రేటింగ్స్ నిలిపివేత మీద స్పందించిన బార్క్

టీవీ చానల్స్ రేటింగ్స్ లెక్కించి వారం వారం తన వెబ్ సైట్ లో ప్రకటించే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్) రెండువారాలుగా ప్రచురించటం ఆపేయటం మీద ట్రాయ్ అభ్యంతరం చెప్పింది. వెంటనే వెల్లడించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. అయితే, బార్క్ ఇందుకు స్పందిస్తూ, తాములెక్కించటం గాని, తమ చందాదారులకు ఇవ్వటం గాని నిలిపివేయలేదని, కేవలం సాధారణ ప్రజలకు మాత్రమే నిలిపివేశామని పేర్కొంది. కేవలం న్యూ టారిఫ్ ఆర్డర్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందుల ప్రభావం కనబడకుండా ఉండటానికే అలా చేశామని వివరణ ఇచ్చింది.

మరోవైపు ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టయిజర్స్ ( ఐఎస్ ఎ) కూడా రేటింగ్స్ తో నిమిత్తం లేకుండా ప్రకటనలివ్వాలని తమ సభ్యులకు సూచించటాన్ని బార్క్ ప్రస్తావించింది. డేటాలో వచ్చే తాత్కాలిక మార్పులు వాస్తవాలను మరుగున పరచకూడదన్న ఉద్దేశంతోనే నిలిపివేసినట్టు చెప్పింది. తమ వాటాదారులైన బ్రాడ్ కాస్టర్లు, అడ్వర్టయిజర్లు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీల అభిప్రాయాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని, ఇదే విషయాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కూడా స్పష్టం చేసిందని బార్క్ తన సమాధానంలో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!