సన్ డైరెక్ట్ కు ఎమ్మెస్వోల షాక్?

నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు మీద రూ.153 పరిమితి పెట్టుకుంటూ ఎన్ని చానల్స్ అయినా ఇవ్వటానికి సిద్ధపడ్డ సన్ డైరెక్ట్ డిటిహెచ్ టీవీ పంపిణీ మార్కెట్ మీద బ్రహ్మాస్త్రం వదిలింది. ఆపరేటర్కు వాటా ఇవ్వాల్సిన అవసరం లేకపోవటమే ఈ దూకుడుకు కారణమని స్పష్టమవుతూ ఉంది. కొత్త ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా పాకేజీలు ప్రకటించటంలో అందరికంటే భిన్నంగా తన వ్యూహాన్ని వెల్లడించి మార్కెట్ ను షాక్ కి గురి చేశానని సన్ డైరెక్ట్ భావిస్తుండగా ఎదురుదెబ్బతీసే వ్యూహంతో ఎమ్మెస్వోలు కదులుతున్నట్టు తెలుస్తోంది.

మామూలుగా అయితే  నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద రూ. 130 ప్లస్ పన్నులు (రూ.153) చెల్లిస్తే 100 వరకు చానల్స్ అందుతాయి. ఇందులో పే చానల్స్, ఫ్రీ చానల్స్ కలిసే ఉంటాయి. అదనంగా తీసుకున్న ప్రతి 25 చానల్స్ కూ రూ.20 చొప్పున చెల్లించాలి. అంటే, 150 చానల్స్ చూడాలనుకునేవారు మిగతా ఎమ్మెస్వోలకు, డిటిహెచ్ వేదికలకు అయితే రూ. 210 చెల్లించాల్సి ఉంటుంది. అందుకే కేవలం ఉచిత చానల్స్ వరకే పరిమితమవుదాం అనుకున్నవాళ్ళకు ఇది చాలా మంచి అవకాశమవుతుంది. పైగా హెచ్ డి చానల్స్ తీసుకునే వాళ్ళకు ఇది మరీ మంచి అవకాశం. ఒక హెచ్ డి చానల్ రెండు ఎస్ డి చానల్స్ త్ సమానమైనప్పటికీ సన్ డైరెక్ట్ లో అలాంటి తేడా ఏదీ ఉండదు.

అదే విధంగా పే చానల్స్ తీసుకునేవాళ్ళకు కూడా నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు భారం ఉండదు. అందుకే పే చానల్స్ వైపు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉంటాయి. అదే సమయంలో దక్షిణాదిన అతిపెద్ద నెట్ వర్క్ కావటంతో తన చానల్స్ ను ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముందుగా ఊహించినట్టే స్టార్ పాకేజ్ ఒక్కటీ ఇవ్వకుండా సన్ డైరెక్ట్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అటు డి2హెచ్ కూడా స్టార్ పాకేజీలు ఇవ్వజూపకపోవటం స్టార్ ను అయోమయంలో పడేసింది. జీ గ్రూప్ వారి 34 పాకేజీలు, సన్ గ్రూప్ వారి 20 పాకేజీలు, టీవీ 18 వారి 19 పాకేజీలు అందుబాటులో ఉంటున్నాయి.

ఎమ్మెస్వోలు , ఆపరేటర్లు తట్టుకునేదెలా?

దక్షిణాదిన 35 పే చానల్స్ ఉన్న సన్ డైరెక్ట్  పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకునే వ్యూహం అనుసరిస్తుండటం సహజంగానే ఎమ్మెస్వోలను, ఆపరేటర్లను కలవరపెడుతుంది. వ్యాపారం చేజారిపోకుండా చూసుకోవటానికి ఏదైనా వ్యూహం అనుసరించాలంటే తప్పనిసరిగా ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్య సయోధ్య తప్పనిసరి, అదేవిధంగా ఎమ్మెస్వోల మధ్య కూడా ఒక ఏకాభిప్రాయం ఉండాలి. కానీ ఎమ్మెస్వోలు ఇప్పటిదాకా రకరకాల ప్రాతిపదికలమీద విడిపోయి ఉన్నారు. కార్పొరేట్ ఎమ్మెస్వోలు, స్వతంత్ర ఎమ్మెస్వోలు వేరు వేరు అనే భావనలో ఉండగా స్వతంత్ర ఎమ్మెస్వోలలోనూ లక్షలోపు కనెక్టివిటీ ఉన్న చిన్న ఎమ్మెస్వోలను మిగిలిన పెద్ద ఎమ్మెస్వోలు దూరంగా ఉంచుతున్నారు. ఈ అనైక్యతను సన్ డైరెక్ట్ బాగానే వాడుకునే అవకాశం కనబడుతోంది.

ఈ పరిస్థితుల్లో భారీగా నష్టపోయే ఆపరేటర్ ను ఆదుకోవటానికి ఎమ్మెస్వోలు మాత్రమే ముందుకొచ్చి తమ పాకేజీలలో సన్ గ్రూప్ చానల్స్ ప్రాధాన్యాన్ని తగ్గించగలుగుతారు. ఆపరేటర్ల సంక్షేమం కోరుకునే ఎమ్మెస్వోలు కచ్చితంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. నిజానికి సన్ గ్రూప్ చానల్స్ తెలుగు రాష్ట్రాల్లోగాని, కర్నాటకలోగాని, కేరళలోగాని నెంబర్ వన్ స్థానంలో లేవు. ఈ పరిస్థితిలో ప్రేక్షకులనుంచి వచ్చే వత్తిడి కూడా తక్కువే కాబట్టి దక్షిణాది రాష్ట్రాలలో ఎమ్మెస్వోలు సన్ గ్రూప్ మెడలు వంచటానికి ఇది సరైన అవకాశం కూడా.

సన్ డైరెక్ట్ వ్యాపారం ముఖ్యమా, తన పే చానల్స్ ముఖ్యమా అనే సందిగ్ధత వచ్చేట్టు చేస్తే తప్ప సన్ గ్రూప్ సరైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రాదు. అందుకే ఇప్పుడు కేబుల్ పరిశ్రమ భవిష్యత్తు దృష్ట్యా ఎమ్మెస్వోలు ఏకమవుతున్నట్టు తెలుస్తోంది. కేబుల్ ఆపరేటర్ల ప్రయోజనాలు కూడా ఇమిడి ఉండటం వలన ఇప్పుడు సన్ డైరెక్ట్ మీద పోరాటంలో వెనకడుగు వేస్తే ఆపరేటర్లకు వ్యతిరేకమవుతామనే భావన కూడా ఎమ్మెస్వోలలో మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!