• Home »
  • Channel Info »
  • త్వరలో అన్నాడిఎంకె వారి ’అమ్మ టీవీ’

త్వరలో అన్నాడిఎంకె వారి ’అమ్మ టీవీ’

జయ లలిత సన్నిహిత సహచరురాలు శశికళతో బాటు ఆమె అక్క కుమారుడైన టిటివి దినకరన్ దూరం కావటంతో పార్టీ ప్రచారానికి ఇబ్బంది కలుగుతున్నట్టు అన్నాడిఎంకె నాయకులు గ్రహించారు. పార్టీ ప్రచారం కోసం ఇప్పటిదాకా నమదు ఎంజీఆర్ పేరుతో ఒక పత్రిక, దినకరన్ ఆధ్వర్యంలోని జయా టీవీ బాగా పనిచేస్తూ వచ్చాయి. కానీ మారిన పరిస్థితుల్లో ఈ రెండు ప్రచార మాధ్యమాలూ శశికళ, దినకరన్ వర్గం చేతుల్లోకి వెళ్ళటం, అన్నాడిఎంకె మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉండటంతో అన్నాడిఎంకె నాయకులు తమను సమర్థించుకోవటానికి ఒక చానల్ అత్యవసరమనే నిర్ణయానికొచ్చారు.

ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పనీర్ సెల్వం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై ఒక పత్రిక, చానల్ వెంటనే ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. “ నమదు అమ్మ “ పేరుతో పార్టీ పత్రిక ఈ నెల 17న ప్రారంభం కాబోతోంది. టీవీ చానల్ కు అమ్మ టీవీ అనే పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నప్పటికీ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అనుమతులు వచ్చిన తరువాతనే పేరు, ప్రారంభతేదీ వెల్లడించాలని భావిస్తున్నారు. రెండాకుల గుర్తు అన్నాడిఎంకె పార్టీకే ఉండిపోయినా జయాటీవీ కూడా రెండాకుల గుర్తుతోనే ఉండటంతో ఇప్పుడు అమ్మా టీవీ లోగో ఎలా ఉండాలో త్వరలో నిర్ణయిస్తారు.