• Home »
  • Cable »
  • సెట్ టాప్ బాక్సుల తయారీ రంగంలో భారతీ

సెట్ టాప్ బాక్సుల తయారీ రంగంలో భారతీ

ఎయిర్ టెల్ మొబైల్ ఆపరేటర్ గా, డిటిహెచ్ ఆపరేటర్ గా పేరున్న భారతీ సంస్థ ఇప్పుడు సెట్ టాప్ బాక్సుల తయారీ రంగంలో అడుగుపెట్టబోతోంది. ఎన్డీయే ప్రభుత్వం స్వదేశీ సెట్ టాప్ బాక్సుల తయారీని ప్రోత్సహిస్తూ డిజిటైజేషన్ గడువు పెంచటంతోబాటు పన్ను రాయితీలు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందీ నేపథ్యంలో ఇప్పటికే అనేక కంపెనీలు సెట్ టాప్ బాక్సుల తయారీకి మొగ్గుచూపుతుండగా ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో భారతీ కూడా చేరింది.

పూణే కేంద్రంగా ఏర్పాటయ్యే ఈ కర్మాగారం కోసం మరో ఎలక్ట్రానిక్స్ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. ఎలాగూ డిటిహెచ్ ఉండటం వలన దానికోసమైనా సెట్ టాప్ బాక్సులు కావాలి కాబట్టి సొంత ఆర్డర్లతోనే ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించుకుంది. వీటితోబాటే కేబుల్ టీవీ సెట్ టాప్ బాక్సులనూ తయారుచేయాలని భావిస్తోంది. మేకిన్ ఇండియాలో భాగస్వాములవుతున్నట్టు ఈ సందర్భంగా భారతీ ప్రకటించుకుంది.

మూడు, నాలుగు దశల డిజిటైజేషన్ లో దాదాపు 13 కోట్ల సెట్ టాప్ బాక్సులు అవసరమవుతాయని అంచనావేస్తుండగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డిమాండ్ కు తగిన ఉత్పత్తి లేదు. 2016 డిసెంబర్ లోగా దేశమంతటా డిజిటైజేషన్ అమలు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఈ గడువు పొడిగింపు తప్పదన్న ఊహాగానాలు, సెట్ టాప్ బాక్సులు ప్రతి ఐదేళ్ళ కొకసారి సగటున మార్చాల్సి వస్తుందన్న అంచనాలు మరోఈవైపు భారతీ సంస్థను ఈ దిశగా ప్రోత్సహించాయని భావిస్తున్నారు