• Home »
  • Cable »
  • తెలుగు రాష్ట్రాల్లో మూడో దశలో అమర్చిన సెట్ టాప్ బాక్సులు 21.8 లక్షలు

తెలుగు రాష్ట్రాల్లో మూడో దశలో అమర్చిన సెట్ టాప్ బాక్సులు 21.8 లక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మూడో దశ కేబుల్ టీవీ డిజిటైజేషన్ బాగా ఆలస్యం కావటానికి సెట్ టాప్ బాక్సుల కొరతే కారణమంటూ హైకోర్టులో స్టే తెచ్చుకున్న నేపథ్యంలో అసలు ఎన్ని బాక్సులు అమర్చారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. సమాచార హక్కు చట్టం కింద సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు పంపిన అభ్యర్థనకు సమాధానంగా వచ్చిన వివరాల ప్రకారం రెండు రాష్ట్రాల్లో 21 లక్షల 80 వేల బాక్సులు మూడోదశలో అమర్చారు. ఇందులో కేబుల్ ఆపరేటర్లు/ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు, హిట్స్ ఆపరేటర్లు అమర్చిన సెట్ టాప్ బాక్సులన్నీ కలిసి ఉన్నాయి.

మూడో దశకింద అమర్చిన 21 లక్షల 80 వేల బాక్సుల్లో కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు అమర్చినవి 11 లక్షల యాభై వేలు. అంటే దాదాపు సగం ఉన్నాయి. డిటిహెచ్ ఆపరేటర్లు 10 లక్షల పదివేల బాక్సులు అమర్చారు. ఆ విధంగా కేబుల్ కంటే కొద్దిగా వెనకబడ్డారు. ఇక మూడో విభాగమైన హెడ్ ఎండ్ ఇన్ ద్ స్కై ( హిట్స్ ) విషయానికొస్తే 12,980 బాక్సులు అమర్చినట్టు ప్రభుత్వ సమాచారం చెబుతోంది. హిట్స్ విభాగంలో జైన్ హిట్స్, హిందుజా వారి నెక్స్ట్ డిజిటల్ ఉన్న సంగతి తెలిసిందే.

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జారీచేసిన తాజా టీవీ ఇళ్ల లెక్కప్రకారం మూడోదశలో ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల యాభై వేలు, తెలంగాణలో 8 లక్షల 60 వేలు ఉన్నాయి.  అంటే, మొత్తం 29 లక్షల 10 వేల ఇళ్లుండగా అందులో 21 లక్షల 80 వేల ఇళ్ళలోసెట్ టాప్ బాక్సులు పెట్టారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో 75 శాతం డిజిటైజేషన్ పూర్తయినట్టు ప్రభుత్వం చెబుతోంది.

గత నెలలో జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ ఆర్ జయ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా డిసెంబర్ 30 నాటికి 76.45% డిజిటైజేషన్ పూర్తి కాగా ఫిబ్రవరి 15 నాటికి అది 90.44% అయినట్టు వెల్లడించారు. ఆ విధంగా చూస్తే  తెలుగు రాష్ట్రాల్లో సెట్ టాప్ బాక్సులు అమర్చిన శాతం డిసెంబర్ ఆఖరునాటికి జాతీయ సగటుకు దగ్గర్లోనే ఉంది.

సెట్ టాప్ బాక్సుల కొరత కారణంగా డిజిటైజేషన్ పూర్తి కాలేదని పేర్కొంటూ  తెలుగు రాష్ట్రాల ఎమ్మెస్వోల నాయకులు హైకోర్టులో స్టే తీసుకురావటం, దాని ఆధారంగా అనేక రాష్ట్రాలలో స్టే రావటం, దేశంలో మూడొంతుల రాష్ట్రాలలో డిజిటైజేషన్ స్తంభించిపోవటం తెలిసిందే. ఈ స్టే మీద మళ్ళీ పొడిగింపు రావటం కూడా తెలిసిందే. ఈ స్టే లన్నీ తొలగించాలంటూ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఈ నెల 14 న విచారణకు రాబోతోంది.