• Home »
  • Entertainment »
  • గంటకు 10+2 నిమిషాల ప్రకటనల పరిమితిని ఉల్లంఘించిన చానల్స్ 141

గంటకు 10+2 నిమిషాల ప్రకటనల పరిమితిని ఉల్లంఘించిన చానల్స్ 141

ప్రకటనల పరిమితి పాటించని టీవీ చానల్స్ 141ఉన్నట్టు తేలింది. గంటకు 10 నిమిషాల వాణిజ్య ప్రకటనలు, 2 నిమిషాల సొంత ప్రచార ప్రకటనలు మించకుండా ప్రసారం చేసుకోవాలనేది కేబుల్ టీవీ చట్టం నిర్దేశిస్తున్న పరిమితి. అయితే, ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయటానికి ట్రాయ్ నిర్ణయించినప్పుడు కొన్ని చానల్స్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఈ వ్యవహారం కోర్టుకెక్కగా ఈ నెల 8 న సుప్రీంకోర్టు విచారణ చేపట్టబోతోంది. ఈ లోపు అన్ని చానల్స్ ఎంతసేపు ప్రకటనలు ప్రసారం చేసిందీ లెక్కలు చూపాలని ట్రాయ్ నిర్దేశించింది. అయితే, ఆ లెక్కల ఆధారంగా చర్యలు మాత్రం తీసుకోవద్దని సుప్రీంకోర్టు సూచించింది.

ట్రాయ్ కి ఆయా చానల్స్ అందజేసిన నివేదికలను బట్టి చూస్తే మొత్తం 141 చానల్స్ ఈ పరిమితిని మించి ప్రకటనలు ప్రసారం చేస్తున్నాయి. అందులో  36 న్యూస్ చానల్స్, 105 నాన్ న్యూస్ చానల్స్. ఇందులో అత్యధికంగా ఇండియా టీవీ ఒక గంటలో 23 నిమిషాలపాటు ప్రకటనలు ప్రసారం చేసినట్టు తేలింది. 15 నిమిషాలకి మించి ప్రకటనలు ప్రసారం చేస్తున్న చానల్స్ లో 17 న్యూస్ చానల్స్, 19 నాన్ న్యూస్ చానల్స్ ఉన్నాయి.

ప్రకటనల పరిమితి అమలుకోసం ట్రాయ్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ న్యూస్ బ్రాడ్ కాస్టర్ల సంఘం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో ట్రాయ్ ని, సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖను ప్రతివాదులుగా చేసింది. ఇలా ఉండగా సమాచార, ప్రసార శాఖామంత్రి అరుణ్ జైట్లీ ఒక సందర్భంలో మాట్లాడుతూ టీవీ చానల్స్ కు ప్రకటనలమీద పరిమితి ఉండటం అనవసరమని వ్యాఖ్యానించటం తో కొంత అయోమయ వాతావరణం ఏర్పడింది. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమే తప్ప ప్రభుత్వ అభిప్రాయం కాదని ఆ తరువాత వివరణ ఇచ్చినా ప్రయోజనం కనబడలేదు.