పే చానల్స్ కు అడ్వర్టయిజర్ల అండ: రేటింగ్స్ బేఖాతరు

పే టీవీ చానల్స్ కు చందా ఆదాయంతోబాటు ప్రకటనల ఆదాయం కూడా వస్తుంది. ఇలా రెండు రకాల ఆదాయం పొందుతూ కూడా ఇంత భారీగా చందా రేట్లు పెంచటం  మీద సహజంగానే వీక్షకులు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఎక్కువ చందా రేట్లు నిర్ణయించిన చానల్స్ కు దూరంగా ఉండాల్సిందిగా చాలామంది వీక్షకులకు సూచిస్తున్నారు. అలా చూడకపోతే రేటింగ్స్ పడిపోయి ప్రకటనల ఆదాయం రాకపోతే పే చానల్ యజమానులు దిగి వచ్చి ధరలు తగ్గిస్తారనేది వాళ్ళ వాదన.

 నిజానికి ప్రేక్షకాదరణ తగ్గితే ఆ భయంతో బ్రాడ్ కాస్టర్ కచ్చితంగా తగ్గిస్తాడని ట్రాయ్ కూడా అంచనా వేస్తూ వస్తోంది. అంతే కాదు, ఆ విషయం బ్రాడ్ కాస్టర్ కు తెలిసిరావాలంటే ఈ కొత్త టారిఫ్ ఆర్డర్ కు మారే కాలంలో కూడా ఆపకుండా రేటింగ్స్  లెక్కించాలని రేటింగ్స్ లెక్కింపు సంస్థ  బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్)  ను ట్రాయ్ కోరింది. బార్క్ కూడా అందుకు సరేనంటూ లెక్కింపు కొనసాగిస్తోంది.

కానీ ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టయిజర్స్ ( ఐ ఎస్ ఎ) మాత్రం బ్రాడ్ కాస్టర్లకు అండగా నిలబడింది. ఈ సమయంలో వచ్చే బార్క్ రేటింగ్స్ ను పట్టించుకోకుండా ప్రకటనలివ్వాలని తన సంఘ సభ్యులైన ప్రకటన కర్తలను కోరింది. సహజంగానే రేటింగ్స్ లో ఒడిదుడుకులు ఉంటాయి గనుక ఆ సమాచారాన్ని లెక్కలోకి తీసుకొని ప్రకటనలు జారీ చేయకుండా, గత మూడు నెలల సగటు రేటింగ్స్ ఆధారంగా ప్రకటనల జారీ నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చింది.

ఇప్పుడున్న పరిస్థితులలో రేటింగ్స్ ల్ తీవ్రమైన మార్పులు కనబడే అవకాశముందని, అది నిజమైన వీక్షకాదరణను ప్రతిబింబించే అవకాశం లేదు గనుక దాని ఆధారంగా చానల్ మీద అంచనాకు రావటం సమంజసం కాదని అభిప్రాయపడింది. రేటింగ్స్ కు ఒక స్థిరమైన రూపం రావటానికి కనీసం ఆరు వారాలు పట్టే అవకాశం ఉంది గనుక ఈ ఆరు వారాల్లో రేటింగ్స్ ను పట్టించుకోవద్దని కూడా ఫిబ్రవరి 4 న సంస్థ చైర్మన్ సునీల్ కటారియా జారీ చేసిన సూచన పేర్కొంది.

టారిఫ్ ఆర్డర్ అమలు ఆకస్మికంగా జరగటం, దేశవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పంపిణీ విధానం, బ్రాడ్ కాస్టర్ల ధరలు, చానల్స్ ఉండటం వలన ఆ ప్రభావాన్ని  అంచనా వేయటం కూడా సాధ్యమయ్యే పని కాదని సంస్థ ఎగ్జిక్యుటివ్ కౌన్సిల్, కోర్ మీడియా కమిటీ అభిప్రాయపడ్డాయని, బార్క్ కి కూడా అదే విషయం తెలియజేశామని ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టయిజర్స్ పేర్కొంది. అందుకే కొంత కాలం వేచి చూసే ధోరణి అవలంబించటం మంచిదని అభిప్రాయపడింది.

సోనీ లాంటి బ్రాడ్ కాస్టర్లత్ బాటు మాడిసన్ మీడియా , హవాస్ మీడియా గ్రూప్ లాంటి యాడ్ ఏజెన్సీలు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించాయి. అంటే ఆరు నెలలపాటు రేటింగ్స్ డేటా ను లెక్కలోకి తీసుకోకుండా అడ్వర్టయిజర్లు పాత డేటా ఆధారంగా ప్రకటనలు ఇవ్వటం కొనసాగిస్తే కచ్చితంగా బ్రాడ్ కాస్టర్లు మొండిగా వ్యవహరించే అవకాశాలే ఉంటాయి.

దీన్నిబట్టి చూస్తే, చందాదారులు ఆరువారాలు మించి పట్టుదలతో చానల్స్ ను బాయ్ కాట్ చేస్తే తప్ప ఫలితముండదు. ఇది ఎంత వరకు ఆచరణ సాధ్యమో చూడాలి. ఇలాంటి సమయంలో అడ్వర్టయిజర్స్ స్వయంగా బ్రాడ్ కాస్టర్ కు అండగా నిలవటం అంటే వాళ్ళ లాబీ ఎంత బలంగా ఉందో, చందాదారుడి బలహీనత మీద ఎంత గట్టి నమ్మకముందో అర్థం చేసుకోవచ్చు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!