• Home »
  • Uncategorized »
  • రాజకీయ నాయకుల గుప్పిట్లో కేబుల్ టీవీ

రాజకీయ నాయకుల గుప్పిట్లో కేబుల్ టీవీ

cabletv_final_1

వ్యాపారపు తెలివితేటలకు తోడు స్థానికంగా బలమున్నవాళ్ళు కేబుల్ వ్యాపారంలోకి రావడమనేది మొదట్లో కనిపించిన తీరు. ఆ తరువాత అర్థబలం, అంగబలం ఉన్నవాళ్ళు ఎమ్ ఎస్ వో ( మల్టీ సిస్టమ్ ఆపరేటర్ ) లుగా తయారై హోల్ సేల్ వ్యాపారులుగా మారి ఎక్కువ వ్యాపారాన్ని సొంతం చేసుకుంటూ వచ్చారు. ఈ పోటీ పెరిగేకొద్దీ ఈ రంగంలో మాఫియా ప్రవేశించింది. రాష్ట్రంలో కేబుల్ టీవీ వ్యవస్థను కీలకమలుపు తిప్పి సాంకేతికంగా దేశంలోనే రాష్ట్రం ఎంతో ముందడుగు వేసేట్టు కృషిచేసిన సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి రామకృష్ణ హత్యకు గురికావడమే మాఫియా జోక్యానికి ప్రత్యక్ష నిదర్శనం. అయితే, ఆ తరువాత కాలంలో ఎక్కువగా రాజకీయనాయకులు ఇందులో ప్రవేశించి సొంతంగానో, బంధువుల పేర్లమీదనో నడపటం మొదలైంది.

ఆర్థికంగా లాభదాయకం కావటం, మిగిలిన చానల్స్ ను కూడా గుప్పిట్లో పెట్టుకోగలగటం, తన అనుచరగణానికి ఊళ్ళు పంచిపెట్టటం, లేదా ఆయా ఆపరేటర్లనే తన అనుచరులుగా మార్చుకోవటం లాంటి అవసరాలకోసం రాజకీయనాయకులు కేబుల్ రంగంలో ప్రవేశిస్తున్నారు. క్రమం తప్పకుండా వచ్చే అదాయం సంగతలా ఉంచితే ప్రత్ర్యర్థులను దెబ్బకొట్టేందుకు కూడా కేబుల్ టీవీ ని వాడుకుంటున్న సందర్భాలున్నాయి. ఎమ్ ఎస్ వో కొరకరాని కొయ్యలా తయారయ్యాడనుకున్నప్పుడు బినామీల చేత కొనిపించిన సందర్భాలూ ఉన్నాయి. రాజకీయనాయకుల వత్తిడికి తట్టుకోలేని వారు హాత్ వే, డిజి కేబుల్ వంటి కార్పొరేట్ ఎమ్ ఎస్ వో లకు నెట్ వర్క్ అమ్ముకోవటమూ సాధారణమైపోయింది.

కోస్తా ఆంధ్ర ప్రాంతం చూస్తే, ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణదే హవా. ఆయన సోదరుడు సతీశ్ ఈ వ్యవహారాలన్నీ చూస్తారు. జీటీవీ వారి సిటీ కేబుల్ ఎప్పుడో మూతబడినా మళ్ళీ వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళతో కలిసి ఇప్పుడు సిటీ విజన్ పేరిట ఒక పెద్ద ఎమ్ ఎస్ వో సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రవేశించిన కొద్దికాలంలోనే 30 శాతం వరకు సిటీ విజన్ తన పరిధిలోకి తెచ్చుకోగలిగింది. అదే సమయంలో జీ గ్రూపుకు చెందిన జీ 24 గంటలు చానల్ లో వ్యూహాత్మక భాగస్వామ్యం తీసుకొని నడుపుతున్నారు.

అనకాపల్లిలో తెలుగుదేశం మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు కేబుల్ మీద తిరుగులేని ఆధిపత్యం ఉంది.  అది ఏ స్థాయిలో ఉందంటే, ఆయన రాజకీయ ప్రత్యర్థి కొణతాల రామకృష్ణ వాణిజ్యపన్నుల శాఖామంత్రిగా ఉన్న రోజుల్లో మొత్తం కేబుల్ పరిశ్రమనే రాష్ట్రప్రభుత్వం తీసుకుని నడిపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు. కానీ అది తేనెతుట్టెను కదిలించినట్టవుతుందని తెలుసుకొని ఆ ఆలోచన విరమించుకున్నారు. రాజమండ్రి లోనూ తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో చాలా కాలం కేబుల్ వ్యవస్థ నడిచింది. తణుకు లో ముళ్ళపూడి వారి కుటుంబం చేతిలో కేబుల్ వ్యాపారం నడుస్తోంది. అమలాపురం లో మాజీమంత్రి మెట్ల సత్యనారాయణ కుమారుడు రాంబాబు అక్కడి కేబుల్ టీవీ నడుపుతున్నారు.

గుంటూరు జిల్లాలోనూ కేబుల్ రంగం మీద రాజకీయపు నీడలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉన్న అంబటి రాంబాబు తరఫున ఆయన సోదరుడు అక్కడొక పెద్ద నెట్ వర్క్ నిర్వహిస్తున్నారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి లో అంబటి మీద ఒక వార్త ప్రసారమైనప్పుడు అ చానల్ ను తమనెట్ వర్క్ లో ఉచితంగా ప్రసారం చేయనందుకే అలా ఉద్దేశ పూర్వకంగా వార్త ఇచ్చారంటూ అంబటి వ్యాఖ్యానించటం తెలిసిందే. అదే గుంటూరు జిల్లాలో తెలుగుదేశానికి చెందిన మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్ కూడా కేబుల్ రంగంలో ప్రవేశించారు, నర్సరావుపేటలో ఎ.కె. నెట్ వర్క్ తీసుకున్న తరువాత దాన్ని చుట్టుపక్కల ప్రాంతాలకు శరవేగంగా విస్తరిస్తూ వినుకొండ దాకా చేరిన సంగతి తెలిసిందే.

ఇక ప్రకాశం జిల్లాలోనూ అదే పరిస్థితి ఉంది. ఒంగోలు లో అంకబాబు నిర్వహించిన చానల్ లో అప్పటి పిఆర్పీ ఎమ్మెల్యే అభ్యర్థి, గ్రానైట్ వ్యాపారి డాక్టర్ ఆనంద్ కూడా పెట్టుబడిపెట్టిన సంగతి రహస్యమేమీకాదు. ఇప్పుడు ఒంగోలు కేబుల్ మొత్తం కాంగ్రెస్ కు చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాస్, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ చేతులో ఉంది. అదే విధంగా చీరాల లో కేబుల్ నెట్ వర్క్ వెనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అక్కడి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఆ నెట్ వర్క్ ను సొంతం చేసుకునేందుకు హాత్ వే బెదిరింపులకు పాల్పడుతున్నదని, టీవీ9 సీఈవో రవిప్రకాశ్, ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి కూడా హాత్ వే కి వంతపాడుతున్నారని అప్పట్లో కృష్ణమోహన్ స్వయంగా శాసనసభ ఆవరణలో ఆరోపించారు.

రాయలసీమ విషయానికొస్తే, తిరుపతిలో కొంతభాగం, కాళహస్తి మొత్తం అక్కడి శాసనసభ్యుడు ఎస్‍సీవీ నాయుడు చేతిలో ఉండగా చిత్తూరు సామ్రాజ్యాన్ని ఎమ్మెల్యే సీకే బాబు శాసిస్తున్నారు. తిరుపతిలో మరికొంత కొంతభాగం కృష్ణతేజ కమ్యూనికేషన్స్ పేరుతో మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నిర్వహిస్తున్నారు. అదే విధంగా పరిటాల రవికి అనంతపురం పట్టణం లోని కేబుల్ టీవీలో ఒకప్పుడు వాటాలుండేవి.  అక్కడ ఇప్పుడు బాగా విస్తరించిన ఎటిపి చానల్ ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అన్న కుమారుడు నడుపుతున్నారు.  ఇక కర్నూలు జిల్లాలో అధికశాతం రాజకీయనాయకుల చేతుల్లోనే ఉంది.  కర్నూలు నగరంలో మంత్రి టీజీ వెంకటేశ్ ఆధ్వర్యంలో కేబుల్ వ్యవస్థ ఉండగా, అందులో కె ఇ సోదరుల కుటుంబీకుల వాటా 30 శాతం ఉంది. అదే విధంగా నంద్యాలలో భూమా కుటుంబానిదే కేబుల్ పరిశ్రమలో అధికభాగం. అయితే, అక్కడ ఎస్పీవై రెడ్డికి నంద్యాల పరిసరప్రాంతాల్లో కేబుల్ వ్యవస్థ ఉంది.

తెలంగాణ విషయానికొస్తే, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆ ప్రాంతంలో కేబుల్ ఆపరేటర్ గా బాగా పేరుతెచ్చుకున్నతరువాతనే రాజకీయాల్లోనూ పేరుతెచ్చుకున్నారు. కరీంనగర్ ఎమ్ ఎస్ వో  హనుమంతరెడ్డి అక్కడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. గద్వాల్ లో మంత్రి అరుణ భర్త భరత్ సింహారెడ్డి ఆధ్వర్యంలో కేబుల్ టీవీ ఉండగా అక్కడే వైఎస్సార్ సీపీ నాయకుడు క్రిష్ణ మోహన్ రెడ్డి పరిధిలో కొంత ప్రాంతం ఉంది. షాద్ నగర్ లో వైఎస్సార్ సీపీ నాయకుడు బొబ్బిలి సుధాకర్ రెడ్డి కేబుల్ టీవీ నడుపుతున్నారు. చాలా కీలకమైన నిజామాబాద్ లో చాలాకాలం పాటు తిరుగులేని ఆధిక్యం చాటుకున్న కుల్దీప్ సహానీ రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషించే స్థితిలో ఉండగా మాజీ పిసిసి ఆధ్యక్షుడు డి శ్రీనివాస్ ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడి గుత్తాధిపత్యానికి గండికొట్టించటానికి తనవర్గీయులను ఉసిగొల్పి నిజామాబాద్ నగరం వరకు విజయం సాధించిన సంగతి అక్కడివారందరికీ బాగా తెలుసు. ఇక హైదరాబాద్ నగరంలోనూ కేబుల్ టీవీ మీద రాజకీయనాయకుల ఆధిపత్యం కనిపిస్తుంది. మలక్ పేట ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒకప్పుడు ఎమ్ ఎస్ వో. అదే విధంగా పాత బస్తీలో మజ్లిస్ వారి 4టీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీలేదు.

నిజానికి రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల పరోక్షంగా కేబుల్ నడుపుతున్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే, ఇన్నాళ్ళూ సంపాదించినన్ని లాభాలు డిజిటలైజేషన్ తరువాత ఉండకపోవచ్చునన్న అనుమానంతో ఈ వ్యాపారం నుంచి బయటికొచ్చే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు కూడా ఎక్కువవుతున్నారని భావిస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా విశాఖ నగరంలో ఒకప్పుడు కేబుల్ నడిపిన శాండిల్య, మంత్రి గంటా శ్రీనివాసరావు కలిసి మళ్ళీ ఈ వ్యాపారంలో ప్రవేశించే అవకాశాలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అందువలన కేబుల్ మీద పరోక్షంగానైనా రాజకీయనాయకుల ప్రభావం కొనసాగే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు. ఒక శాటిలైట్ చానల్ నడపటం కంటే ఒక బలమైన కేబుల్ వ్యవస్థ ఉంటే స్థానికంగా తన వార్తలకు ప్రాధాన్యం ఇచ్చుకోవటంతో బాటు ప్రత్ర్యర్థుల ప్రాధాన్యాన్ని తగ్గించటం, శాటిలైట్ చానల్స్ ను కూడా ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉంచటం చాలామంది రాజకీయనాయకులను ఈ వైపు ఆకర్షిస్తోంది.