• Home »
  • International Channels »
  • 2015 లో 60 కొత్త చానల్ లైసెన్సులు: మూడేళ్ళలో ఇదే రికార్డు స్థాయిలో జారీ

2015 లో 60 కొత్త చానల్ లైసెన్సులు: మూడేళ్ళలో ఇదే రికార్డు స్థాయిలో జారీ

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నిరుడు ఒక్క సంవత్సరంలోనే 60 కొత్త చానల్స్ కి లైసెన్సులు మంజూరు చేసింది. వరుసగా మూడేళ్ళ కాలాన్ని చూస్తే ఇదే రికార్డు. నిబంధనలు సరళతరం చేస్తూ ప్రతినెలా 20 వతేదీ నాడు దరఖాస్తుదారులు తమ దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకొవటానికి వీలుకల్పించటం లాంటి చర్యలే ఇందుకు కారణమని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రకటించింది.

భద్రతాపరమైన నిబంధనలను ఎంతమాత్రమూ నీరుగార్చకుండానే అనేక చర్యలు తీసుకోవటం వలన ఇది సాధ్యమైనట్టు కూడా ఎంఐబి చెప్పింది. అంతా పారదర్శకంగా ఉండేట్టు చేయటం వలన అపోహలు తొలగిపోయాయని చెబుతూ హోంశాఖతో ఈ విషయంలో జరిపిన సంప్రదింపుల ఫలితంగానే ఇది సాధ్యమైనట్టు వివరణ ఇచ్చింది.

కేవలం చానల్ లైసెన్సులే కాకుండా పేరు, లోగో మార్పు, డిఎస్ ఎన్ జి వాన్ల వాడకానికి అనుమతులు, శాటిలైట్ మార్పు, షేర్ హోల్డింగ్ పాటెర్న్ లో మార్పు, కొత్త డైరెక్టర్లు చేరటం, విదేశీ ప్రత్యక్షపెట్టుబడులకు అనుమతులు, డిజిటల్ ఎమ్మెస్వోలకు శాశ్వత లైసెన్సుల జారీ లాంటి అనేక విషయాలలో మంత్రిత్వశాఖ చాలా చురుగ్గా వ్యవహరించినట్టు కూడా చెప్పుకొచ్చింది.

ఏకకాలంలో వివిధ శాఖల అనుమతులకు పంపటం ద్వారా వీలైనంత త్వరగా శాటిలైట్ చానల్స్ కు లైసెన్సుల మంజూరుకు మార్గం సుగమమైందని వివరణ ఇచ్చింది. అదే విధంగా డిజిటల్ ఎమ్మెస్వోల లైసెన్సులకు హోం మంత్రిత్వశాఖ క్లియరెన్స్ అవసరం లేదంటూ నిబంధనను సవరించటం వలన వేగంగా ఎమ్మెస్వో లైసెన్సులు ఇవ్వటం కూడా సాధ్యమైంది.

అయితే, ఈ లైసెన్సులన్నీ ఇంతకుముందే కొన్ని చానల్స్ కు లైసెన్స్ పొందిన సమ్స్థలు మాత్రమే కావటం విశేషం. ఆ సంస్థల డైరెక్టర్లకు హోం శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ వచ్చి ఉండటం వలన ఇప్పుడు కొత్తగా క్లియరెన్స్ అవసరం లేకపోవటంతో వాళ్ళ అదనపు చానల్స్ కు మాత్రమే లైసెన్స్ ఇచ్చిన విషయాన్ని మంత్రిత్వశాఖ స్పష్టంగా చెప్పకపోవటం విశేషం. స్టార్, సోనీ, ఈటీవీ లాంటి పెద్ద గ్రూపులకు మాత్రమే లైసెన్సులు వచ్చాయి.