కోర్టుకు చెప్పకుండా గడువు పెంచటమేంటి?

టారిఫ్ ఆర్డర్ అమలు చేయటం మొదలు పెట్టిన తరువాత కోర్టుకు తెలియకుండా మార్పులు ఎలా చేస్తారని ఢిల్లీ హైకోర్టు ట్రాయ్ ని ప్రశ్నించింది.  ఈ విషయమై వారంలోగా ట్రాయ్ చైర్మన్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజేంద్ర మీనన్ ఈ రోజు ఆదేశించారు.

ఇది విధివిధానాలలో భాగమని కొంతమంది భావిస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం ట్రాయ్ ఈ భారీ కార్యక్రమంలో మార్పులు చేసేటప్పుడు కోర్టుకు తెలియజేసి ఉండాల్సిందని అంటున్నారు.  ఈ ప్రక్రియలో అనుకోని అవాంతరాలుఎదురుకావటం సహజం కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని తొలగించుకుంటూ ముందుకు సాగే క్రమంలో కొన్ని నిర్ణయాలు అనివార్యం కాకపోవచ్చునని వాదించే వాళ్ళు ఉన్నారు. అయితే, కోర్టుకు ట్రాయ్ ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందన్నదే చూడాల్సి ఉంది.

చానల్స్ ఎంచుకోని చందదారులకు మార్చి 31 వరకూ గడువు ఇస్తూ ట్రాయ్ మంగళవారంనాడు పత్రికాప్రకటన విడుదల చేయటం తెలిసిందే. అదే విధంగా, ఎంచుకోని చందాదారులకు అత్యుత్తమ చందా ప్లాన్ అమలు చేయాలని కూడా ఆపరేటర్లకు సూచించింది. కేవలం చందాదారులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్పింది. మారుమూల ప్రదేశాలవారికి ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవటం కూడా ఎంపికలో ఆలస్యానికి కారణమని పేర్కొంది.

అయితే, ఈ పిటిషన్ దాఖలు చేసిన డిస్కవరీ ఇండియా కమ్యూనికేషన్ మాత్రం ట్రాయ్ ఉద్దేశాలను ఎండగట్టింది. ట్రాయ్ ఉద్దేశపూర్వకంగానే ఫిబ్రవరి 6న  500 పేజీల అఫిడవిట్ దాఖలు చేసిందని ఆ సంస్థ తరఫు న్యాయవాది గోపాల్ జైన్ వాదించారు. అదే విధంగా అత్యుత్తమ చందా ప్లాన్ పేరుతో చందాదారుల స్వేచ్చను ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్ల చేతిలో పెట్టినట్టయిందని కూడా ఆరోపించారు.

ట్రాయ్ తరఫున వాదించటానికి సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవటం వలన వాయిదా వేయాలని ట్రాయ్ కోరింది. దీంతో ఈ కేసును ఫిబ్రవరి 21కి వాయిదా వేసినప్పటికీ, ట్రాయ్ మాత్రంవారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని చీఫ్ జస్టిస్ ఆదేశించారు. చందాదారుల స్వేచ్ఛ గురించి పదే పదే మాట్లాడే ట్రాయ్ చివరికి ఈ స్వేచ్ఛను పంపిణీదారుల చేతుల్లో పెట్టటం మీదనే ప్రధానంగా ఈ కేసు నడిచే అవకాశాలు కనబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!