కొత్త టారిఫ్ ఆర్డర్ తో తగ్గిన పే చానల్ కనెక్టివిటీ

ట్రాయ్ ప్రకటించిన టారిఫ్ ఆర్డర్ అమలు వలన బ్రాడ్ కాస్టింగ్ రంగంలో తీవ్రమైన ఒడిదుడుకులు నమోదవుతున్నాయి. ఒక్క సారిగా ఉచిత చానల్స్ చూసేవాళ్ళ సంఖ్య పెరగటం ఒక పరిణామమైతే, అదే సమయంలో పే చానల్స్ కనెక్టివిటీ పడిపోవటం రెండో ముఖ్యమైన మార్పు. ఒక్కో రకమైన పే చానల్ కనెక్టివిటీ ఒక్కో రకంగా ఉన్నప్పటికీ ఇది కచ్చితంగా బ్రాడ్ కాస్టర్లను ఆలోచనలో పడేసే విషయమే.

ఎమ్మెస్వోలు కావచ్చు, డిటిహెచ్ ఆపరేటర్లు కావచ్చు….పంపిణీ సంస్థలన్నిటికీ కొత్త టారిఫ్ అర్డర్ అమలు చేయటం పెను సవాలుగా మారింది. పాత చందాలకు అలవాటు పడిన ప్రేక్షకులు కొత్తగా పే చానల్స్ ను ఎంచుకోవటానికి బాగా తటపటాయిస్తున్నారు. బిల్లు భారం తడిసి మోపెడవుతుందని అర్థం కావటంతో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నారు. పంపిణీ సంస్థలు కూడా వీలైనంత వరకు బొకేల జోలికి వెళ్ళకుండా అలా కార్టే పద్ధతిలో తీసుకోవాల్సిందిగా సలహా ఇవ్వటం వలన చాలా పే చానల్స్ చందాదారులకు దూరమవుతున్నాయి.

ఈ తగ్గుదల కొన్ని చానల్స్ విషయంలో 0.5 శాతమే ఉన్నప్పటికీ కొన్ని చానల్స్ లో 61 శాతం వరకు నమోదైంది. పే చానల్ చందాలు తగ్గటం ఒక కోణమైతే, తమ చానల్స్ చాలావరకు ప్రేక్షకులకు అందుబాటులో ఉండకపోవటం వలన ప్రకటనల ఆదాయం తగ్గిపోతుందన్న భయం చానల్స్ లో మొదలైంది. పంపిణీ సంస్థలు చందాదారుల ఎంపిక ప్రకారం యాక్టివేట్ చేయటంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కోవటం ఇందుకు ప్రధాన కారణం కావచ్చునని కొన్ని చానల్స్ విశ్లేషిస్తున్నాయి.

క్రోమ్ డిఎం నివేదిక ప్రకారం ఇంగ్లిష్ పే చానల్స్ కనెక్టివిటీ 24 శాతం పడిపోగా రిపబ్లిక్ టీవీ, న్యూస్ ఎక్, చానల్ న్యూస్ ఏషియా లాంటి ఉచిత చానల్స్ 6 శాతం పైగా లబ్ధిపొందాయి. పిల్లల చానల్స్ అటు పే అయినా, ఇటు ఫ్రీ అయినా దాదాపు 24 శాతం తగ్గుదల నమోదు చేసుకున్నాయి. ఆసక్తి కరమైన విషయమేంటంటే మహా కార్టున్ నెట్ వర్క్ మాత్రం 8 శాతం పెరిగింది. హిందీ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ తగ్గుదల నామమాత్రంగా ఉంది.

ట్రాయ్ టారిఫ్ ఆర్డర్ అమలులోకి రావటానికి ముంది సుమారు 350 చానల్స్ అందుబాటులో ఉండేవని, ఇప్పుడు అమలులోనికి వచ్చిన తరువాత సగటున 100 ఉచిత చానల్స్, 50 పే చానల్స్ మాత్రమే తీసుకుంటున్నారని మాడిసన్ గ్రూప్ సీఈవో విక్రమ్ సఖుజా తేల్చి చెప్పారు. అప్పట్లో 90 శాతం పైగా పంపిణీ జరిగి 35% మందిని చేరుతూ వచ్చిన చానల్స్ ఇప్పుడు 30 శాతం పంపిణీతో 30 శాతం మందిని చేరుతున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!