• Home »
  • Cable »
  • ఢిల్లీ కేబుల్ ప్రేక్షకులమీద రెట్టింపు పన్నుభారం

ఢిల్లీ కేబుల్ ప్రేక్షకులమీద రెట్టింపు పన్నుభారం

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కేబుల్ టీవీ మీద వినోదపు పన్ను ను నెలకు 20 రూపాయలనుంచి 40 రూపాయలకు పెంచింది. ఈ రెట్టింపు ప్రతిపాదనను రాష్ట్ర బడ్జెట్ లో వెల్లడించారు. కేబుల్ టీవీ మీద, డిటిహెచ్ ఆపరేటర్ల మీద ఆయా రాష్ట్రప్రభుత్వాలు విధించే వినోదపు పన్ను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉండగా మహారాష్ట్రలో నెలకు ఒక్కో కనెక్షన్ కు అత్యధికంగా రూ.45 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం రూ. 20 నుంచి 40 కి పెంచింది.

ఇప్పటివరకు అనలాగ్ విధానంలో ప్రత్యేకంగా పన్ను పేరుతో వసూలు చేయకుండా ఏకమొత్తంగా నెలవారీ చందా వసూలు చేయటం కేబుల్ ఆపరేటర్లకు ఆనవాయితీ. ఎమ్మెస్వోలు ఆ మొత్తంలో వినోదపు పన్నును ప్రభుత్వానికి చెల్లిస్తారు. అయితే, చాలామంది ఎమ్మెస్వోలు ప్రభుత్వానికి సరిగా పన్ను చెల్లించటంలేదన్న అధికారుల ఫిర్యాదులు తరచూ వినబడుతుండేవి. ఇప్పుడు డిజిటైజేషన్ పూర్తయినచోట స్పష్టంగా కేబుల్ కనెక్షన్ల సంఖ్య తేలటంతో పన్ను సక్రమంగా వసూలయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా కనీసం 50 శాతం అదనపు వసూళ్ళకు అవకాశం ఉండగా ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ఒకేసారి రెట్టింపు పన్ను వసూలుకు ప్రతిపాదించటంతో ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముంది.

ఈ పెంపు వినియోగదారులే భరించాలన్న విషయానికి తగిన ప్రాచుర్యం కల్పించిన తరువాత పెంచితే బాగుండేదని ఢిల్లీ కేబుల్ ఆపరేటర్లు భావిస్తున్నారు. అంటే, ప్రస్తుత బిల్లింగ్ విధానంలో స్పష్టంగా వినోదపు పన్ను కూడా చేర్చి ఇస్తారు కాబట్టి ఈ భారం వినియీగదారులమీదనే పడుతుంది. అయితే, ఒకే ఇంట్లో రెండు కేబుల్ లేదా డిటిహెచ్ కనెక్షన్లుంటే రెట్టింపు వినోదపు పన్ను వసూలు చేయటం తగదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. వినోదపు పన్ను వసూలు చేసినందుకు కేబుల్ ఆపరేటర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వటం సమంజసమని భారత కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య అధ్యక్షురాలు రూప్ శర్మ అభిప్రాయ పడుతున్నారు.