• Home »
  • Uncategorized »
  • 3G/4G టెక్నాలజీతో న్యూస్ చానల్స్ రొమాన్స్

3G/4G టెక్నాలజీతో న్యూస్ చానల్స్ రొమాన్స్

3gTechnology

24 గంటల న్యూస్ చానల్స్ లో ప్రతి సెకనుకీ విలువ ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్, ఎక్స్ క్లూజివ్ న్యూస్ విషయంలో ఆ విలువ మరింత పెరుగుతుంది. మిగిలిన చానల్స్ తో పోటీ పడటంతో పాటు, తమ ఫీడ్‍ని కాపాడుకోవటం కూడా చానల్స్ కు సవాలుగా మారుతోంది.

ప్రత్యక్షప్రసారాలు అందించాలంటే ఇంతకు ముందు వరకూ అన్ని టీవీ చానల్స్ డిఎస్‌ఎన్‌జి, ఒబి వ్యాన్లపైనే ఆధారపడేవి.ఎన్ని ఎక్కువ లైవ్ వెహికిల్స్ ఉంటే ఆ చానెల్ అంత గొప్పదనే భావన ఇంతకు ముందు కనిపించేది. టీవీ 5 కన్నా ఎక్కువ త్వరగా న్యూస్ ఇచ్చి ప్రజలను ఆకట్టుకోవాలనుకున్న ఎన్‌టీవీ, ఎక్కువ డిఎస్‌ఎన్‌జి లు  కొనుగోలు చేసింది. పోటీ పెరగటంతో, మార్కెట్ లీడర్ టీవీ 9 అప్పటి వరకూ అద్దె వ్యాన్లను ఉపయోగించినా సొంత వెహికిల్స్ ఏర్పాటు చేసుకోక తప్పలేదు. ఆ తర్వాత వచ్చిన సాక్షి అన్నింటిని తలదన్నేలా పాతిక డిఎస్‌ఎన్‌జిలను రంగంలోకి దింపి హడావిడి చేసింది. ప్రతి జిల్లాకూ ఒక డిఎస్‌ఎన్‌జి కేటాయించటం వల్ల, సంఘటన జరిగిన వెంటనే స్పాట్‌కి వెళ్లి అక్కడినుంచే రిపోర్ట్ చేయవచ్చని, ఆ వార్తలకు అక్కడి ప్రజలే ప్రత్యక్ష సాక్షులుగా ఉంటారని చెప్పుకుంది.

అయితే కాలం మారింది. కాలంతో పాటు ప్రేక్షకుల ఆసక్తులు, తద్వారా టీవీ చానల్స్ అవసరాలు పెరిగాయి. బ్రేకింగ్ న్యూస్ అంటూ ‘టెక్స్ట్ ప్లేట్స్ లేదా గ్రాఫిక్స్’ ఇచ్చే చానల్ కన్నా, సంఘటన విజువల్స్ ను ముందుగా/లైవ్‌లో చూపించే చానల్‌ నే ఆ రోజుకి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీంతో సగటు ప్రేక్షకుడిని రోజూ ప్రసన్నం చేసుకోవటానికి, టీవీ చానల్స్ టెక్నాలజీ సాయం కోరుతున్నాయి. వాటిలో చాలా చానల్స్ ఇప్పటికే విజయం సాధించాయి కూడా.

ఒక మామూలు డిఎస్‌ఎన్‌జి వెహికిల్ ఏర్పాటు చేసుకోవటానికి ప్రతి చానెల్ కనీసం యాభై లక్షలు వెచ్చించాలి. దాంతో పాటు వెహికిల్ డ్రైవర్, టెక్నీషియన్, కెమెరామన్ వంటి సిబ్బంది, వారి జీతాలు అదనం. ఈ మెయింటెనెన్స్ ఖర్చు ఏడాదికి పది లక్షల దాకా అవుతుంది. ఖర్చు సంగతి పక్కన పెట్టినా, డిఎస్‌ఎన్‍జికి కొన్ని పరిమితులున్నాయి. వాటిలో ప్రధానమైనది.. మొబిలిటి. డిఎస్‌ఎన్‍జి నుంచి న్యూస్ పంపాలంటే.. వ్యాన్‌ను కదలకుండా పార్క్ చేసి, డిష్‌ను శాటిలైట్‌ వైపు తిప్పి అనుసంధానం చేసిన తర్వాత గానీ కెమెరా చిత్రించే దృశ్యాలు పంపించటం కుదరదు. కెమెరా కనెక్టింగ్ కేబుల్ ఎంత పొడవుంటే అంత వ్యాసార్ధంలో మాత్రమే షూట్ చేయటానికి సరిపోతుంది. అక్కడికి ఇంకొంచెం దూరంలో వెంటనే మరో లైవ్ ఇవ్వాలంటే మళ్లీ డిష్ మూసి, జాకీలు ఎత్తి బయల్దేరాలి. ఈ తతంగం గడిచేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది. అందుకే ఏదైనా ఊరేగింపు లాంటీవీ కవర్ చేయాలంటే ఒకటి కన్నా ఎక్కువ డిఎస్‍ఎన్‌జి/ఒబి వ్యాన్‌లను ఉపయోగించాల్సి వచ్చేది. కానీ 3G టెక్నాలజీ ఇండియాలోకి అడుగుపెడుతున్న సమయంలో టీవీ చానల్స్ కు కొత్త అవకాశం దొరికింది.

ఏదైనా ముఖ్య సంఘటన ఒక మారుమూల ప్రాంతంలో జరిగితే అక్కడికి డిఎస్‌ఎన్‍జి వెళ్లటం, అక్కడినుంచి లైవ్ ఇవ్వటం కష్టసాధ్యం. కెమెరామెన్ వెళ్లటమే కష్టమైన చోట లైవ్ కవరేజ్ ఏర్పాట్లు చేయటం బాగా ఇబ్బందితో కూడుకున్న పని. వైఎస్‍ఆర్ మరణ వార్తను ధృవీకరించుకోవటానికి కొండమీదకు వెళ్లినా  ఆ యాక్సిడెంట్ స్పాట్ విజువల్స్‌ను పంపటానికి పావురాల గుట్ట చుట్టూ డిఎస్‌ఎన్‌జిలు ఎన్ని ఉన్నా మీడియా చాలా కష్టపడింది. ఇకముందు మారుమూల ప్రాంతాల్లో అలాంటి సంఘటనలేవైనా జరిగితే, ఇప్పుడు సగం టీవీ చానల్స్  వాడుతున్న టెక్నాలజీ అక్కరకు వస్తుంది. అదే 3G బ్యాక్‌ప్యాక్.

సుమారు ఐదు కేజీల బరువుతో, కెమెరామన్ వీపున మోసుకుపోగలిగే సరంజామా.. 3G బ్యాక్‌ప్యాక్. 3G సపోర్ట్ ఉన్న మొబైల్ ఎక్విప్‌మెంట్ ఈ బ్యాక్‌ప్యాక్‌లో భాగం. కెమెరా అవుట్‌పుట్‌ను ఇది సర్వర్‌కు స్ట్రీమ్ చేస్తుంది. హెడ్ క్వార్టర్స్ లో ఉన్న వారు దానినే ప్రత్యక్షప్రసారానికి ఉపయోగించుకోవచ్చు. దానిని ఎప్పుడూ మోయాల్సి రావటం కెమెరామన్‍కు ఇబ్బంది అయినప్పటికీ, యాజమాన్యానికి పూర్తి సౌకర్యవంతంగా ఉండే ఈ బ్యాక్‍ప్యాక్ ఐదులక్షల రూపాయల లోపే అందుతుంది.. మన దగ్గర ఇప్పటికే వి 6, టీవీ5 , టీవీ 9 లాంటి చానల్స్ వీటిని ఉపయోగిస్తున్నాయి. జగన్ అరెస్టు తర్వాత సిబిఐ విచారణకు హాజరవటం,  చంచల్‌గూడకు తరలించటం వంటి సందర్భాల్లో పోలీస్ కాన్వాయ్‍ను ఫాలో అయిన మీడియా సిబ్బంది, ఆ దృశ్యాలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేయటం ఈ టెక్నాలజీ టీవీలకు ఎంతగా ఉపయోగపడుతోందో తెలియజేస్తుంది. అయితే ఈ 3G బ్యాక్‌ప్యాక్ వల్ల ఏమీ ఇబ్బందులూ ఉన్నాయి. ఒకటి.. డిఎస్‍ఎన్‌జి ఫీడ్ కంటే వీడియో నాణ్యత కొంచెం తక్కువ. అందుకు కారణం.. డేటా స్పీడ్ 650-900 kbps మించకపోవటం. మరొక కారణం, హైసెక్యూరిటీ జోన్‌లో ఏర్పాటు చేసిన జామర్ల వల్ల ఈ బ్యాక్‍ప్యాక్‍ల మొబైల్ సిగ్నల్ డిస్టర్బ్ కావటం. దీంతో సిఎం లేదా ఇతర జెడ్, జెడ్+ కేటగిరీ వ్యక్తుల కాన్వాయ్‌లను అనుసరించి లైవ్ ఇవ్వటం కుదరదు.

మే 15 న జరిగిన UEFA చాంపియన్‌షిప్ (యూరో కప్) లో ప్రయోగాత్మకంగా వాడిన 4G టెక్నాలజీ మెరుగైన వీడియో ఫుటేజ్‌ను అందించటంతో ప్రపంచంలోని  మీడియా దీనిపై ఆశలను పెంచుకుంటోంది. ఇప్పుడు మనకు 4G కూడా అందుబాటులోకి రానుండటంతో క్వాలిటీ కష్టాలు మాత్రం తగ్గే అవకాశం కనిపిస్తోంది.  ఇప్పటికే ఈ రంగంలో 3G నెట్‌వర్క్ సేవలందిస్తున్న TVU నెట్‌వర్క్స్, SeekFit Technology, AVIWest, Livestream, Liveu వంటి కంపెనీలు.. త్వరలో 4G ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అదే జరిగితే.. తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీ ప్రసారాలతో పాటు, సంఘటన జరగగానే ఆ దృశ్యాలను ప్రేక్షకులకు అందించటానికి, వారిని ఆకట్టుకోవటానికి 24గంటల న్యూస్ చానల్స్ కు ఒక అవకాశం సిద్ధమవుతున్నట్లే మరి.