• Home »
  • Cable »
  • రిలయెన్స్ జియో ఎవరిని భయపెడుతుంది ?

రిలయెన్స్ జియో ఎవరిని భయపెడుతుంది ?

రిలయెన్స్ జియో ఎవరిని భయపెడుతుంది ?
కేబుల్ ఆపరేటర్లలో ఉత్సాహం – డిటిహెచ్ ఆపరేటర్ల గుండెల్లో గుబులు

రిలయెన్స్ జియో అంటే ఏంటి ? అది సామాన్యుడి జీవితంలో ఎలాంటి మార్పు తెస్తుంది? స్థానిక ఆపరేటర్ కు బదులుగా అది సేవలందిస్తుందా? ఆపరేటర్ తో కలిసి వ్యాపారం చేస్తుందా? దానివలన బ్రాడ్ బాండ్ చౌకగా అందుతుందా? అన్ని చానల్స్ అందుతాయా? వినియోగదారులకొచ్చే లాభమేంటి? ఇంతకీ అదెప్పుడొస్తుంది ? ఇవన్నీ ఎడతగని ప్రశ్నలే. ఇంకా ఎటూ తేలక మరింత సందిగ్ధంలోకి నెట్టేస్తున్న ప్రశ్నలే. ఇప్పటికీ నిర్దిష్టంగా సమాధానం తెలియని ప్రశ్నలే.

ఇప్పటికీ ముఖేష్ అంబానీ కచ్చితంగా తన మనసులో ఉన్న మాట బయటపెట్టలేదు. కానీ మీడియా, టెలికామ్ కన్వర్జెన్స్ చూడగలమని మాత్రం అందరూ అనుకుంటున్నారు. డేటా, వీడియో, వాయిస్ సర్వీసులు ఇచ్చే అవకాశముందన్న ఊహాగానాలు మాత్రం మార్కెట్లో షికారు చేస్తున్నాయి. ఇది ప్రధానంగా మూడు అంశాలమీద దృష్టి సారిస్తుంది. టెలికామ్ వైపు చూస్తే, రిలయెన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ మాత్రం హైస్పీడ్ 4జి వైర్లెస్ సర్వీస్, ఫైబర్ ఆధారిత ఫిక్సెద్ లైన్ సర్వీస్ ఇస్తుందని అర్థమవుతూనే ఉంది. ఇక మీడియా వైపు చూస్తే టీవీ, వీడియో ఆన్ డిమాండ్, క్లౌడ్ ఆధార సర్వీసులు అందించే వీలుంది. అదే సమయంలో వెబ్ ఆధారిత సేవలు కూడా ఉంతాయి. మొదటిసారిగా వినియోగదారులకు అందించేది మాత్రం ఆండ్రాయిడ్, ఐఓఎస్ సెల్ ఫోన్ల వినియోగదారులకు జియో చాట్ అనే మెసేజింగ్ యాప్.

వెంటనే మెసేజ్ పంపుకోవటం, ఉచిత ఎస్సెమ్మెస్, వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంటే ప్రధానంగా 8 కోట్ల మంది వాడకందారులున్న వాట్సాప్, వియ్ చాట్, లైన్ మెసెంజర్ లాంటి ఇతర మెసేజింగ్, కాలింగ్ యాప్స్ తో ప్రధానంగా పోటీ ఉంటుందన్నమాట. సిటీ రీసెర్చ్ సంస్థ అంచనా ప్రకారం జియో చాట్ క్రమంగా వాయిస్, మెసేజింగ్, ఎంటర్టైన్మెంట్, ఈ-కామర్స్ ను కలిపి ఉమ్మడిగా ఒకే యాప్ గా మార్చి వాడకందారులకు సేవలందిస్తుంది.

ఆ తరువాత ఆలోచనలో ఉన్నది జియో ప్లే. అది టీవీ చానల్స్ అందించే యాప్. లైవ్ టీవీ ఇవ్వటమే కాకుండా జియో ప్లే ఆటోమేటిక్ గా కార్యక్రమాలన్నిటినీ ఏడురోజులపాటు క్లౌడ్ మీద నిల్వ ఉంచుతుంది. అంటే, ఇది ఓవర్ ద టాప్ (ఒటిటి) కే పరిమితమవుతుందా, ఇళ్లలో టీవీలకూ విస్తరిస్తుందా అన్నదే అసలైన ప్రశ్న. అయితే, చాలా మంది మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నది మాత్రం డిటిహెచ్ ఆపరేటర్లకూ, ఎమ్మెస్వోలకూ దీటుగా సేవలందిస్తూ కేబుల్ ఆపరేటర్లద్వారా ఇంటింటికీ టీవీలకు ప్రసారాలు అందించే అవకాశమున్నదని. అదే సమయంలో మొబైల్ ప్లాట్ ఫామ్ మీద కూడా అందజేస్తుందని భావిస్తున్నారు.

ఇంకా రిలయెన్స్ జియో నుంచి ఏం ఆశిస్తున్నారు ? వాయిస్ ఆన్ డిమాండ్ తరహాలో జియో ఆన్ డిమాండ్ పేరుతోను, జియో బీట్స్ పేరియో మ్యూజిక్ స్ట్రీమింగ్, జియో ఫ్రెండ్స్ పేరుతో ఫ్రెండ్స్ లొకేటర్ యాప్, జియీ న్యూస్ పేరుతో ఆన్ లైన్ న్యూస్ పేపర్ సర్వీస్, జియో మాగ్ పేరుతో ఆన్ లైన్ మాగజైన్ సర్వీస్దవచ్చునని తెలుస్తోంది. రోగి వైద్య చరిత్రను క్లౌడ్ సహాయంతో నిల్వచేసే ప్రక్రియ, విద్యాబోధన లాంటివి కూడా ప్రధానంగా జియో లో ఉండవచ్చునని తెలుస్తోంది.

రిలయెన్స్ జియో కింద రకరకాల సేవలు గుత్తగా చౌక ధరలకే అందే అవకాశముంటుందని వినియోగదారులు ఆశిస్తున్నారు. డేటా, వాయిస్ సేవలమీద టారిఫ్ తగ్గించటం ద్వారా సంప్రదాయ టెలికాం కంపెనీలను తీవ్రంగా ప్రభావితం చేసి పైచేయి సాధిస్తుంది. ఇక వీడియో కోణంలో ఆలోచిస్తే, రిలయెన్స్ జియో కూడా కొల్లగొట్టే వ్యూహాన్ని అనుసరించవచ్చు. ఆ విధంగా డిటిహెచ్ ఆపరేటర్లతోను, కార్పొరేట్ ఎమ్మెస్వోలతోనూ ముఖాముఖి పోటీకి దిగవచ్చు. అయితే, స్వతంత్ర ఎమ్మెస్వోలతో, ఆపరేటర్లతో ఎలాంటి ధోరణి అనుసరిస్తుందనేది ఇంకా తేలాల్సి ఉంది.

ఇంతకీ రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ ఎలా రూపుదిద్దుకుంది ? 2010 జూన్ లో ప్రభుత్వం బ్రాడ్ బాండ్ అండ్ వైర్లెస్ యాక్సెస్ ( బిడబ్ల్యుఎ ) వేలం నిర్వహిస్తున్నప్పుడు వేలం ధరలు సహేతుక పరిమితి దాటి పోయాయంటూ వోడాఫోన్, అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ కమ్యూనికేషన్స్, టాటా కమ్యూనికేషన్స్ వెనకడుగేశాయి. అయితే, ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ సర్వీసెస్ అనే ఒకే ఒక సంస్థ మాత్రం రంగంలో నిలబడి 12 వేల 847 కోట్ల 77 లక్షలకు వేలం పాడి దేశవ్యాప్తంగా మొత్తం 22 సర్కిల్స్ కు ఏకైక విజేతగా మారింది.

ఆ కంపెనీ ఏంటో ఎవరూ తొంగిచూడకముందే ముఖేశ్ అంబానీకి చెందిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆ వేలం జరిగిన మరుసటి రోజే అందులో 95 శాతం వాటా కొనేసింది. ఆ తరువాత జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలో వైమాక్స్ లేదా ఎల్టీఈ లేదా 4జి మొబైల్ టెక్నాలజీ ద్వారా వైర్లెస్ బ్రాడ్ బాండ్ సర్వీసులు అందజేస్తుందని ప్రకటించారు. అదే సమావేశంలో కంపెనీ మరో ప్రకటన కూడా చేసింది. వచ్చే ఏడాది కాలంలో ఈ సంస్థలో 18 నుంచి 20 వేలకోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పింది. పూర్తి స్థాయిలో సేవలు మొదలుపెట్టకపోయినా సంస్థ మాత్రం తన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు బలోపేతం చేసుకోవటానికి తగిన ఏర్పాట్లలో తలమునకలైంది.

అంబానీ స్వయంగా ప్రకటించిన వివరాల ప్రకారం తాజాగా పెట్టిన పెట్టుబడి 70 వేల కోట్ల రూపాయలు. ఎలాంటి సేవలుంటాయనే విషయంలో రకరకాల ఊహాగానాలుండగా చాలామంది మాత్రం హైస్పీడ్ వైర్లెస్ గేమింగ్, అత్యుత్తమ నాణ్యతతో కూడిన వీడియో కాన్ఫరెన్సింగ్, చౌకగా వీడియో ఆన్ డిమాండ్ లాంటివి ఉంటాయని భావిస్తున్నారు. ముఖేశ్ అంబానీకి చెందిన రిలయెన్స్ జియీ ఇన్ఫోకామ్ దేశవ్యాప్తంగా సేవలందించటానికి డిజిటల్ ఎమ్మెస్వోగా దరఖాస్తు చేసుకోవటంతో పెద్ద ఎత్తున కేబుల్ మార్కెట్లో కలకలం మొదలైంది. రిలయెన్స్ జియీ ఇన్ఫోకామ్ ఇప్పటికే ఒక చాట్ యాప్ ప్రారంభించగా త్వరలో వీడియో యాప్ కూడా ప్రారంభించ బోతోంది.

2010 మే నెలలో నాలుగేళ్ళపాటు పరస్పరం పోటీ పడకూడదన్న ఒప్పందాన్నిముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ రద్దుచేసుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములూ విడిపోయే సమయంలో ఆ ఒప్పందం రాసుకున్న సంగతి పాఠకులకు గుర్తుండే ఉంటుంది. దీంతో పెద్దవాడు టెలికామ్ వ్యాపారంలో ప్రవేశించేందుకు మార్గం సుగమమైంది. 2010 జూన్ లో ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 95శాతం వాటాలు కొన్న విషయం ముందే చర్చించుకున్నాం. అప్పట్లో దేసవ్యాప్తంగా ఆ సంస్థ ఒక్కటే వేలంలో రూ. 4,800 కోట్లకు లైసెన్స్ గెలుచుకుంది.

అయితే మూడేళ్ళపాటు అనేక నగరాలలో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తూనే వచ్చింది తప్ప ఎలాంటి కీలకమైన ప్రకటనా చేయలేదు. అయితే, 2013 జనవరిలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ పేరును రిలయెన్స్ జియో గా మార్చింది. అదే సమయంలో రిలయెన్స్ జియో, భారతి మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది. భారత్, సింగపూర్ మధ్య సముద్రంగుండా ఉన్న భారతి ఫైబర్ కేబుల్ ను రిలయెన్స్ జియో వాడుకునేలా ఆ ఒప్పందం కుదిరింది. దాని వలన రిలయెన్స్ జియో కు ఆసియా పసిఫిక్ అంతటా ప్రధాన కేంద్రాలకు అత్యంత వేగవంతమైన కనెక్టివిటీ దొరకటంతోబాటు నేరుగా అనుసంధానమయ్యే వీలుంటుంది.

ఆర్ కామ్ కు దేశవ్యాప్తంగా ఉన్న టెలికామ్ తవర్లు తదితర మౌలిక సదుపాయాలను కలిసి వాడుకునేలా రిలయెన్స్ జియో, రిలయెన్స్ కమ్యూనికేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు ప్రతిఫలంగా రిలయెన్స్ జియో ఏకమొత్తంగా రూ. 1673 కోట్లు చెల్లించింది. ఆ విధంగా దేశవ్యాప్తంగా ఉన్న 22 సర్వీస్ కేంద్రాలకు ఏకీకృత లైసెన్స్ పొందాలని నిర్ణయించుకుంది. ఆ విధంగా అది ఏకీకృత లైసెన్స్ పొందిన తొలి టెలికామ్ ఆపరేటర్ అవుతుంది. రిలయెన్స్ జియో 14 కీలకమైన నగరాలలో 1800 మెగాహెర్ట్జ్ బాండ్ లో రూ. 11,054 కోట్ల 41 లక్షలకు స్పెక్ట్రమ్ సంపాదించుకుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా నెట్ వర్క్ ఉన్న వియామ్ సంస్థ టవర్ల సదుపాయాలు వాడుకోవటానికి ఆ సంస్థతో కూడా ఒక ఒప్పందం కుదిరింది.

దేశవ్యాప్తంగా ఎటిసి ఇండియా వారి టెలికామ్ టవర్ సదుపాయాన్ని కలిసి వాడుకోవటానికి ఆ సంస్థతో కూడా రిలయెన్స్ జియో ఒక ఒప్పందం చేసుకుంది. ఐఐటి ముంబై లో జరిగిన టెక్ ఫెస్ట్ లో రిలయెన్స్ జియో తన 4జి నెట్ వర్క్ ను పరీక్షించి చూసింది. వీడియో కాల్స్ ను, జియో టెలివిజన్ సర్వీస్ ను పరీక్షించింది. మొత్తం 5 వేల పట్టణాలు, నగరాలు, 2 లక్షల 15 వేల గ్రామాలకు విస్తరిస్తామని ముఖేశ్ అంబానీ స్వయంగా ప్రకటించారు.

రిలయెన్స్ జియో దేశవ్యాప్త డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవటంతోబాటు టీవీ రంగంలో బాగా పేరుమోసిన హాత్ వే మాజీ ఎండీ, సీఈవో జయరామన్ ను, మాజీ డెన్ నెట్ వర్క్స్ సీఈవో ఎస్ ఎన్ శర్మ ను ఈ వెంచర్ నడపటం కోసం తీసుకున్నారు. ఇటీవలే ఐపిఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ మాచ్ ల సందర్భంగా వాంఖేడీ స్టేడియం పరిసరాల్లో రిలయెన్స్ జియో ఉచితంగా 4జి వైఫై సౌకర్యం కల్పించటం కూడా తెలిసిందే.

అయితే ఈ దూకుడు ఎటువైపు దారితీస్తుందన్న విషయంలోనే స్పష్టత రావటం లేదు. మొబైల్ ఫోన్లకూ, వాటిలో ఇంటర్నెట్, ఎంటర్టైన్మెంట్, గేమింగ్ తదితర అంశాలకే పరిమితమవుతుందా, ఇళ్లలో టీవీ సెట్లలో టీవీ చానల్స్ ప్రసారాలకూ విస్తరిస్తుందా అన్నదే అసలు ప్రశ్న. అయితే, హిందుజా వారి గ్రాంట్ హిట్స్ లాంటి వేదికలను వాడుకోవటం ద్వారా తక్కువ పెట్టుబడితో బ్రాడ్ బాండ్ లాంటి వాల్యూ యాడెడ్ సేవలు కూడా అందించటం మేలని స్వతంత్ర ఎమ్మెస్వోలు భావిస్తున్నారు. మొత్తానికి రిలయెన్స్ జియో జాప్యం వలన అది నాలుగో దశలోనే ప్రభావం చూపే అవకాశం ఉన్నదని విశ్లేషిస్తున్నవారూ ఉన్నారు.