బార్క్ వైఖరి మీద మిశ్రమ స్పందన

కొత్త టారిఫ్ ఆర్డర్ అమలులో సరికొత్త వివాదానికి తెరలేసింది. రేటింగ్స్ లెక్కించే బార్క్ కూ, నియంత్రణా సంస్థ ట్రాయ్ కీ మధ్య పోరు మొదలైంది. అయితే ఈ విషయంలో అత్యంత కీలకమైన బ్రాడ్ కాస్టర్లు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బార్క్ నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

బార్క్ ప్రతి గురువారం రేటింగ్స్ సమాచారాన్ని దాని చందాదారులైన బ్రాడ్ కాస్టర్లు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలు, అడ్వర్టయిజర్లకు అందజేస్తూ కొంత సంక్షిప్త సమాచారాన్ని సామాన్య ప్రజలకోసం తన వెబ్ సైట్ లో ప్రచురిస్తుంది. కానీ రెండు వారాలుగా దాన్ని నిలిపేసింది. కొత్త టారిఫ్ ఆర్డర్ అమలు జరుగుతున్న సమయంలో ఒడిదుడుకులను వెల్లడించటం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బార్క్ చెబుతుండగా ఇచ్చి తీరాల్సిందేనని ట్రాయ్ అంటోంది.

రేటింగ్స్ తగ్గుతున్నట్టు గ్రహిస్తే బ్రాడ్ కాస్టర్లు  తమ పే చానల్స్ ధరలు తగ్గించటమో, పే చానల్స్ ను ఫ్రీ చానల్స్ గా మార్చటమో జరిగే అవకాశముందని ట్రాయ్ ఆశిస్తోంది. అయితే ఈ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ప్రకానలివ్వాలని స్వయంగా అడ్వర్టయిజర్ల సంఘమే నిర్ణయించుకోవటం కొసమెరుపు.

ఎలాగూ అడ్వర్టయిజర్ల మీద ప్రభావం లేనప్పుడు దాచాల్సిన అవసరమేమిటని కొందరు బ్రాడ్ కాస్టర్లు బార్క్ ను ప్రశ్నిస్తున్నారు. పైగా సామాన్య ప్రజలకు తెలియటం వలన జరిగే నష్టమేమే లేదని, చందాదారులందరికీ సమాచారం వస్తున్నప్పుడు అందులో రహస్యానికి తావులేదని వాళ్ళవాదన. అయితే, ప్రేక్షకుల కదలికలు తెలియటం వలన మార్కెట్ కూడా అందుకు అనుగుణంగా స్పందించే అవకాశం ఉందని, అదే సమయంలో ప్రేక్షకులు కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నావారున్నారు.

అయితే, ఒకటోరెండో వారాలను బట్టే జనం నిర్ణయం తీసుకుంటే సమస్యలొస్తాయని మరికొందరు అంటున్నారు. నిజంగా డేటాను విశ్లేషించగలిగితే మంచిదే తప్ప హటాత్తుగా తీసుకునే నిర్ణయాలవలన ఫలితం ఉండదని భావిస్తున్నారు.  ఇప్పటివరకు ఎలా ఉన్నా, ఇప్పుడు దాదాపుగా చందాదారులంతా బెస్ట్ ఫిట్ ప్లాన్ లోకి వచ్చారు కాబట్టి బార్క్  ఇప్పుడు తన వెబ్ సైట్ లో  ప్రచురించవచ్చునని పరిశ్రమలో ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!