• Home »
  • Cable »
  • తెలుగు రాష్ట్రాల్లో కేబుల్ మీద ఫిర్యాదులు: నిజామాబాద్ కుల్దీప్ సహానీతో ఆరంభం

తెలుగు రాష్ట్రాల్లో కేబుల్ మీద ఫిర్యాదులు: నిజామాబాద్ కుల్దీప్ సహానీతో ఆరంభం

అనుమతి లేకుండా డౌన్ లింక్ చేసుకొని ప్రసారం చేస్తున్న పీస్ టీవీ విషయంలో దేశ వ్యాప్తంగా ఐదు ఫిర్యాదులు రాగా అందులో రెండు తెలుగు రాష్ట్రాలనుంచి రెండేసి చొప్పున అందాయి. ఔరంగాబాద్ కేబుల్ ఆపరేటర్ మీద అందిన ఫిర్యాదును పరిశీలించి అలాంటి ప్రసారం జరగలేదని అక్కడి కలెక్టర్ ధృవీకరించారు. కర్నూలు లో సీమ కమ్యూనికేషన్స్ ను ఇప్పటికే మూసివేయగా మిగిలిన మూడు కేబుల్ సంస్థల విషయంలో దర్యాప్తు జరుగుతోంది.

ఈ నెల 7 న మొదటి సారిగా నిజామాబాద్ నుంచి కుల్దీప్ సహానీ అక్కడి వెంకట సాయి ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మీద ఫిర్యాదు చేస్తూ పీస్ టీవీ ని ప్రసారం చేసినట్టు పేర్కొన్నారు. ఆ ఫిర్యాదుమీద స్పందించిన మంత్రిత్వశాఖ అధికారులు ఈ నెల 22 న జిల్లా కలెక్టర్ విచారణకోసం పంపారు. అదే విధంగా కరీంనగర్ కు చెందిన సాయి కమ్యూనికేషన్స్ మీద ఎ. తిరుపాల్ రెడ్డి అనే వ్యక్తి, కర్నూలు జిల్లా నంద్యాల డిజిటల్ టీవీ కమ్యూనికేషన్స్ తరఫున సిటీ విజన్ డిజిటల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్  మీద మరో ఫిర్యాదు మంత్రిత్వశాఖకు అందగా ఆయా జిల్లా కలెక్టర్లకు పంపింది.

అయితే, ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు ప్రసారం చేసే కేబుల్ చానల్స్ విషయంలో  కచ్చితమైన నిబంధనలు లేకపోవటం వలన సమస్యలు తలెత్తుతున్నాయని ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయంలో ట్రాయ్ ఇప్పటికే ఒక చర్చా పత్రం విడుదల చేసి ప్రభుత్వానికి సిఫార్సులు పంపగా ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీనివలన కేబుల్ చానల్స్ రూపంలో పంపిణీ అయ్యే ప్రసారాలమీద చర్యలు తీసుకునే అవకాశం లేకుండాపోయింది.