలుగా విభజించి అన్నిటికీ ఒక్కోరేటు పెట్టి టోకున అమ్మాలనుకోవటం సమంజసమా అనే ప్రశ్నకు సరైన సమాధానం ఉండదు. ఇలా క్లోనింగ్ చానల్స్   తయారుచేసి జనం మీదికి వదలటం మీద చాలా కాలంగా విమర్శలున్నాయి. అయితే, ఈ విమర్శలన్నిటికీ బ్రాడ్ కాస్టర్ చెప్పే ఒకే సమాధానం …తనది వ్యాపారమని. వ్యాపారంలో వీలైనంత సంపాదించుకోవటమే ధ్యేయం కాబట్టి ప్రజల బలహీనతను సొమ్ము చేసుకోవటమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నానని.

ఇక ఉచిత చానల్స్ వాళ్ళ వాదనొకటి ఉంది. కేవలం ప్రకటనల ఆదాయం మీద నడిచే చానల్స్ ను ప్రసారం చేసినందుకు ఎమ్మెస్వోలు కారేజ్ ఫీజు వసూలు చేయటం మరింత భారంగా తయారైందంటున్నారు.ఒక న్యూస్ చానల్ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రసారం కావాలంటే  ట్రాయ్ నిబంధన ప్రకారం కనెక్షన్ కు నెలకు 20 పైసల చొప్పున ఎమ్మెస్వో లకు,  డిటిహెచ్ ఆపరేటర్లకు ఏడాదికి కనీసం ఐదు కోట్లు కట్టాల్సి వస్తుంది. నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద పేరుకు 100 ఉచిత చానల్స్ ఇవ్వాల్సినా అందులో 26 డిడి చానల్స్, 40 దాకా పే చానల్స్ పోను చందాదారుకు కనీసం 40 కూడా మిగలవు. అందులోనూ జనరల్ ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, మూవీస్, ఆధ్యాత్మికం, కామెడీ, స్పోర్ట్స్… ఇలా ఒక్కో రకానికి ఐదేసి ఇవ్వాలన్న నిబంధన ఉండటంతో  న్యూస్ చానల్స్ దెబ్బతింటున్నాయి.  చందాదారుల ఎంపిక కోసం కనీసం 200 చానల్స్ ఇస్తే తప్ప ఈ పరిస్థితి మారదు. ఒక నెట్ వర్క్ లోని చందాదారుల్లో కనీసం 20 శాతంమంది కోరుకోకపోతే అప్పుడు మాత్రమే కారేజ్ ఫీజు వసూలు చేయాలి. కానీ అసలు చందాదారులకు ఎమ్మెస్వో ఆ అవకాశం ఇస్తే కదా? ఇవ్వజూపుతున్నదే తక్కువ చానల్స్ అయినప్పుడు, తనకు కావాల్సిన చానల్స్ అందులో లేనప్పుడు చేయగలిగిందేమీలేదు. అంటే, స్వేచ్ఛ ఇచ్చానంటున్న ట్రాయ్ కేవలం ఎమ్మెస్వో ఇచ్చిన  చానల్స్ కే ఆ స్వేచ్ఛ పరిమితమంటోంది.

ఎమ్మెస్వోలు, ఆపరేటర్ల కోణం:

డిజిటైజేషన్ వలన కనెక్షన్ల సంఖ్య కచ్చితంగా తెలుస్తుందని, కేబుల్ వ్యవస్థ పటిష్టమవుతుందని ప్రభుత్వం చెప్పినప్పుడు రకరకాల ఆలోచనలు మనసులో మెదిలాయి. ఐదు నుంచి పది కోట్ల దాకా వెచ్చించి డిజిటల్ హెడ్ ఎండ్ ( కంట్రోల్ రూమ్) పెట్టుకోవటం అందరికీ సాధ్యం కాదు గనుక ఎమ్మెస్వో అంటే  కనీసం లక్షకు పైగా కనెక్షన్లు ఉంటే తప్ప డిజిటల్ ఎమ్మెస్వోగా మారటం సాధ్యం కాదని తేలిపోయింది. దీంతో వందలాది మంది ఎమ్మెస్వోలు పంపిణీదారులుగా, ఆపరేటర్లుగా మాత్రమే మిగిలిపోయారు. డిజిటైజేషన్ లో కనెక్షన్ల సంఖ్య తెలియటం కూడా మంచిదేనని, ఇన్నాళ్ళూ బ్రాడ్ కాస్టర్లు అనుమానంగా చూస్తూ వచ్చేవారని, ఇకముందు ఆ సమస్య ఉండదని ఎమ్మెస్వోలు ఆలోచించారు.

డిజిటైజేషన్ అమలులో భాగంగా అందరూ సెట్ టాప్ బాక్సులు కొనాల్సి రావటంతో చందాదారులను ఒప్పించటానికి ఇబ్బందులుఎదురయ్యాయి. మొత్తానికి ఆపరేటర్ల సాయంతో ఒప్పించి, కొన్ని చోట్ల సబ్సిడీ  భరించి తగ్గింపు ధరలతో ఇచ్చి మరీ చందాదారులను కాపాడుకోవాల్సి వచ్చింది. ట్రాయ్ విధించిన గడువులోగా దశలవారీగా ఆ పని పూర్తిచేశారు. అయితే, బ్రాడ్ కాస్టర్లు ఎక్కువ వసూళ్ళు చేయటం, చందాదారుల దగ్గర పాత ధరలే వసూలు చెయ్యటం వలన కొత్త టారిఫ్ విధానం అమలులో ఆలస్యం అయ్యేకొద్దీ నష్టాలు భరిస్తూ రావాల్సి వచ్చింది. అందుకే ఎంత త్వరగా టారిఫ్ అమలైతే అంత మంచిదనే అభిప్రాయంతో ఉండేవారు.

అయితే ట్రాయ్ కొత్త టారిఫ్ విధానం ప్రకటించి, కోర్టు తీర్పు కూడా వెలువడిన తరువాత బ్రాడ్ కాస్టర్లు పెట్టిన ధరలు ఎమ్మెస్వోలలో కలవరం రేపాయి. నిజానికి ట్రాయ్ టారిఫ్ ఆర్డర్ ఎమ్మెస్వోలకు అనుకూలంగానే ఉంది. నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు రూ.130 తోబాటు 100 కంటే ఎక్కువ చానల్స్ తీసుకుంటే వచ్చే అదనపు నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు లో కూడా 55% అంటే రూ. 71.50 ఎమ్మెస్వోకు,  45% అంటే రూ. 58.50 ఆపరేటర్ కి చెందాలని, బ్రాడ్ కాస్టర్ తన పే చానల్స్ పంపిణీ చేసినందుకు ఇచ్చే 20% డిస్కౌంట్ కూడా ఇద్దరూ ఇలాగే పంచుకోవాలని చెబుతూ ఆదేశాలలో పేర్కొనటం సంతోషం కలిగించింది. ఎలాగూ కారేజ్ ఫీజు ఆదాయం వస్తుంది. సొంత చానల్స్ లో ప్రకటనల ఆదాయం ఉంటుంది. ఎవరైనా కేబుల్ చానల్స్ వీళ్ళ ద్వారా  నడుపుకోవాలంటే ఫీజు సమర్పించుకోవాల్సిందే.

అయితే బ్రాడ్ కాస్టర్లు ధరలు ప్రకటించిన తరువాత ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. తమకు ఆదాయం పెరిగే మాట నిజమే అయినా చందాదారులమీద అంత భారం మోపితే అంతా డిటిహెచ్ వైపు వెళ్ళిపోతే వ్యాపారానికి మొదటికే మోసం వస్తుందని అర్థమైంది. అందుకే ఉద్యమించారు. మరోవైపి చందాదారును ఒప్పించాల్సిన ఆపరేటర్ కూడా భయపడటంతో ఉమ్మడిగా ఆందోళనబాట పట్టారు.

ట్రాయ్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో చందాదారుడికే అసలు విషయం చెబుదామనే నిర్ణయానికొచ్చారు. అయితే కేబుల్ ఆపరేటర్ తన వాటా విషయంలో పూర్తి అసంతృప్తితో ఉన్నాడు. తాను కష్టపడి నిర్మించుకున్న వ్యవస్థకు తక్కువవాటా రావటం మీద అసహనం మొదలైంది. ఈ వ్యవస్థలో అత్యంత కీలకమైన తనను చిన్న చూపు చూస్తూ తన భవిష్యత్తును అయోమయంలో పడేయటం నచ్చకపోవటంతో ఎమ్మెస్వోలమీద తిరుగుబాటు చేయటం, చాలా మంది ఎమ్మెస్వోలు దిగివచ్చి వాటా పెంచటానికి ఒప్పుకోవటం, మరికొందరు కార్పొరేట్ ఎమ్మెస్వోలు మొండిగా వ్యవహరించటం చూస్తున్నాం.

ఏమైనా, డిటిహెచ్ నుంచి ప్రమాదం పొంచి ఉండటమే ఎమ్మెస్వోను, ఆపరేటర్ ను భయపెడుతోంది. కనీసం ఆ భయమే వీళ్ళిద్దరినీ ఒకటి చేస్తోంది. డిటిహెచ్ నిర్వాహకుడికి క్షేత్ర స్థాయిలో ఆపరేటర్ అవసరం లేకపోవటం వలన నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద వచ్చే  మొత్తం రూ.130 తనకే చెందుతుంది. దీన్ని అవకాశంగా తీసుకొని ఆకర్షణీయమైన స్కీములు పెట్టి చందాదారులను లాక్కుంటాడనే భయం ఉంది. అయితే, ఎప్పుడూ అందుబాటులో ఉండే కేబుల్ ఆపరేటర్ నే చందాదారుడు ఎక్కువగా కోరుకుంటాడన్నది నిరూపితమైన నిజం.

ఎమ్మెస్వోకు కారేజ్ ఫీజు, ప్లేస్ మెంట్ ఫీజు, సొంత చానల్స్  లో ప్రకటనల ఆదాయం, స్థానిక చానల్స్ వాళ్ళిచ్చే ఫీజు..ఇలా రకరకాల ఆదాయాలు వస్తున్నాయి గనుక అందులోనూ వాటా ఇవ్వాలన్నది ఆపరేటర్ల వాదన. ఇంటింటికీ నెట్ వర్క్ నడుపుతూ కేబుల్ కత్తిరింపులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ నిర్వహణ భారం మొత్తం మోస్తున్న తమకు తగిన న్యాయం జరగటం లేదన్న అసంతృప్తి వాళ్ళలో కొనసాగుతూనే ఉంది.

పంపిణీ సంస్థలు బిల్లు వసూలు చేసుకోవటంలో పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ విధానాలలో ఏదైనా ఎంచుకోవటానికి ట్రాయ్ అవకాశమిచ్చింది. అంటే ఈ ఛాయిస్ చందాదారుకు ఇవ్వకుండా డిటిహెచ్ ఆపరేటర్ /ఎమ్మెస్వోకు మాత్రమే ఇచ్చింది. కేబుల్ ఆపరేటర్ కూడా అదే అమలు చేయాలి. మామూలుగా  గ్రామీణ ప్రాంతాల్లో నెలాఖరుకు ఇవ్వటమే కష్టం. కొంతమంది ఏదాదికొకసారి పంట వచ్చాక ఇవ్వటం కూడా అలవాటే. అలాంటప్పుడు ప్రీపెయిడ్ పద్ధతిలో ముక్కుపిండి వసూలు చేయటం ఎలా కుదురుతుందని ఆపరేటర్లు తర్జనభర్జన పడుతున్నారు. బ్రాడ్ కాస్టర్ కు రూ.19 వరకు ధర నిర్ణయించుకోవటానికి ట్రాయ్ అవకాశం ఇచ్చిందే తడవుగా ఆ అవకాశం వాడుకోవటమేంటని ప్రశ్నించే ఎమ్మెస్వోలు తమదాకా వచ్చేసరికి మాట మారుస్తారు.  అవకాశం ఉంది కదా అని దేశవ్యాప్తంగా ప్రతి ఎమ్మెస్వో, ప్రతీ డిటిహెచ్ ఆపరేటర్ ప్రీపెయిడ్ మంత్రమే పఠిస్తున్నారు.

చందాదారుల కోణం:

ఇప్పటిదాకా గ్రామాల్లో రూ. 150, పట్టణ ప్రాంతాల్లో రూ.250 కడితే 200 నుంచి 300 చానల్స్ అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఒక్కసారిగా పెంచేశారు. ఉన్న పద్ధతి మార్చమని మేం అడగలేదుకదా. సెట్ టాప్ బాక్స్ కచ్చితంగా కొనుక్కోవాలంటే కొనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ నెలవారీ బిల్లు మోత ఏంటి?

అయితే, ఇప్పటిదాకా కేబుల్ రంగం ఒక నిర్దిష్టమైన వ్యవస్థగా నడవలేదు. అంటే, చందాదారుల సంఖ్య కూడా తెలియని పరిస్థితి. అందువలన ఆపరేటర్ చెప్పిన కనెక్షన్ల లెక్క ప్రకారమే చెల్లింపు జరిగేవి. ఇచ్చింది తీసుకోవటం తప్ప చేయగలిగేది లేదు గనుక పే చానల్స్ వాళ్ళు అలాగే తీసుకునేవారు. తరువాత కాలంలో కొంత వత్తిడిపెంచి కనెక్షన్లు పెంచి చెప్పేటట్టు కూడా చూసుకున్నారు. ఏమైనప్పటికీ కేబుల్ ఆపరేటర్ చేసిన పనివల్ల చందాదారులమీద భారం కొంత తగ్గింది. ఇప్పుడు కనెక్షన్ల సంఖ్య పెరగటం, ఇంకోవైపు భారీగా పే చానల్ చందారేట్లు కూడా పెరగటం కారణంగా పెనుభారం పడింది. జీఎస్టీ 18% భారం కూడా తోడైంది. మొత్తంగా చూస్తే పదేళ్ళుగా పెరగని ధరలు ఒక్కసారిగా మీద పడ్డట్టయింది.

ధరలు తగ్గించే మార్గం లేదా అనేది మరో ప్రశ్న. బ్రాడ్ కాస్టర్లు మరీ అంత దారుణంగా 19 రూపాయల గరిష్ట ధర వరకూ పెంచకుండా  6-7 రూపాయలకు పరిమితమైతే భారం తగ్గుతుంది. అప్పుడు ఎక్కువ చానల్స్ చూసే అవకాశం వస్తుంది. దానివలన చానల్స్ కు ప్రేక్షకాదరణ పెరిగి ప్రకటనల ఆదాయం కూడా పెరుగుతుంది.  ప్రకటనల ఆదాయం వస్తున్నప్పుడు చందాల రూపంలో కూడా పిండుకోవాలా అనేది మరోప్రశ్న. ప్రకటనల ఆదాయం కూడా ఉండటం వల్లనే ఆ మాత్రం ధర తగ్గించి ఇవ్వగలుగుతున్నాం. లేకపోతే ఇంకా పెరుగుతుంది అంటారు బ్రాడ్ కాస్టర్లు. పత్రికలు కూడా ప్రకటనల ఆదాయంతో బాటు మన దగ్గర నెలవారీ చందా ఎలా తీసుకుంటున్నాయో ఇది కూడా అలాగే అనుకోవాలి.

టీవీలలో ప్రకటనలు  తగ్గించే అవకాశం లేదా? ఇంతకుముందు ముఖ్యంగా కొత్త సినిమాల ప్రసారంలో చెప్పలేనన్ని ప్రకటనలు వచ్చేవి. అసలు సినిమా మధ్య యాడ్స్ చూస్తున్నామా, యాడ్స్ మధ్య సినిమా చూస్తున్నామా అని ఎగతాళి చేసేంతగా పరిస్థితి ఉండేది. అయితే గంటకు 10 నిమిషాల వాణిజ్య ప్రకటనలు, 2 నిమిషాల సొంత కార్యక్రమాల ప్రకటనలు మించకూడదని ట్రాయ్ చెప్పిన తరువాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. అయితే కొన్ని ఎంటర్టైన్మెంట్ చానల్స్ ఇప్పటికీ పరిమితి మించుతున్నట్టు ట్రాయ్ లెక్కలుగట్టి ప్రతి ఆరు నెలలకూ వెబ్ సైట్ లో పెడుతూనే ఉంది. ఈ వ్యవహారం ఆరేళ్ళుగా కోర్టులో ఉండటం వలన ఇప్పటికిప్పుడు చేయగలిగిందేమీలేదు.

నిజానికి ప్రకటనలు రాగానే జనం చానల్స్ మార్చటం కూడా చూస్తుంటాం. అలా మార్చటం ఎక్కువైతే ప్రకటనలు ఇచ్చేవాళ్లు కూడా ఇవ్వరు. వారం వారం లెక్కగట్టే రేటింగ్స్ లో కార్యక్రమాల ప్రేక్షకాదరణ ఒక్కటే కాదు, ప్రకటనల విరామంలో ఎంతమంది చూస్తున్నారనేది ( బ్రేక్ పెర్ఫార్మెన్స్) కూడా ముఖ్యం. దాన్ని బట్టే ప్రకటనలిచ్చేవాళ్ళు ఇస్తారు. అందువలన చానల్స్ వాళ్ళు జాగ్రత్తగానే ఉంటున్నారు, ఉంటారు కూడా. ఏ మాత్రం ఎక్కువ ప్రకటనలున్నా, ప్రేక్షకులు చానల్ మార్చేస్తారన్న సంగతి వాళ్ళకూ తెలుసు.

తక్షణ కర్తవ్యం ఏంటి? పెరిగిన ధరలు తగ్గాలంటే బొకేలు కాకుండా కొన్ని ఎంపిక చేసుకున్న చానల్స్ మాత్రమే అ లా కార్టే పద్ధతిలో తీసుకొని ఓపిక పట్టటం మంచిది. కచ్చితంగా పే చానల్స్ ధరలు తగ్గిస్తాయి. సీరియల్స్ కు అలవాటుపడిన వాళ్ళ బలహీనతే ఈ భారీ పెరుగుదలకు కారణం. అందువలన అవి చూడకపోయినా నష్టం లేదన్న అభిప్రాయానికి రాగలిగితే విజయం సాధించినట్టే.

తోట భావనారాయణ

9959940194 se��o�D�

2 thoughts on “కేబుల్ టీవీ కొత్త టారిఫ్ మీద ఎవరి మాట ఎంత నిజం?

 • February 6, 2019 at 2:44 PM
  Permalink

  చాలా బాగా వివరణ ఇచ్చారు .తెలియని విషయాలు మీ ద్వారా తెలిసిన తరువాత అపరేటర్స్ జీవనాధారం ప్రశ్నర్ధకం.ఎందుచేతనంటే ఆపరేటర్ కష్టమరని దేవుడు అనుకుంటున్నాడు. కానీTRAI , బ్రాడ్కస్టర్స్, కార్పొరేట్ సంస్థలు,MSO లు ఆపరేటర్ ని ఒక యంత్రం గాను,బానిసుడు గాను అనుకుంటున్నారు.
  M P D ప్రసాద్(లక్ష్మీప్రసాద్)
  అమలాపురం డివిజేన్
  తూర్పుగోదావరి జిల్లా
  ఆంద్రప్రదేశ్
  9299998867

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!