14న హనుమకొండలో ట్రాయ్ అవగాహన సదస్సు

వినియోగదారుల అవగాహన కార్యక్రమాల నిర్వహణలో భాగంగా టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా (ట్రాయ్) ఈ నెల 14 న ఉదయం 11 గంటలకు హనుమకొండలోని అశోకా హోటల్ లో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. కేబుల్ టీవీ డిజిటైజేషన్ అమలు కొనసాగింపులో భాగంగా ట్రాయ్ విడుదలచేసిన కొత్త టారిఫ్ ఆర్డర్ అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు చందాదారులకు వస్తున్న అనేక అనుమానాలమీద ఈ వేదిక ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం జరుగుతుంది.

కేబుల్ బిల్లు తగ్గుతుందన్న ట్రాయ్ వాదన మీద చందాదారులు ప్రధానంగా ప్రశ్నించే అవకాశం ఉంది. అదే నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద లభించే 100 ఉచిత చానల్స్ లో దూరదర్శన్ చానల్స్ తప్పనిసరి చేసినమీదట ఛాయిస్ 74 కే పరిమితమయ్యే పరిస్థితి మీద కూడా చందాదారులు నిలదీసే అవకాశాలున్నాయి. ఎమ్మెస్వోలతో ఆదాయ పంపిణీ నిష్పత్తి నిర్ణయం అశాస్త్రీయంగా ఉందన్న విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆపరేటర్లు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతోంది.

బ్రాడ్ కాస్టర్ల బొకే ధరల డిస్కౌంట్ మీద 15% డిస్కౌంట్ విధించే నియమాన్ని మద్రాసు హైకోర్టు కొట్టివేసినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళకపోవటం కేవలం బ్రాడ్ కాస్టర్లకు మేలు చేయటానికే కదా అనే ప్రశ్నకూ ట్రాయ్ జవాబిచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చందాదారులమీద ఇంతటి పెనుభారం పడటానికి, అ లా కార్టే చానల్స్ తీసుకోలేకపోవటానికి ఇదే కారణమన్న అభిప్రాయానికి ట్రాయ్ ఎలా సమాధానమిచ్చుకుంటుందో చూడాలి.

ట్రాయ్ విధానాలు బ్రాడ్ కాస్టర్లకు, డిటిహెచ్ కి అనుకూలంగా ఉండటం మీద ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు ప్రశ్నలతో ముంచెత్తటానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఇంతకుముందే ఎందుకు నిర్వహించలేదన్న ప్రశ్న కూడా ట్రాయ్ కి ఎదురుకాబోతోంది. మొత్తంగా చూస్తే ట్రాయ్ ఏమేరకు  అందరికీ సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలుగుతుందో చూడాలి.

 రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, బ్రాడ్ కాస్టింగ్, కేబుల్ రంగాల ప్రతినిధులు, టీవీ వీక్షకులు, వినియోగదారుల సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మరేవైనా వివరాలు కావాలంటే ట్రాయ్ సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ వి. సుధాకర్ రెడ్డి ( మొబైల్: 9441280059 లేదా మెయిల్ vasure999@gmail.com) ని సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!