పే చానల్ ధరలు తగ్గక తప్పదా?

పే చానల్ యజమానులు చందాదారుల కొనుగోలు శక్తిని లెక్కలోకి తీసుకోకుండా అత్యాశతో గరిష్ఠ చిల్లర ధరలు నిర్ణయించినా క్రమంగా వాళ్ళ చానల్స్ ఎంతమంది కోరుకుంటున్నారో గమనిస్తూ ధరలు తగ్గించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే, ఎమ్మెస్వోలు చందాదారుల ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని పాకేజీలు తయారు చేస్తారా, బ్రాడ్ కాస్టర్లు ఇవ్వజూపే అదనపు రాయితే  (20 శాతానికి అదనంగా ఇవ్వగలిగే మరో 15 శాతం) కోసం బ్రాడ్ కాస్టర్ల పాకేజీలనే ప్రచారం చేస్తారా అనేదాన్నిబట్టి ఈ ధరల తగ్గుదల ఆధారపడి ఉంటుంది.

చానల్ అందుబాటు లెక్కలు

ఇప్పుడు బ్రాడ్ కాస్టర్లు రూపొందించే బెస్ట్ ఫిట్ ప్లాన్ లో తమ బొకేలు ఉంటే పే చానల్స్ అనుకున లక్ష్యం సాధించినట్టే. అందుకే ఏదోవిధంగా తమ బొకేలు బెస్ట్ ఫిట్ ప్లాన్ లో ఉండేట్టు చూసుకోవటానికి ఎమ్మెస్వోలమీద ఆధారపడతారు. అయినప్పటికీ చందాదారులు తమ ఎంపికలో మార్పు చేసుకునే అవకాశం ఉండటం వల్ల చందాదారులను ఏ మేరకు నిలబెట్టగలుగుతారనే విషయానికి ప్రాధాన్యముంటుంది. చందాదారుల కదలికలను ఇప్పుడు ఎమ్మెస్వోల డేటా ఆధారంగా ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉండటం వలన వాళ్ళ అభిప్రాయాలు స్పష్టంగా బైటపడతాయి. ఈ సమాచారం ఆధారంగా పే చానల్స్ యజమానులు ధరలు తగ్గించటం ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. బొకే ధరలు తగ్గించకపోతే అన్ని చానల్స్ చందాదారులను చేరే అవకాశం ఉండదు కాబట్టి ఆ దిశలోనే ఆలోచిస్తారు. అ లా కార్టే ధర తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందనుకుంటే ఆ విధంగానే నిర్ణయం తీసుకుంటారు. అందుకే ఈ రెండు మూడు నెలలకాలంలో చందాదారు ఆలోచనలను లెక్కలోకి తీసుకొని బ్రాడ్ కాస్టర్లు భవిష్యత్ వ్యూహం నిర్ణయించుకుంటారు.

బార్క్ రేటింగ్స్ ప్రభావం

పే చానల్స్ చూడకపోతే వాటి యాజమాన్యాలు దిగి వస్తాయన్నది కనీస మార్కెట్ సూత్రం. అయితే, తమ చానల్స్ చూడటానికి అలవాటు పడినవాళ్ళు చూసి తీరతారనేది ఎంటర్టైన్మెంట్ చానల్స్ యజమానుల నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగానే అలాంటి కీలక చానల్స్ ధరలు బాగా పెంచారు. పే చానల్స్ చూడకుండా నిరసన తెలియజేయటం ద్వారా రేటింగ్స్ తగ్గటానికి కారణమైతే ధరలు వాటంతట అవే తగ్గుతాయన్న నమ్మకాన్ని  ప్రచారం చేస్తున్నవాళ్ళూ ఉన్నారు. కానీ అలాంటి ప్రచారం చేసేవాళ్ళందరూ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఒటిటి వేదికలకు అలవాటుపడినవాళ్ళే. కానీ ఇళ్ళలో ఉండి సీరియల్స్ చూసే వారి అభిప్రాయం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏది ఏమైనా సీరియల్స్ చూసి తీరాలనే అభిప్రాయంతో ఉంటారు.

ఈ పరిస్థితుల్లో నిజంగా జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ చూడకుండా నిరసన తెలియజేయగలరా అనేది సహజంగా ఎదురయ్యే ప్రశ్న.  అయితే, ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేంటంటే ప్రేక్షకాదరణ లెక్కలుగట్టే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్) కూడా పే చానల్స్ పక్షమే వహించింది. కొంతకాలం పాటు మార్కెట్ లో ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది కాబట్టి రేటింగ్స్ సమాచారాన్ని చందాదారులైన చానల్స్, అడ్వర్టయిజర్స్, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలకు మాత్రమే పరిమితం చేస్తూ కొంతకాలంపాటు ప్రేక్షకులకు తెలియనివ్వకూడదని నిర్ణయించింది. అంటే, రేటింగ్స్ లో మార్పులను బ్రాడ్ కాస్టర్లు పెద్దగా పట్టించుకునే అవకాశం లేకుండా చేయటంలో ట్రాయ్ తన వంతు సహాయం తను చేసింది. ఆ విధంగా కనీసం నెలన్నర పాటు రేటింగ్స్ బయటికి తెలిసే వీలు లేదు.

అడ్వర్టయిజర్స్ ఆగేది ఎంత కాలం?

అడ్వర్టయిజర్స్ కూడా ప్రేక్షకుల వైపు కాకుండా చానల్స్ వైపే నిలబడ్డారు. కనీసం ఆరువారాలపాటురేటింగ్స్ లెక్కలోకి తీసుకోకుండా ప్రకటనలు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సంఘం బహిరంగంగానే ప్రకటన జారీచేసింది. రేటింగ్స్ లెక్కలోకి తీసుకోకుండా మద్దతు ఇవ్వటమంటే ప్రేక్షకాదరణను బేఖాతరు చేసినట్టే లెక్క. ప్రేక్షకులు నిరసన తెలియజేస్తూ కొన్ని చానల్స్ ను దూరం పెట్టినా సరే ప్రకటనలు మాత్రం యధావిధిగా ఇస్తామని చెప్పటం ద్వారా ప్రేక్షకుల అభిప్రాయానికి విలువ ఉండబోదని చెప్పినట్టయింది.

అయితే, ఎంతకాలం ఇలా ఆగుతారు? ప్రకటనలకు చెల్లించినప్పుడు తగిన లాభం చేకూరాలనుకుంటారు కదా? అందుకే ఆరు వారాల గడువు విధించుకునారు. ఈలోపు అంతా ఒక కొలిక్కి వచ్చే అవకాశమున్నదని వాళ్ళ నమ్మకం. నిజంగానే ఆరు వారాల తరువాత పరిస్థితి సర్దుకోవచ్చు. చందాదారుల కచ్చితమైన అభిప్రాయాలకు అనుగుణంగా చానల్స్ ఎంపిక జరగవచ్చు. అప్పుడు ఏ చానల్స్ ధరలు తగ్గించుకోవటం మంచిదో తేలిపోతుంది.

అందువలన ఈ ఆరువారాల్లోగా చానల్స్ ధరలు తగ్గే అవకాశం లేదు. మార్చి చివరిదాకా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కానీ తమ బొకేలలో ఇతర చానల్స్ కు ఆదరణ తగ్గుతున్నట్టు తేలిన మరుక్షణమే పే చానల్స్ ఆలోచన మొదలుపెడతాయి. ఏప్రిల్ లో కచ్చితంగా ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంటాయి. ఐదు రెట్లు పెంచిన పే చానల్స్ కనీసం సగానికి సగం తగ్గే అవకాశముందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!