• Home »
  • Uncategorized »
  • వాడని డిటిహెచ్ సెట్ టాప్ బాక్సులు 3 కోట్లు: ట్రాయ్

వాడని డిటిహెచ్ సెట్ టాప్ బాక్సులు 3 కోట్లు: ట్రాయ్

సెట్ టాప్ బాక్సులు మార్చుకునే అవకాశం లేకపోవటం వలన దేశ వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల సెట్ టాప్ బాక్సులు వృధాగా పడి ఉన్నట్టు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అంచనావేసింది. కేబుల్ టీవీ రంగంలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్టు భావిస్తోంది. డిటిహెచ్ ఆపరేటర్లు ఎవరికి వారు తన బాక్సులు ప్రత్యేకంగా అందించటం, చందాదారుడు తన సర్వీస్ ప్రొవైడర్ ను మార్చాలనుకున్నప్పుడు ఆ బాక్స్ పనిచేయకపోవటం కారణంగా ఇలా మిగిలిపోతున్నాయి.

ఏ సర్వీస్ ప్రొవైడర్ అయినా అదే సెట్ టాప్ బాక్స్ పనిచేసే అవకాశమే ఉంటే ఇలా జరిగేది కాదని ట్రాయ్ ఆలస్యంగా గ్రహించింది. ఒక్క డిటిహెచ్ వల్లనే దాదాపు 4500 కోట్ల రూపాయల ధనం వృధా అయినట్టు గుర్తించింది. పైగా, ఎలక్ట్రానిక్ వర్థాల పెరుగుదలకూ దారితీసినట్టువుతోందని గ్రహించింది. అందుకే సెట్ టాప్ బాక్సులు మార్చుకోవటం సాధ్యమయ్యేలా రూపొందించటం మీద వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించటానికి ఒక చర్చా పత్రం విడుదలచేసింది.
డిసెంబర్ 2015 నాటికి డిటిహెచ్ ఆపరేటర్లు సమర్పించిన డేటా ప్రకారం మొత్తం 8 కోట్ల 55 లక్షల సెట్ టాప్ బాక్సులు చందాదారులకు అమ్మగా ప్రస్తుతం సేవలందుకుంటున్న చందాదారుల సంఖ్య 5 కోట్ల 50 లక్షలని తేలింది. అంటే, మూడు కోట్ల సెట్ టాప్ బాక్సులు వృధాగా పడి ఉన్నాయి.  ఇందుకు ప్రధాన కారణం సెట్ టాప్ బాక్సులు ఒక ఆపరేటర్ నుంచి మరో ఆపరేటర్ కు మార్చుకునే సౌలభయం లేకపోవటం వల్లనేనని కూడా ట్రాయ్ తేల్చింది.

కేబుల్ టీవీ విషయంలోకూదా ఇలాగే పెద్ద సంఖ్యలో వృధాగా పడి ఉండే సెట్ టాప్ బాక్సులుంటాయని తెలుస్తున్నప్పటికీ నిర్దిష్టమైన సంఖ్య వెల్లడి కావటం లేదు. డిటిహెచ్ ఆపరేటర్లు పరిమితంగా అంటే ఆరుగురే ఉండటం వలన వారినుంచి డేటా సులభంగా రాబట్టగలిగిన ట్రాయ్ కేబుల్ ఎమ్మెస్వోలనుంచి మాత్రం సంపాదించే అవకాశం లేదు. అందుకే ఈ గణాంకాలు అందుబాటులోకి రాలేదు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే సెట్ టాప్ బాక్సులు ఏ ఆపరేటర్ కిందికైనా పనికొచ్చే ఏర్పాటు ఉండటం మీద ట్రాయ్ ఇప్పుడు అభిప్రాయాలు కోరుతోంది.