• Home »
  • Cable »
  • తెలుగు రాష్ట్రాలకు మరో 5 ఎమ్మెస్వో లైసెన్సులు

తెలుగు రాష్ట్రాలకు మరో 5 ఎమ్మెస్వో లైసెన్సులు

జూన్ 22 తరువాత సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ మరో 25 డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్సులు జారీచేసింది. అందులో  3  తెలంగాణ రాష్ట్రానికి, 2 ఆంధ్రప్రదేశ్ కు ఉన్నాయి.  దీంతో జులై 6 వరకు  దేశవ్యాప్తంగా డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్సులు పదేళ్ళపాటు శాశ్వత ప్రాతిపదికన  పొందినవారి సంఖ్య 219 కి చేరింది. తాజాగా లైసెన్సులు పొందిన 25 సంస్థలలో ఐదింటికి భారతదేశమంతటా డిజిటల్ కేబుల్ నిర్వహణకు అనుమతి లభించగా మిగిలిన ఆయా ప్రాంతాలకోసం దరఖాస్తు చేసుకున్నవి.

తెలుగు రాష్ట్రాలలో లైసెన్స్ వచ్చిన ఐదు ఎమ్మెస్వోలలో కరీంనగర్ కు చెందిన మానేర్ డిజిటల్ నెట్ వర్క్ ( తెలంగాణ రాష్టమంతటా కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ), నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన సాయి డిజిటల్ సర్వీసెస్ ( ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ), నల్గొండ జిల్లా నార్కట్ పల్లి కి చెందిన వన్ డిజిటల్ టీవీ సర్వీసెస్ (నల్గొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు), చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన భాగ్యలక్ష్మి కమ్యూనికేషన్ నెట్ వర్క్ ( మూడు, నాలుగు దశల డిజిటైజేషన్ జరిగే చిత్తూరు జిల్లాలోని రొంపిచెర్ల, చినగొట్టిగల్లు, బాక్రాపేట, సొదుం,సోమల, చౌడేపల్లి, కల్లూరు, దామలచెరువు, కలికిరి ), పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన భీమవరం కమ్యూనిటీ నెట్ వర్క్ ( పశ్చిమ్ అగోదావరి జిల్లాలో మూడు,నాలుగు దశల డిజిటైజేషన్ ప్రాంతాలకు ) ఉన్నాయి

అదే విధంగా ప్రభుత్వం ఎమ్మెస్వోలకు తాత్కాలిక లైసెన్సులు కూడా మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. హోం మంత్రిత్వశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వని పక్షంలో లైసెన్సు రద్దుచేయటానికి ఒప్పుకుంటామంటూ అఫిడవిట్ ఇచ్చే దరఖాస్తు దారులకు ఈ విధమైన తాత్కాలిక లైసెన్సులిస్తున్నారు. రిలయెన్స్ జియో సహా 20 మంది డిజిటల్ ఎమ్మెస్వోలకు ఇలా ఇప్పటివరకు తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేయగా ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు నిర్వహించుకోవటానికి శ్రీ సాయి వినాయక కేబుల్ నెట్ వర్క్ కు ఇదే ప్రాతిపదికన ఈ నెల 9 న లైసెన్స్ వచ్చింది.