• Home »
  • Cable »
  • మరో 32 డిజిటల్ ఎమ్మెస్వోలకు అనుమతి, తెలుగు రాష్ట్ర్రాలకు 8 లైసెన్సులు

మరో 32 డిజిటల్ ఎమ్మెస్వోలకు అనుమతి, తెలుగు రాష్ట్ర్రాలకు 8 లైసెన్సులు

దేశవ్యాప్తంగా మరో 32 మంది డిజిటల్ ఎమ్మెస్వోలకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ లైసెన్సులు మంజూరు చేసింది. దీంతో మొత్తం లైసెన్సుల సంఖ్య 727 కు చేరింది. వాటిలో 231 శాశ్వత లైసెన్సులు. తాజాగా జారీ చేసిన 32 లైసెన్సులలో రెండు తెలుగు రాష్ట్రాలకు 8 లైసెన్సులున్నాయి. తెలంగాణలో నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెస్వోలకు లైసెన్సులు రాగా ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎమ్మెస్వోలకు లైసెన్స్ వచ్చింది.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ విజయపురి నార్త్ కు చెందిన పరమేశ్వరి కేబుల్ నెట్ వర్క్స్  కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాలలో మూడు, నాలుగు దశలకు అనుమతి లభించింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలానికి చెందిన కె ఎస్ టివి కేబుల్ నెట్ వర్క్ కు ఆదిలాబాద్ జిల్లాకు గాను అనుమతి వచ్చింది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన భవానీ డిజిటల్ కు కరీంనగర్ జిల్లాకు లైసెన్స్ లభించింది.

ఆంధ్రప్రదేశ్ లో నరసరావుపేటకు చెందిన పాంచజన్య మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు, నాలుగు దశల డిజిటైజేషన్ కు అనుమతి లభింవింది. నెల్లూరు జిల్లా ఓజిలి మండలం కొత్త చెరువుకు చెందిన నిఖితా కేబుల్ నెట్ వర్క్ నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహించటానికి లైసెన్స్ మంజూరైంది.

విజయవాడ గవర్నర్ పేటకు చెందిన విజన్ డిజిటల్ కేబుల్ కు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో డిజిటైజేషన్ కు ఎంఐబి అనుమతించింది. శ్రీకాకుళానికి చెందిన శ్రీ సాయి స్పందన డిజిటల్ కమ్యూనికేషన్స్ సంస్థకు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 2,3,4 దశల డిజిటైజేషన్ కు అనుమతి రాగా మదనపల్లి కి చెందిన పెర్ల్ మిట్టాస్ నెట్ వర్క్ కు చిత్తూరు, అనంతపురం జిల్లాలకు అనుమతి లభించింది.