టీవీ రేటింగ్స్ విధానం సమీక్ష: సలహాల గడువు పెంచిన ట్రాయ్

భారత దేశంలో టెలివిజన్ ప్రేక్షకుల లెక్కింపు, రేటింగ్స్ విధానం మీద సమీక్షించటానికి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన చర్చా పత్రం మీద అభిప్రాయాలకు గడువు ఈ నెల 15 వరకుపొడిగించింది. ఆ అభిప్రాయాలను వెబ్ సైట్ లో పెట్టి వాటిమీద స్పందించటానికి 28 వరకు అవకాశం కల్పించింది.

ఇప్పుడున్న రేటింగ్స్ విధానం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటానికి, కచ్చితత్వం పెంచటానికి, విస్తృతిని పెంచటానికి తీసుకోవాల్సిన చర్యలమీద సంబంధితులందరి అభిప్రాయాలనూ సేకరించటమే లక్ష్యంగా ఈ చర్చా పత్రం విడుదల చేసినట్టు  ట్రాయ్ చెప్పుకుంది.   ప్రస్తుత విధానంలో తటస్థత, విశ్వసనీయత అనే అంశాలమీద కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశంలో  అమలులో ఉన్న టెలివిజన్ ప్రేక్షకుల లెక్కింపు, రేటింగ్స్ విధానాన్ని సమీక్షించవలసి వచ్చిందని ట్రాయ్ పేర్కొంది.

ట్రాయ్ తాను స్వయంగానే ఈ చర్చా పత్రం విడుదల చేసినట్టు చెప్పుకోవటం ద్వారా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కోరలేదని కూడా తెలియజేసినట్టయింది. సాధారణంగా మంత్రిత్వశాఖ రాసిన లేకఖ ఆధారంగా ఇలాంటి చర్చాపత్రాలు జారీ అవుతుంటాయి. అయితే, ట్రాయ్ స్వయంగా కూడా చర్చకు అవకాశమిచ్చి తన సిఫార్సులు మంత్రిత్వశాఖకు పంపవచ్చు.

ఈ చర్చా పత్రం విడుదల చేయటానికి ముందే ట్రాయ్ బ్రాడ్ కాస్టింగ్, అడ్వర్టయిజింగ్ పరిశ్రమలు, అడ్వర్టయిజర్లు వంటి సంబంధిత వర్గాలతో ముందస్తు చర్చలు జరిపినట్టు ట్రాయ్ పేర్కొంది. ఆ విధంగా రాబట్టిన అభిప్రాయాల సాయంతోనే  ఈ చర్చా పత్రం విడుదలచేసినట్టు వెల్లడించింది. ఎక్కువమంది బ్రాడ్ కాస్టర్లు ప్రస్తుతమున్న  బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్) సంతృప్తి వ్యక్తం చేశారని ట్రాయ్ తెలియజేసింది. అయితే, ప్రస్తుత విధానాన్ని లోపరహితంగానూ, విశ్వసనీయంగానూ మార్చటానికి మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కూడా కొందరు సూచించినట్టు పేర్కొంది.

ఈ రేటింగ్ లెక్కింపు వ్యవస్థను  మరింత పారదర్శకంగా, తటస్థంగా, విశ్వసనీయంగా, నిష్పాక్షికంగా మార్చటానికి సాంకేతికంగా ఎలాంటి అవకాశాలున్నాయో పరిశీలించటం కూడా ఈ చర్చా పత్రం లక్ష్యమని ట్రాయ్ పేర్కొంది.

బ్రాడ్ కాస్టర్ల ఆదాయంలో ప్రధాన భాగం ప్రకటనల ద్వారా వచ్చే విషయాన్ని గుర్తు చేస్తూ, అలాంటి ఆదాయ వనరు ఆధారపడే రేటింగ్స్ లెక్కింపు విధానం విశ్వసనీయంగానూ, పారదర్శకంగానూ, ప్రాతినిధ్యం వహించేలాగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉన్నట్టు గుర్తించటం వల్లనే ఈ సమీక్ష చేపట్టినట్టు తెలియజేసింది.

సాపేక్షదోషాన్ని కనీస స్థాయిలో ఉంచగలిగేలా కొత్త విధానాలు రూపు దిద్దాల్సిన అవసరముందని ట్రాయ్ అభిప్రాయపడింది. ప్రస్తుతం బార్క్ ఇస్తున్న రేటింగ్స్ కూడా ఒక రకంగా అంచనాలు మాత్రమేనని,  ప్రతి అంచానాలో దోషం ఏ స్థాయిలో  ఉన్నదనేదాన్నిబట్టి విశ్వసనీయత ఆధారపడి ఉంటుందని పేర్కొంది. దోషం రావటానికి ప్రధానకారణాలుగా శాంపిల్ సైజును, అది ఏ మేరకు చొచ్చుకుపోతున్నదనే అంశాలను గుర్తించామని వెల్లడించింది.

కొన్ని న్యూస్ చానల్స్ నిజానికి వార్తలతో సంబంధంలేని జనాకర్షక కార్యక్రమాలను ప్రసారం చేయటం ద్వారా, ఇతర భాషలో ప్రసారం చేయటం ద్వారా రేటింగ్స్  సంపాదిస్తున్నాయని కూడా ట్రాయ్ గుర్తించింది. అలాంటి కార్యక్రమాలు ఎక్కువమందిని ఆకట్టుకోవటం ద్వారా ఆ వర్గంలోని చానల్స్ లో  రేటింగ్స్ ను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంది.

ప్రధానమైన సమస్య ఏంటంటే అలాంటి చానల్స్ కేవలం అలాంటి ఆకర్షణీయమైన కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అదే తరహా మిగిలిన చానల్స్ మీద అనుచితమైన లాభం పొందుతున్నాయని ట్రాయ్ అభిప్రాయపడింది.

ఈ చర్చా పత్రం మీద లిఖితపూర్వకమైన అభిప్రాయాలను జనవరి 2, 2019 లోగా పంపాలని, వాటిమీద వ్యాఖ్యలు పంపటానికి జనవరి 15 గడువుగా నిర్ణయిస్తున్నామని ట్రాయ్ పేర్కొంది.

స్థూలంగా చర్చకు పెట్టిన అంశాలు ఇవి:

1.బార్క్  ఏర్పాటులో ప్రధాన లక్ష్యాలైన  నిష్పాక్షికత, పారదర్శకతలను అది పూర్తిగా సాధించగలిగిందని అనుకుంటున్నారా? మీ సమాధానాన్ని ఉదాహరణ సహితంగా విశదీకరించండి. అదే విధంగా బార్క్ ఇచ్చే టీవీ రేటింగ్స్ సమర్థంగానూ, నిష్పాక్షికంగానూ, పారదర్శకంగానూ ఉండాలంటే ఎలాంటి పద్ధతులు అనుసరించాలో కూడా సూచించండి.

2. బార్క్ తటస్థ వైఖరి, పారదర్శకత  అనుసరించటానికి అనువుగానే ఇప్పుడున్న దాన్ని యాజమాన్య వ్యవస్థ ఉందనుకుంటున్నారా? అంటే దాని భాగస్వామ్యులైనబ్రాడ్ కాస్టర్లు, అడ్వర్టయిజర్లు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలు సరిపోతాయా?మరింత విశ్వసనీయత, తటస్థత పెంచటానికి ఏం చేయాలి. మీవాదన సమర్థించుకోవటానికి వివరంగా రాయండి.

3. పారదర్శకత, తటస్థత, నిష్పాక్షికత పెంచటానికి టెలివిజన్ రేటింగ్ సర్వీస్ లో పోటీని పెంచాల్సిన ఆవసరం ఉందనుకుంటున్నారా? టీవీ రేటింగ్ సేవలు మరింత కచ్చితంగానూ, అందరికీ ఆమోదయోగ్యంగానూ ఉండటానికి  ట్రాయ్ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ వాదనను సమర్థించుకోవటానికి వివరంగా రాయండి.

4. ప్రస్తుతం బార్క్ వాడుతున్న ప్రేక్షకాదరణ లెక్కింపు విధానం సరైనదేనా? ఇప్పుడున్న విధానాన్ని మెరుగు పరచటానికి మీ దగ్గర ఏవైనా సూచనలుంటే చెప్పండి.

5. చానల్ తరహాకి భిన్నమైన కార్యక్రమాలు, చానల్ భాషకు భిన్నమైన భాషలో ప్రసారాలు చేర్చటం వలన అవి టెలివిజన్  రేటింగ్స్ లెక్కను దెబ్బతీస్తున్నాయనుకుంటున్నారా? అదే అయితే, దాన్ని అడ్డుకోవటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే సమంజసమనుకుంటున్నారు?

6. పరిమితమైన సంఖ్యలో ఇళ్ళను తీసుకొని వాటి సాయంతో రేటింగ్స్ లెక్కగడుతూ ఉన్నప్పుడు ఆ ఇళ్ళు అందరు ప్రజలకూ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చెప్పగలమా? 

7. రేటింగ్స్ ను దొడ్డిదారిన ప్రభావితం చేయటానికి శాంపిల్ ఇళ్ళ డేటాను మేనేజ్ చేసే అవకాశాన్ని తగ్గించటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ వ్యాఖ్యల మీద సోదాహరణంగా వివరణ ఇవ్వండి   

8. ప్రేక్షకుల అభిరుచి కచ్చితంగా ప్రతిబింబించాలంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో శాంపిల్ సైజు ఎలా ఉండాలని అనుకుంటున్నారు? 

9. భారతదేశంలో ప్రేక్షకుల శాంపిల్ సైజు అత్యంత వేగంగా పెరగాలంటే ఎలాంటి విధానం/ సాంకేతిక పరిజ్ఞానం అవసరమని మీరు భావిస్తున్నారు?  అలాంటి పరిష్కార మార్గాలు అమలు చేయటంలో ఇమిడి ఉన్న వాణిజ్యపరమైన అంశాలను కూడా చర్చించండి.

10. పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, డిటిహెచ్.హిట్స్/ఐపిటీవీ ఆపరేటర్లు ప్రేక్షకాదరణ సమాచారాన్ని ఎలక్ట్రానిక్ విధానంలో సేకరించేలా నిబంధనలు రూపొందించాలా?  రేటింగ్స్ సమర్థంగా ఉండటానికి చందాదారుల ఆమోదంతో ఎక్కువ సమాచారం సేకరించటం ఎంతవరకు మంచిదో వివరణతో వ్యాఖ్యానించండి. 

11. సెట్ టాప్ బాక్స్ నుంచి రివర్స్ పాత్ ద్వారా  ప్రేక్షకులు చూసిన చానల్స్ వివరాలు సేకరించాలనుకుంటే ఎంత శాతం సెట్ టాప్ బాక్సులకు ఈ పరిజ్ఞానం అనుసంధానం చేయాల్సి ఉంటుంది?  ఇప్పుడున్న సెట్ టాప్ బాక్సుకు బదులు ఇలాంటిది పెడితే ఎంత అదనంగా ఖర్చవుతుంది? ఉన్న బాక్సులకే ఆ పరిజ్ఞానం జోడిస్తే ఎంత ఖర్చవుతుంది? మీ సూచనలను సోదాహరణంగా వివరించండి.

12. వ్యక్తిగత సమాచారాన్ని కాపాడటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారి సమాచార గోప్యత కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

13. ఏ స్థాయిలో గోప్యత పాటిస్తే టీవీ ప్రేక్షకాదరణ సమాచార లెక్కింపు సంస్థ ప్రధానమైన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా సమాచారం సేకరించగలిగే అవకాశముంటుంది? 

14. శాంపిల్ ఇళ్ళ సమాచారంల్కి చ్రబడకుండా చూడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ సమాధానాన్ని సవివరంగా సోదాహరణంగా వివరించండి. 

15. బార్క్ తాను సేకరించిన డేటా మొత్తాన్ని బ్రాడ్ కాస్టర్ కు ఇవ్వటం సమంజసమా? అదే సమంజసమనుకుంటే శాంపిల్ గా ఎంచుకున్న ఇళ్ళ రహస్యాన్ని కాపాడటం కుదురుతుందా?

16. అలా సేకరించిన సమాచారం మొత్తాన్ని బ్రాడ్ కాస్టర్ కి ఇవ్వటం వలన అది ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నిర్దేశించిన విధానపరమైన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టు అవుతుందా?

17. ప్రస్తుత విధానంలో వెల్లడిస్తున్న పద్ధతి ఇప్పటి మార్గదర్శకాల నేపథ్యంలో సరిపోతుందని అనుకుంటున్నారా? కాదనుకుంటే, అదనంగా ఇంకా ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టవచ్చునో చెప్పండి

18. సంబంధిత వర్గాలు ప్రస్తుత చర్చనీయాంశానికి సంబంధించిన మరేదైనా కోణం  మీద కూడా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చు.  n

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!