• Home »
  • Entertainment »
  • 12 వ ప్రణాళికలో లక్ష్యం 1500 చానల్స్: అయినా ఇప్పుడున్నది 890 మాత్రమే

12 వ ప్రణాళికలో లక్ష్యం 1500 చానల్స్: అయినా ఇప్పుడున్నది 890 మాత్రమే

వచ్చే మార్చిలో 12 వ పంచవర్ష ప్రణాళిక పూర్తవుతుండగా ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ సంఖ్య విషయంలో ప్రభుత్వం తన లక్ష్యాన్ని సాధించేట్టు లేదని తేలిపోయింది. 12 వ ప్రణాళిక పూర్తయ్యే నాటికి 1500 చానల్స్ ఉంటాయని అంచనా వేయగా ప్రస్తుతానికి ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ సంఖ్య 890 కి చేరింది.  వచ్చే మార్చికి మిగిలిన 610 చానల్స్ రావు కాబట్టి లక్ష్యం నెరవేరనట్టే అవుతుంది.

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు సంబంధించిన విషయాలు పరిశీలించే పార్లమెంటరీ సంఘం 2012-17 మధ్య కాలంలో అనుమతులు పొందే  చానల్స్ కలుపుకొని మొత్తం 1500 కు చేరతాయని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అంచనావేసిందని పేర్కొంది. అయితే, సమాచార ప్రసార మంత్రిత్వశాఖ అందజేసిన నివేదిక అందుకు భిన్నంగా ఉందని చెప్పింది.

ఇలా ఉండగా ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్ అదనపు సౌకర్యాలు పెంచుకుంటూ మొత్తం 900 చానల్స్ ప్రసారాలను రికార్డు చేయటానికి, పరిశీలించటానికి ఏర్పాట్లు చేసుకున్నట్టు మంత్రిత్వశాఖ తెలియజేసింది. అందువలన లైసెన్స్ పొందిన చానల్స్ అన్నీ మానిటర్ చేయటానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఈ విషయాన్ని కూడా పార్లమెంటరీ కమిటీ దృష్టికి తీసుకువచ్చింది.  బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ( బెసిల్ ) ఇప్పుడు ఉచిత చానల్స్ అన్నిటినీ మానిటరింగ్ సెంటర్ లో మానిటర్ చేయగలిగే విధంగా ఏర్పాట్లు చేస్తోంది.

అయితే, పే చానల్స్ విషయంలో మాత్రం ఆ యా చానల్స్ కొన్ని పరికరాలు అందజేయాల్సి ఉంటుంది. ఎన్ క్రిప్ట్ చేసిన సిగ్నల్స్ ప్రసారం చేస్తాయి కాబట్టి పే చానల్స్ తమ తమ చానల్స్ ను అందుకొని డీక్రిప్ట్ చేయటానికి వీలుగా రిసీవర్లు అందించాల్సి ఉంటుంది. ఇది కూడా మరో నాలుగు నెలల సమయంలో పూర్తవుతుందని భావిస్తున్నారు.

మానిటరింగ్ సెంటర్ 12 వ ప్రణాళిక పూర్తయ్యేసరికి మొత్తం 1500 చానల్స్ ప్రసారాలను నిల్వ చేసుకొగలిగే స్థాయికి ఎదుగుతుందని భావిస్తున్నారు.

2014-15 ముగిసే సరికి 600 చానల్స్ ప్రసారాలను రికార్డు చేసి మానిటర్ చేయాలన్న లక్ష్యాన్ని ఇ ఎమ్ ఎమ్ సి సాధించిందని, 2016 మార్చి చివరినాటికి 90 కోట్లలో 56 కోట్ల 37 లక్షలు ఖర్చుచేయగలిగింది. 2015-16 కు బడ్జెట్ అంచనాలు రూ. 21 కోట్లు కాగా 2016-17 సంవత్సరానికి ఆ మొత్తాన్ని 12 కోట్లకు తగ్గించినట్టు సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పార్లమెంటరీ కమిటీకి తెలియజేసింది.

మానిటరింగ్ కోసం అవసరమైన అన్ని పరికరాల కొనుగోలు పూర్తయిందని అయితే, ప్రసారాల నిల్వకోసం మాత్రమే అదనపు ఏర్పాట్లు చేసుకోవలసి ఉందని మంత్రిత్వశాఖ తెలియజేసింది. 2015-16 లో 11 చానల్స్ కార్యక్రమాలు, ప్రకటనల నియమావళిని ఉల్లంఘించినట్టు గుర్తించామని, ముందుగా సెన్సార్ చేసే అవకాశం లేకపోవటం వల్ల ఉల్లంఘనలు గమనించిన వెంటనే మానిటరింగ్ సెంటర్ వారు మంత్రిత్వశాఖ దృష్టికి తెస్తారని, విచారణ జరిపిన మంత్రిత్వశాఖ తగిన చర్యలు తీసుకుంటుందని వివరించింది.