• Home »
  • Data & Projections »
  • మొదటి త్రైమాసికంలో ప్రకటనల హద్దుమీరిన పే చానల్స్133

మొదటి త్రైమాసికంలో ప్రకటనల హద్దుమీరిన పే చానల్స్133

కేబుల్ టీవీ చట్టంలో పేర్కొన్న పరిమితికి మించి ప్రకటనలు ప్రసారం చేస్తున్న టీవీ చానల్స్ జాబితాను టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) విడుదల చేసింది.  గంటకు 12 నిమిషాల ప్రకటనల వరకు కేబుల్ టీవీ చట్టం అనుమతించగా ఈ ఏడాది  మొదటి త్రైమాసికంలో  ( 2015 డిసెంబర్ 28 నుంచి 2016 మార్చి27 వరకు ) మొత్తం 133  పే చానల్స్ ఈ పరిమితిని దాటిపోయాయి. అయితే అంతకు ముందు త్రైమాసికంలో హద్దుమీరిన చానల్స్ 149 కాగా ఈసారి 16 చానల్స్ తగ్గాయి.

హద్దుమీరి ప్రకటనలు ప్రసారం చేసిన  పే  చానల్స్ లో 103 ఎంటర్టైన్మెంట్, ఇన్ఫొటైన్మెంట్ చానల్స్ కాగా 30 న్యూస్ చానల్స్ ఉన్నాయి.  గతంలో 28 న్యూస్ చానల్స్ లో ప్రకటనలు పరిమితిని మించిపోగా ఇప్పుడు ఆ సంఖ్య స్వల్పంగా పెరిగి 30 కి చేరింది.  అదే ఎంటర్టైన్మెంట్ చానల్స్ విషయానికొస్తే 121 నుంచి 103 కి తగ్గాయి.  తెలుగులో 11ఎంటర్టైన్మెంట్ చానల్స్ తోబాటు ఒక న్యూస్ చానల్ ఈ పరిమితి దాటింది.

టీవీ చానల్స్ లో ప్రసారమయ్యే ప్రకటనలు గంటకు 12 నిమిషాలు మించకూడదన్న నిబంధన మీద కేసు  కోర్టులో వాయిదాలమీద వాయిదాలు పడుతుండగా ఉల్లంఘన కూడా కొనసాగుతూనే ఉంది. కేబుల్ టీవీ చట్టం ప్రకారం టీవీ చానల్స్ గంటకు 10 నిమిషాల వాణిజ్య ప్రకటనలతోబాటు 2 నిమిషాల సొంత ప్రచార ప్రకటనలు ప్రసారం చేసుకోవచ్చు. అయితే, అనేక చానల్స్ ఈ నిబంధనను తుంగలో తొక్కి ఒక్కోసారి గంటకు 25 నిమిషాల దాకా ప్రకటనలు ప్రసారం చేసిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా ఏదైనా కొత్త సినిమా ప్రసారం చేస్తే అలాంటప్పుడు రెండున్నర గంటల సినిమా నాలుగ్గంటల దాకా సాగిన సందర్భాలు చాలా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈ నిబంధనను గట్టుగా అమలుచేయటానికి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రయత్నించినప్పుడు అనేక చానల్స్ కోర్టుకెక్కాయి.  కోర్టు స్టే ఇవ్వటంతో చానల్స్ కు తాత్కాలిక ఊరట లభించింది. అయితే, చానల్స్ తాము ప్రసారం చేసిన ప్రకటనల వివరాలను నమోదు చేసి ఉంచాలని ఆదేశించటంతో ఎప్పటికప్పుడు ఆ వివరాలను ట్రాయ్ కి అందజేస్తున్నాయి. అదే సమయంలో ట్రాయ్ కూడా స్వయంగా ఈ జాబితా తయారుచేసి ఎప్పటికప్పుడు తన వెబ్ సైట్ లో పెడుతూ వస్తోంది.

రాత్రి 7 నుంచి 10 గంటలవరకు అత్యధిక ప్రేక్షకాదరణ ఉండే కీలకమైన సమయంలో  పే న్యూస్ చానల్స్ లో అత్యధికంగా ఈటీవీ రాజస్థాన్ 24.83 నిమిషాలమేరకు ప్రకటనలు ప్రసారం చేసింది. 12.15 నిమిషాలతో స్వల్పంగా పరిమితి దాటిన పే న్యూస్ చానల్ టైమ్స్ నౌ. అదే విధంగా ఎంటర్టైన్మెంట్ పే చానల్స్ లో అత్యధికంగా 23.41 నిమిషాల పాటు ప్రకటనలు ప్రసారం చేసిన చానల్ బి4యు మూవీస్ కాగా కొద్దిగా మీరిన చానల్ ఒడిశాకు చెందిన తరంగ్. అది 12.04 నిమిషాల ప్రకటనలు ప్రసారం చేసింది. 15 నిమిషాలు దాటిన చానల్స్ లో 16 న్యూస్ చానల్స్, 24 ఎంటర్టైన్మెంట్ చానల్స్ ఉన్నాయి.

 

తెలుగు చానల్స్ లో ప్రకటనల హద్దుమీరిన చానల్స్ పరిస్థితి ఇలా ఉంది :

సంఖ్య చానల్ ప్రైమ్ టైమ్ లో సగటు ప్రకటనల సమయం ( నిమిషాలలో)
1 జెమిని మూవీస్ 17.09
2 జెమిని మ్యూజిక్ 16.09
3 జెమిని టీవీ 15.63
4 జెమిని టీవీ హెచ్ డి 15.63
5 జెమిని కామిడీ 14.78
6 మా టీవీ 13.61
7 జీ తెలుగు 13.44
8 ఖుషి టీవీ 12.95
9 మా మ్యూజిక్ 12.65
10 ఈటీవీ తెలుగు 12.49
11 మా గోల్డ్ 12.32
12 ఈటీవీ ఆంధ్రప్రదేశ్ 12.30

తెలుగులో మొత్తం 12 చానల్స్ ఈ పరిమితిని మించి ప్రకటనలు ప్రసారం చేయగా అందులో 11 ఎంటర్టైన్మెంట్ చానల్స్, ఒక న్యూస్ చానల్ ఉన్నాయి.  జెమిని మూవీస్ సహా జెమిని గ్రూప్ చానల్స్ అత్యధికంగా ప్రకటనల పరిమితిని మీరినట్టు స్పష్టంగా తెలుస్తోంది. మొదటి ఐదు స్థానాలతోబాటు ఎనిమిదో స్థానం కూడా జెమిని గ్రూప్ కే చెందుతుంది. స్టార్ గ్రూప్ కి చెందిన మాటీవీ, మా మ్యూజిక్, జీ గ్రూప్ వారి జీ తెలుగు, ఈటీవీ గ్రూప్ వారి ఈటీవీ తెలుగు ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తంగా చూస్తే తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో ప్రధానమైన జెమిని టీవీ, ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు .. నాలుగు చానల్స్ ప్రకటనల పరిమితిని మీరాయి. ఇక పే న్యూస్ చానల్స్ లో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ పరిమితి దాటింది. తెలుగు న్యూస్ చానల్స్ లో జెమిని న్యూస్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ మాత్రమే పే చానల్స్ కాగా అందులో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఒక్కటే పరిమితి మించి ప్రకటనలు ప్రసారం చేసింది.