• Home »
  • BARC »
  • ఐదుగురు టీవీ రేటింగ్స్ దొంగల అరెస్ట్ : సన్ గ్రూప్ చానల్ కోసమే ఇదంతా!

ఐదుగురు టీవీ రేటింగ్స్ దొంగల అరెస్ట్ : సన్ గ్రూప్ చానల్ కోసమే ఇదంతా!

రేటింగ్స్ ఎంత ఎక్కువగా ఉంటే ప్రకటనల అదాయం ఎంత ఎక్కువగా ఉంటుంది. కార్యక్రమాలు ఆకట్టుకుంటే రేటింగ్స్ వచ్చేమాట నిజమేగాని అంతకంటే సులువైన అడ్డదారులకోసం ప్రయత్నించే వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతుంటారు. రేటింగ్ ఏజెన్సీలు ఎని జాగ్రత్తలు తీసుకున్నా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు కనిపెడుతూనే ఉన్నారు.

గతంలో టామ్ ఇండియా ఆధ్వర్యంలో రేటింగ్స్ లెక్కించినప్పుడు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు తరచూ వినబడటంతో స్వయంగా చానల్స్, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలు కలిసి బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్) ఏర్పాటు చేసుకున్నాయి. అయినా సరే దొంగలు కొత్త మార్గాలు వెతుక్కుంటూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా కర్నాటకలో ఈ మోసం బయటపడింది.

దక్షిణాదిన తిరుగులేని సామ్రాజ్యం నడిపిస్తూ వచ్చిన సన్ టీవీ వారి ఉదయ టీవీ దాదాపు రెండు దశాబ్దాలపాటు కన్నడ మార్కెట్ ను ఏలినప్పటికీ ఈ మధ్య కాలంలో బాగా వెనకబడటంతో ఇప్పుడు ఈ అక్రమ మార్గాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్టు బైటపడింది. బార్క్ డేటాను తారుమారు చేస్తున్నట్టు గుర్తించటంతో బార్క్ ఫిర్యాదు మేరకు బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు  ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిని కోర్టు జుడిషియల్ రిమాండ్ కు పంపగా, పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

అరెస్టయినవారిలో టీవీ సీరియల్ నిర్మాత రాజు ( ప్రస్తుతం ఉదయ టీవీలో రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే సీరియల్ కావేరి నిర్మాత) ఉన్నారు. ఈ సీరియల్ 2017 జూన్ నుంచి ప్రసారమవితోంది. ఆయన గతలో ఈటీవీ కన్నడ ( ప్రస్తుతం కలర్స్ కన్నడ గా మారింది) లో  సుదీర్ఘకాలం నడిచిన అమ్మా నిన్నెగాగె సీరియల్, నిర్మించారు.  కర్నాటకలో ఏయే ఇళ్ళలో రేటింగ్స్ మీటర్లున్నాయో తెలుసుకొని డేటా తారుమారయ్యేలా చేస్తున్నట్టు ఆయనమీద బార్క్ ఫిర్యాదు చేసింది. ఆయనకు సహకరించిన వారిలో సురేష్, సుభాష్, జెమ్సీ (బెంగళూరు), మధు (మైసూరు) ఉన్నారు.

రేటింగ్స్ మీటర్లున్న ఇళ్ళలో డబ్బు ఇవ్వటం ద్వారా ఒక నిర్దిష్ట సమయంలో వారు చెప్పిన చానల్ మాత్రమే చూసేట్టు ఒప్పందం చేసుకుంటున్నారు. శాంపిల్ ఇళ్ళను పట్టుకోవటం ద్వారా మొత్తం ప్రేక్షకుల అభిప్రాయం అదేనన్నట్టు రేటింగ్స్ సమాచారం వచ్చేలా చూసుకుంటున్నారు. శాంపిల్ ఇళ్ళు ఎలా తెలిశాయన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. నిజానికి రేటింగ్స్ మీటర్లు అమర్చే పనిని ఈ మధ్యనే బార్క్ ఒక సంస్థకు అప్పగించగా వాళ్ళ ద్వారా తెలిసే అవకాశం ఉందేమోనన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది.

ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అయిన రాజు మరికొంతమంది సీరియల్ నిర్మాతలను కూడా కలిసి, డబ్బిస్తే రేటింగ్స్ తెప్పిస్తానంటూ చెప్పేవాడని దర్యాప్తులో వెలడైంది. అందువలన తన సీరియల్ కోసం మాత్రమే ఇలా చేశాడా, ఈయన మాటలను నమ్మి మరెవరైనా నిర్మాతలు కూడా ఈయన సేవలు వాడుకున్నారా అనేది ఇంకా తేలాల్సి ఉందని బెంగళూరు పోలీసులు చెబుతున్నారు.

ఏయే చానల్స్, ఏయే కార్యక్రమాల కోసం ఇలాంటి అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నాయోనన్న అనుమానాలు ఇప్పుడు ఎద్ద ఎత్తున మొదలయ్యాయి. రేటింగ్స్ మీద ఇప్పటికీ పూర్తి స్థాయిలో విశ్వాసం లేఅపోగా ఇలాంటి ఘటనలు ఉన్న కొద్దిపాటి నమ్మకాన్ని కూడా తుడిచిపెట్టేలా చేస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతుండగా దర్యాప్తు ఆధారంగా చానల్స్ ను రేటింగ్స్ నుంచి బహిష్కరించటానికి కూడా వెనుకాడబోమని బార్క్ హెచ్చరిస్తోంది. చానల్స్ కూడా తమ పరిధిలోని నిర్మాతలు అలాంటి చర్యలకు పాల్పడితే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కోరుతోంది.