• Home »
  • Entertainment »
  • బాలీవుడ్ చిత్రాల మీద నిషేధం ఎత్తేసిన పాక్

బాలీవుడ్ చిత్రాల మీద నిషేధం ఎత్తేసిన పాక్

మూడు నెలలపాటు భారతీత చలనచిత్రాల ప్రదర్శనమీద సాగిస్తున్న నిషేధాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్టకేలకు తొలగించింది. దీంతో డిసెంబర్ 19 నుంచి అక్కడ భారత చిత్రాల ప్రదర్శన పునఃప్రారంభమైంది. నిజానికి థియేటర్ల యజమానులు భారత చిత్రాల ప్రదర్శమ తాత్కాలికంగా నిలిపివేసారే తప్ప నిషేధించలేదని పాకిస్తాన్ మీడియా వివరణ ఇచ్చిన మరునాడే చిత్రాల ప్రదర్శన మొదలైంది.

యూరీ దాడి నేపథ్యంలో భారతదేశంలో పనిచేస్తున్న పాకిస్తానీ కళకారుల మీద భారత చలనచిత్ర నిర్మాతల సంఘం సెప్టెంబర్ 30న నిషేధం విధించటం తెలిసిందే. దీంతో పాకిస్తాన్ థియేటర్ల యాజమాన్యం నిరవధికంగా బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ఇప్పుడు దాదాపు మూడు నెలలలు గడిచాక నిషేధాన్ని తొలగిస్తున్నట్టు వెల్లడించటంతో ప్రదర్శనలు మొదలయ్యాయి.

భారత్ కూడా పాకిస్తాన్ కళాకారులపట్ల తన వైఖరిని మార్చుకుంటుందనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నామని  పాకిస్తాన్ థియేటర్ యజమానులు చెప్పారు.  ముందుగా అప్పట్లో ఆపేసిన బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనతో మళ్ళీ ప్రదర్శన ప్రారంభిస్తామన్నారు. ఆ విధంగా నవాజుద్దీన్ సిద్దికీ చిత్రం ఫ్రీకీ అలి ముందుగా ప్రదర్శిస్తారు. పాకిస్తాన్ లో భారత చిత్రాలకు మంచి ఆదరణ ఉండగా మూడు నెలలపాటు ప్రదర్శించకపోవటం థియేటర్ల నష్టాలకు కారణమైంది.

గతంలో భారత్- పాకిస్తాన్ యుద్ధం కారణంగా 1965 నుంచి పాకిస్తాన్ లో భారత చిత్రాల ప్రదర్శన మీద నిషేధం కొనసాగుతూ వచ్చింది. అయితే, 43 ఏళ్లు గడిచాక 2008 లో ఆ నిషేధాన్ని తొలగించారు. మళ్ళీ ఎనిమిదేళ్ళ తరువాత ఈ స్వల్పకాల నిషేధం అమలు చేశారు.