• Home »
  • Entertainment »
  • ప్రకటనల పరిమితి కేసు మళ్ళీ 2 నెలలు వాయిదా

ప్రకటనల పరిమితి కేసు మళ్ళీ 2 నెలలు వాయిదా

వాయిదాలమీద వాయిదా పడుతూ వస్తున్న ప్రకటనల పరిమితి కేసు మళ్ళీ వాయిదా పడింది. ఈ సారి రెండు నెలలకు పైగా వాయిదా పడింది. పిటిషనర్లలో ఒకరైన న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ తరఫు న్యాయవాది ఎస్. గణేశ్ అందుబాటులో లేకపోవటంతో ఈ సారి వాయిదా అనివార్యమైంది. సుప్రీంకోర్టులో కేసు కారణంగావాయిదా కోరుతున్నట్టు ఎన్ బి ఏ చెప్పింది. పైగా, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖతో కూడా ఈ సమస్య పరిష్కారం మీద చర్చలు జరుపుతున్నట్టు కోర్టుకు తెలియజేసింది.

కేబుల్ టీవీ చట్టం ప్రకారం టీవీ చానల్స్ గంటకు 10 నిమిషాల వాణిజ్య ప్రకటనలు, 2 నిమిషాల సొంత ప్రచార ప్రకటనలు మించి ప్రసారం చేయకూడదు. చానల్స్ అన్నీ కచ్చితంగా ఈ నిబంధనను పాటించాల్సిందేనంటూ ట్రాయ్ ఇచ్చిన ఆదేశాలతో కలకలం మొదలైంది. 2013 డిసెంబర్ లో ఢిల్లీ హైకోర్టు చేరినప్పటినుంచి వాయిదాలమీదనే సాగుతోంది. ఈ లోపు బలవంతంగా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని మాత్రం ట్రాయ్ ని కోర్టు ఆదేశించింది.

న్యూస్ బ్రాడ్ కాస్టర్లతోబాటు ఈటీవీ, మా టీవీ, సన్ నెట్ వర్క్, కలైజ్ఞర్, రాజ్ టీవీ నెట్ వర్క్ 9x మీడియా తదితర సంస్థలు కూడా పిటిషన్లు దాఖలు చేశాయి. డిజిటైజేషన్ పూర్తయిన తరువాత తగిన ప్రయోజనాలు అందే అవకాశం ఉన్నందున అప్పటివరకు ఆపాలని కొన్ని చానల్స్ , ప్రాంతీయ చానల్స్ కు ఆ నిబంధన నుంచి మినహాయింపు కావాలని మరికొన్ని చానల్స్ తమ పిటిషన్లలో కోరాయి.