చందాదారులకే రేటింగ్స్ లెక్కలు

టారిఫ్ ఆర్డర్ అమలు జరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకులమీద రేటింగ్స్ ప్రభావం కనబడకుండా ఉండటానికి బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) చర్యలు ప్రారంభించింది. కేవలం చందాదారులకు మాత్రమే రేటింగ్స్ సమాచారం ఇవ్వాలని నిర్ణయించింది. మామూలుగా అయితే బార్క్ వెబ్ సైట్ లో వారం వారం రేటింగ్స్ కి సంబంధించి కొంత ప్రాథమిక సమాచారం కనిపిస్తుంది. కానీ ఈవారం మాత్రం టారిఫ్ ఆర్డర్ అమలు జరుగుతున్నందున కొంతకాలం పాటు అందుబాటులో ఉండబోదని బార్క్ పేర్కొంది.

అడ్వర్టయిజర్స్  ఇప్పటికే బార్క్ రేటింగ్స్ కనీసం ఆరువారాలపాటు  లెక్కలోకి తీసుకోవద్దని నిర్ణయించుకున్నారు. ప్రేక్షకులు చానల్స్ ఎంచుకోవటం ఇంకా పూర్తికాలేదు కాబట్టి గత రేటింగ్స్ ఆధారంగానే ప్రకటనలు ఇవ్వాలి తప్ప ఒడిదుడుకులు నమోదయ్యే ఈ సమయంలో రేటింగ్స్ లెక్కలు నిజమైన ప్రేక్షకాదరణకు అద్దం పట్టబోవని తేల్చి చెప్పారు.

దీంతో పే చానల్స్ అధిక ధరలకు నిరసనగా చానల్స్ ను కొంతకాలం బహిష్కరించినా ఆ ప్రభావం రేటింగ్స్ మీద ఉండదు. ఉన్నా, ఆ రేటింగ్స్ ను పట్టించుకోవటానికి అడ్వర్టయిజర్సే సిద్ధంగా లేనప్పుడు బ్రాడ్ కాస్టర్లకే అది లాభదాయకం. అదే విధంగా రేటింగ్స్ సమాచారం సామాన్య ప్రేక్షకులకు తెలియకుండా బార్క్ తీసుకున్న ఈ నిర్ణయం సైతం బ్రాడ్ కాస్టర్లకే మేలు చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!