• Home »
  • MIB/Licencing »
  • హోం శాఖతో చర్చించాకే ’సన్’ మీద నిర్ణయం

హోం శాఖతో చర్చించాకే ’సన్’ మీద నిర్ణయం

సమాచార, ప్రసారాల సాఖామంత్రి అరుణ జైట్లీ విదేశాలనుంచి రాగానే సన్ నెట్ వర్క్ చానళ్ళ లైసెన్సుల వ్యవహారంలో కీలకమైన నిర్ణయం వెలువడవచ్చునని పరిశ్రమలో ఊహాగానాలు సాగినప్పటికీ మరికొమ్త సమయం పట్టవచ్చునని తెలుస్తోంది, హోంశాఖతో చర్చించిన తరువాతనే నిర్ణయం తీసుకోవాలను అరుణ్ జైట్లీ భావించటమే అందుకు కారణం. లిఖితపూర్వకంగా పంపిన లేఖకు హోంశాఖ ప్రతికూలంగా స్పందించటం, అటార్నీ జనరల్ అభిప్రాయం కోరగా లైసెన్సులు ఇవ్వటమే సమంజసమనే సూచన రావటం సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖను ఇరకాటంలో పెట్టింది.

హోంశాఖ అభిప్రాయానికి పెద్దపీట వెయ్యటమా, న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవటమా అనే విషయంలో సందిగ్ధత నెలకొనటంతో రాజ్ నాథ్ సింగ్ తో చర్చించిన తరువాతనే తుది నిర్ణయం తీసుకోవాలని అరుణ్ జైట్లీ ఆలోచిస్తున్నారు. పైగా ఇప్పటికే హోంశాఖకూ, సమాచార శాఖకూ మధ్య విభేదాలు భగ్గుమన్నట్టు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో ఆచి తూచి వ్యవహరించాలని అరుణ్ జైట్లీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఇలా ఉండగా ఇప్పటికే కల్ కేబుల్స్ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టులో సన్ గ్రూప్ కు అనుకూలంగా వచ్చిన ఆదేశాలమీద అప్పీల్ చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించుకుంది. మరోవైపు సన్ గ్రూప్ వారి ఎఫ్ ఎం రేడియో అనుమతుల నిరాకరణమీద కోర్టులో కేసు వేసిన సంగతీ తెలిసిందే. ఇప్పుడు కళానిధి మారన్ ఈ విషయంలోనూ కోర్టును ఆశ్రయించాలనే నిర్ణయించుకున్నారు. హోం మంత్రికి, ప్రధానికి లేఖలు రాయటం, అయినప్పటికీహోం శాఖ నుంచి జవాబు రాకపోవటం, ప్రధాని కార్యాలయం కూడా హోంశాఖ నిర్ణయాన్ని సమర్థించటం వంటి పరిణామాల నేపథ్యంలో న్యాయపోరాటం తప్పదని సన్ గ్రూప్ నిర్ణయించుకుంది