• Home »
  • Cable »
  • కేబుల్ టీవీ పరిశ్రమకు దిశానిర్దేశం చేసిన కేబుల్ నెట్ ఎక్స్ పో విజన్ -2016

కేబుల్ టీవీ పరిశ్రమకు దిశానిర్దేశం చేసిన కేబుల్ నెట్ ఎక్స్ పో విజన్ -2016

కేబుల్ రంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆధునిక ధోరణులను పరిచయం చేస్తూ ఆగస్టు 24 బుధవారం నుంచి 26 శుక్రవారం వరకు హైదరాబాద్‌ హైటెక్స్‌ లో  జరిగిన కేబుల్ నెట్ ఎక్స్‌ పో విజన్-2016 విజయవంతమైంది. ఏటా ఒక యజ్ఞంలా చేపట్టే ఈ ప్రదర్శనను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించటంలో సి ఎన్ సి గ్రూప్ అధిపతి రాము సఫలీకృతులయ్యారు. ఐదోవిడత జరిగిన ఈ  ఎక్స్ పో కు దేశం నలుమూలల నుంచి ఎగ్జిబిటర్లు, రెండు తెలుగు రాష్ట్రాలనుంచి కేబుల్ పరిశ్రమ ప్రతినిధులు తరలి వచ్చారు. అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలకు సరిపడే మౌలిక సదుపాయాలున్న హైటెక్స్ లో జాతీయ స్థాయి ప్రదర్శనలకు  దీటుగా నిర్వహించటం అందరి ప్రశంసలనందుకుంది.

దాదాపు నెలన్నరకు ముందునుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ విషయం కేబుల్ సమాచార్ తోబాటి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు. నిరుడు జరిగిన ప్రదర్శన కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడినా ఈసారి అలా జరగదని తెలియజెప్పటానికి పదే పదే గుర్తు చేస్తూ ప్రచారం కల్పించటంలో అటు నిర్వాహకుడు సి ఎన్ సి రాము ఒక వైపు, ఇటు తెలంగాణ ఎమ్మెస్వోలు, ఆపరేటర్ల సమాఖ్య అధ్యక్షుడు సుభాష్ రెడ్డి మరోవైపు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వచ్చారు.

కొద్ది రోజుల ముందు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రధాన స్పాన్సర్ గా చేరటం కూడా ఈ ప్రదర్శనకు మరింత ఊపునిచ్చింది. ప్రభుత్వ సంస్థ తన కార్యక్రమాన్ని ఈ వేదిక ద్వారా ప్రచారం చేసుకోవటానికి ముందుకు రావటం, ఐటి, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కూడా ఈ ప్రదర్శన ప్రారంభించటానికి అంగీకరించటం మరింత నిండుదనాన్ని తెచ్చింది. దీంతో కేబుల్ రంగ ప్రముఖులు ఈ పరిశ్రమకష్టాలు నేరుగా ఆయనతో చెప్పి ప్రభుత్వం నుంచి హామీ పొందాలని నిర్ణయించుకున్నారు.

ఈ ప్రదర్శనకు ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున తరలి రావాలని తెలంగాణ ఎమ్మెస్వోలు, ఆపరేటర్ల సమాఖ్య అధ్యక్షుడు ఎం. సుభాష్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రదర్శనకు రెండు రోజుల ముందు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో  ఆయన మీడియాతో మాట్లాడుతూ సి ఎన్ సి గ్రూప్ అధిపతి రాము నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనను మంత్రి తారకరామారావు 24 ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారని. ఢిల్లీ, ముంబై తరహాలో మూడు రోజులపాటు సాగే ఈ ప్రదర్శనలో దేశవిదేశాలకు చెందిన సాంకేతిక పరిజ్ఞానానికి అద్దం పట్టే పరికరాలు ప్రదర్శించటానికి వీలుగా 150 స్టాల్స్ సిద్ధమయ్యాయని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది సహా వేలాది మంది ఈ ప్రదర్శనకు తరలి వస్తారని ఆశభావం వ్యక్తం చేశారు. ప్రదర్శన పోస్టర్ ను కూడా విడుదల చేసిన ఈ సమావేశంలో ఎమ్మెస్వోలు మల్లేశ్, రాజేందర్, శ్యాంసుందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఆనందోత్సాహాల మధ్య 5వ కేబుల్ నెట్ ఎక్స్ పో ఆరంభం

సిఎన్ సి సంస్థ అధిపతి రాము ఆధ్వర్యంలో ఐదోవిడత జరుగుతున్న కేబుల్ నెట్ ఎక్స్ పో కు దేశం నలుమూలల నుంచి ఎగ్జిబిటర్లు, రెండు రాష్ట్రాలనుంచి కేబుల్ పరిశ్రమ ప్రతినిధులు తరలి వచ్చారు. జాతీయ స్థాయి ప్రదర్శనలకు దీటుగా హైటెక్స్ లో ఏర్పాటైన ఈ ప్రదర్శన సహజంగానే అందరినీ ఆకట్టుకుంది. ఉదయానికే స్టాల్స్ అన్నీ సిద్ధం కాగా నిర్వాహకుడు రాము ప్రతి స్టాల్ దగ్గరకూ వెళ్ళి స్టాల్ ఏర్పాటు చేసినవారికి పుష్ప గుచ్ఛాలిచ్చి ప్రదర్శనకు స్వాగతం పలికారు.

సాయంత్రం నాలుగు గంటలకు హైటెక్స్ లో ప్రదర్శన జరుగుతున్న ఆవరణకు చేరుకున్న కె టిఆర్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి అక్కడి స్టాల్స్ తిలకించారు. అక్కడినుంచి ప్రారంభోత్సవ సభా వేదికకు చేరుకుంటున్న సమయంలో పెద్ద ఎత్తున ఆయనతో సెల్ఫీలకోసం పోటీపడ్డారు. ఎవరినీ కాదనకుండా సెల్ఫీలకు  ఒప్పుకుంటూ ఆయన వేదికను చేరుకున్నారు.

తెలంగాణ ఎమ్మెస్వోలు, ఆపరేటర్ల సమాఖ్య అధ్యక్షుడు సుభాష్ రెడ్డి మంత్రిని, ప్రదర్శన నిర్వాహకుడు సి ఎన్ సి రామును వేదిక మీదికి ఆహ్వానించారు.   కేబుల్ రంగం ఎదుర్కుంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఫైబర్ గ్రిడ్ సేవలు కేబుల్ పరిశ్రమకూ అందేలా చూడాలని, బ్రాడ్ బాండ్ పంపిణీ బాధ్యతలు కేబుల్ రంగానికి అప్పగించటం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకునే అవకాశం కల్పించాలని కోరారు.  పోల్ టాక్స్, ఎంటర్టైన్మె ట్ టాక్స్ లాంటి అంశాలను కూడా ప్రస్తావిస్తూ తమ సమాఖ్య తరఫున వినతి పత్రం అందజేశారు. ఆ తరువాత కేబుల్ రంగానికి సంబంధించిన వివిధ సంఘాల ప్రతినిధులు కూడా మంత్రిని కలుసుకొని సమస్యలు విన్నవించారు.

కేబుల్ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండ: కెటిఆర్

కేబుల్ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని రాష్ట్ర ఐటి, పంచాయితీరాజ్ శాఖామంత్రి కె. తారక రామారావు హామీ ఇచ్చారు. పరిశ్రమ సమస్యల పరిష్కారం దిశలో కేబుల్ రంగానికి చెందిన ప్రతినిధి బృందంతో త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. హైటెక్స్ లో ఐదవ కేబుల్ నెట్ ఎక్స్ పో -2016 ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కేబుల్ రంగానికి తమ ప్రభుత్వం అనుకూలమంటూ స్పష్టమైన సంకేతాలిచ్చారు. తెలంగాణ సాధన ఉద్యమంలో కేబుల్ పరిశ్రమ పాత్రను మరువలేమన్నారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా దాదాపు కోటి ఇళ్ళకు తాగునీరు అందించే పథకంతీ ఫైబర్ గ్రిడ్ పథకాన్ని కూడా అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. భూగర్భ కేబుల్ కోసం మళ్ళీ తవ్వాలసిన అవసరం లేకుండా ఒకేసారి కేబుల్ పైప్ లైన్ కూడా వేయాలని ఆదేశించిన విషయం గుర్తుచేసారు. ఇప్పటికే మిషన్ భగీరథ కోసం కొంతమేర తవక్కలు జరపగా ఇకమీదట జరిపే తవ్వకాలలో కేబుల్ పైప్ లైన్ కూడా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. దీనివలన ప్రభుత్వ ధనం వందలకోట్లు ఆదా అవుతుందని, సురక్షితమైన భూగర్భ కేబుల్ ఏర్పాటవుతుందని చెప్పారు. ఆ విధంగా ఇంటింటికీ నల్లాల ద్వారా నీరందించటంతోబాటు  ఇంటింటికీ బ్రాడ్ బాండ్ సాయంతో కేబుల్ ఆపరేటర్ సహకారంతో ఇంటర్నెట్ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

ఇతర రాష్ట్రాల తరహాలో కేబుల్ వ్యాపారంలో ఉన్నవారి నోరు కొట్టటం తమ అభిమతం కాదంటూ పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న ట్రిపుల్ ప్లే విధానాన్ని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రాడ్ బాండ్ సేవలకు టీవీ ప్రసారాలు కూడా ముడిపెట్టి ఎమ్మెస్వోలను, ఆపరేటర్లనూ ఇరకాటంలో పెడుతూ ఆ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఆందోళన వ్యక్తమవుతున్నట్టు తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షుడు సుభాష్ రెడ్డి మంత్రి దృష్టికి తెస్తూ తెలంగాణ ప్రభుత్వం కేబుల్ పరిశ్రమను కాపాడాలని కోరారు.

కేబుల్ పరిశ్రమ సహకారంతోనే బ్రాడ్ బాండ్ పథకాన్ని అమలు చేస్తామని, వీలైనంత లాభం పొందేలా కేబుల్ ఆపరేటర్లను ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా కెటిఆర్ హామీ ఇచ్చారు. అదే సమయంలో ఏదైనా కారణం వల్ల ఏ మాత్రం నష్టం వచ్చే అవకాశమున్నా అలాంటి నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుంది తప్ప కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోల మీద పడకుండా చూస్తుందని కూడా చెప్పారు.

కేబుల్ రంగం నుంచి వస్తున్న విజ్ఞప్తులను సానుకూలంగా పరిష్కరించటానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పోల్ టాక్స్ రద్దు చేయాలన్న డిమాండ్ మీద స్పందిస్తూ , మరో ఏడాదిన్నరలో భూగర్భ కేబుల్ పూర్తవుతుంది కాబట్టి ఆ సమస్య ఉండబోదన్నారు. పన్నులు తదితర అంశాలమీద చర్చించటానికే కేబుల్ టీవీ పరిశ్రమలోని వివిధ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

సి ఎన్ సి ’రాము’ కు సత్కారం

కేబుల్ పరిశ్రమ శ్రేయోభిలాషిగా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తూ, దేశం నలుమూలలనుంచి నిపుణులను రప్పించి, పరిశ్రమ భాగస్వాములందరినీ ఆహ్వానించి, అందరూ ఒక చోట కలుసుకునే ఉమ్మడి వేదిక కల్పించి, అత్యంత ఘనంగా కేబుల్ ఎక్స్ పో నిర్వహించిన సి ఎన్ సి అధినేత రామును ఈ సందర్భంగా తెలంగాణ ఎమ్మెస్వోలు, ఆపరేటర్ల సమాఖ్య అధ్యక్షుడు సుభాష్ రెడ్డి మంత్రి చేతుల మీదుగా సత్కరింపజేశారు. రామును అభినందిస్తూ  మంత్రి శాలువా కప్పి  సత్కరించి మెమెంటో  అందజేశారు

’కేబుల్ టీవీ డిజిటైజేషన్’ పుస్తకావిష్కరణ

డిజిటైజేషన్ క్రమంలో కేబుల్ టీవీ పరిశ్రమ  అత్యంత కీలకమైన మలుపు తిరుగుతున్న సందర్భంగా ఈ ప్రక్రియకు సంబంధించిన  సమాచారాన్ని కేబుల్ సమాచార్ ఎప్పటికప్పుడు అందిస్తూ వస్తోంది.  అయితే ఆ సమాచారాన్నంతా ఒకచోట చేర్చి, ఈ రంగంలో ఉన్నవారందరూ సులభంగా చదువుకోవటానికి వీలుగా ఒక పుస్తక రూపంలో తీసుకు వచ్చే ప్రయత్నమే ’ కేబుల్ టీవీ డిజిటైజేషన్’ .

జర్నలిస్ట్ తోట భావనారాయణ రాసిన ఈ 304 పేజీల పుస్తకాన్ని  కేబుల్ నెట్ ఎక్స్ పో సందర్భంగా మంత్రి తారక

రామారావు ఆవిష్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాలనుంచి కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు, సాంకేతిక సిబ్బంది తరలి వచ్చిన సమయంలో ఈ ప్రదర్శన సందర్భంగా కేబుల్ సమాచార్ ద్వారా ప్రత్యేకంగా ఈ పుస్తకం అందుబాటులోకి వచ్చింది.

కేబుల్ టీవీ  పరిణామ క్రమం, డిజిటైజేషన్ చట్టం, అమలు తీరు తెన్నులు, ఎమ్మెస్వో లైసెన్స్ పొందే పద్ధతి, హెడ్ ఎండ్, సెట్ టాప్ బాక్స్, కాస్ లాంటి సాంకేతిక అంశాల వివరణ, పే చానల్స్ పేరుతో బ్రాడ్ కాస్టర్ల పెత్తనం, బ్రాడ్ కాస్టర్ తో ఎమ్మెస్వో ఒప్పందాలు, ఎమ్మెస్వోకూ, ఆపరేటర్ కూ మధ్య ఒప్పందాలు, వాటి నమూనాలు, చిన్న ఎమ్మెస్వోల సమస్యలు, డిటిహెచ్, హిట్స్ పనిచేసే విధానం, వాటితో పోటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ట్రిపుల్ ప్లే మీద విశ్లేషణ, డిజిటల్ కేబుల్ చందాదారుల హక్కులు సహా అనేక అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

కేబుల్ సమాచార్ గౌరవ సంపాదకులు, తెలంగాణ ఎమ్మెస్వోలు, ఆపరేటర్ల సమాఖ్య అధ్యక్షుడు సుభాష్ రెడ్డి, కేబుల్ నెట్ ఎక్స్ పో నిర్వాహకుడు సి ఎన్ సి రాము, కేబుల్ సమాచార్ అసిస్టెంట్ ఎడిటర్ కృష్ణారెడ్డి సమక్షంలో మంత్రి కె టి ఆర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రచయిత తోట భావనారాయణను శాలువతో సత్కరించి సమాఖ్య తరఫున మెమెంటో అందజేశారు.

ఆకట్టుకున్న స్టాల్స్

ఈ సారి ప్రదర్శనలో వైవిధ్య భరితమైన స్టాల్స్ ఏర్పాటయ్యాయి. అనేక సంస్థలు తమ సెట్ టాప్ బాక్స్ లను ప్రదర్శించాయి.  వాటి ఫీచర్స్ వివరిస్తూ ఎమ్మెస్వోలను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఆప్టిక్ ఫైబర్ సంస్థలు, స్టే వైర్ తయారీ సంస్థలు, స్ప్లైసింగ్ మెషన్ల అమ్మకం దారులు, ఒటిడిఅర్ మెషిన్ల సరఫరాదారులు, ఇంకా మరెన్నో కేబుల్ టీవీ పరికరాల తయారీదారులు పాల్గొని తమ ఉత్పత్తులు ప్రదర్శించారు.

బ్రైట్ వే కమ్యూనికేషన్స్

తెలంగాణ లో అతిపెద్ద  హెడ్ ఎండ్ గా పేరుతెచ్చుకున్న బ్రైట్ వే కమ్యూనికేషన్స్ సంస్థ ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసింది. ఎరిక్ సన్ లాంటి అంతర్జాతీయ సంస్థ వారి హెడ్ ఎండ్ ఏర్పాటు చేయటంతోబాటు మన్నికగల సెట్ టాప్ బాక్సులు అందిస్తున్న సంస్థ సేవలను పలు తయారీ సంస్థలు ప్రత్యేకంగా అభినందించాయి. అదే విధంగా తెలంగాణ నలుమూలలనుంచి వచ్చిన ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు బ్రైట్ వే స్టాల్ దగ్గరకు వచ్చి సుభాష్ రెడ్డి ని కలుసుకోవటం సంస్థ అందించే సేవల గురించి అడిగి తెలుసుకోవటం, ఫీడ్ అందుకోవటానికి విధి విధానాలు తెలుసుకోవటం కనిపించింది.

హెడ్ ఎండ్ మీద స్టార్ పెత్తనమా?

భీమవరం కమ్యూనికేషన్స్ నెట్ వర్క్ ( బిసిఎన్) కూడా ఒక స్టాల్ పెట్టింది. ఇటీవలే బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ( బెసిల్ ) అధికారులు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) సూచనలకు అనుగుణంగా తమ హెడ్ ఎండ్ ను తనిఖీ చేశారని చెబుతూ ఆ సందర్భంగా వారు తనిఖీ చేసిన విధానాన్ని సూచించే పత్రాలను మరికొందరు ఎమ్మెస్వోలకు అందజేశారు. తనిఖీకి ఎలా సిద్ధంగా ఉండాలో అందులో సూచించారు.

అయితే, ఆయన స్టార్ ను కూడా ఆహ్వానించి తనిఖీ చేయించుకోవటం మాత్రం పలువురి విమర్శలకు తావిచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బెసిల్ చేత తనిఖీ చేయించి ధ్రువపత్రం అందుకోవటాన్ని అర్థం చేసుకోగలమే తప్ప స్టార్ కు అలాంటి అవకాశం ఇవ్వటం కేవలం ఎమ్మెస్వో తనను తాను తక్కువ చేసుకోవటమనేది ఆ వర్గాల భావన. అలా బ్రాడ్ కాస్టర్లందరికీ అవకాశం ఇవ్వటం మొదలుపెడితే హెడ్ ఎండ్ మీద పెత్తనం వాళ్ళకు కట్టబెట్టినట్టేనని విమర్శిస్తున్నారు. ఇలాంటి సంప్రదాయానికి శ్రీకారం చుట్టటం దురదృష్టకరమన్నారు.

కేబుల్ సమాచార్

కేబుల్ టీవీ రంగానికి సమగ్ర సమాచారం అందించే కేబుల్ సమాచార్ మాస పత్రిక ఈ ఏడాది కూడా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆగస్టు తోబాటు పాత సంచికలను కూడా ప్రదర్శించటంతో పత్రిక అందుబాటులో లేని అనేకమంది ఈ పత్రికకు స్టాల్ దగ్గరే చందాలు కట్టటం కనిపించింది. కేవలం చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉండే కేబుల్ సమాచార్  కోసం ఆసక్తి కనబరచారు.  రెండేళ్ళు చందా కట్టిన వారికి “ కేబుల్ టీవీ డిజిటైజేషన్ “ పుస్తకం లేదా బ్యాగ్ ఉచితంగా ఇవ్వటం కూడా ఆసక్తికి కారణమైంది.

డిజిటైజేషన్ వేగంగా సాగుతున్న సమయంలో పూర్తి స్థాయి అవగాహన కలిగించటానికి ప్రత్యేకంగా ఒక పుస్తకం ప్రచురించినందుకు కేబుల్ సమాచార్ ను, దాని గౌరవ సంపాదకులు, వ్యవస్థాపకులు అయిన సుభాష్ రెడ్డిని అందరూ అభినందించారు.  జాతీయ స్థాయిలో ఇంగ్లీషు పత్రికలు కేబుల్ క్వెస్ట్, శాటిలైట్ అండ్ ఇంటర్నెట్ పత్రికలు కూడా స్టాల్స్ ఏర్పాటు చేయగా తెలుగులో వాటికి దీటుగా అందుబాటులోకి వచ్చిన ఏకైక పత్రిక కేబుల్ సమాచార్ తన స్టాల్ తో అందరినీ ఆకట్టుకుంది.

ముగింపు కార్యక్రమం

మూడు రోజులపాటు సాగిన కేబుల్ నెట్ ఎక్స్ పో -2016 ఆగస్టు 26 న ముగిసింది. ఈ రంగానికి చెందిన పలువురు ప్రముఖులను సి ఎన్ సి గ్రూప్ అధినేత రాము ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎమ్మెస్వోలు, ఆపరేటర్ల సమాఖ్య అధ్యక్షుడు సుభాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇంత భారీ కార్యక్రమాన్ని నిర్వహించిన రామును పొగడ్తలలో ముంచెత్తారు. పెద్ద పెద్ద సంస్థలు మాత్రమే చేపట్టగలిగే ఇలాంటి ప్రదర్శనను కేవలం ఒక వ్యక్తిగా చేపట్టి మొత్తం కార్యక్రమాన్ని తన భుజాలమీద వెసుకొని నడిపించారంటూ అభినందించారు. తనలాంటి వారు కేవలం నైతిక మద్దతునిచ్చి తోడ్పాటు మాత్రమే అందించామని, అందుకే ఈ ఘనత మొత్తం రాము కే దక్కాలన్నారు.

కేబుల్ రంగం మరో ఐదు నెలల్లో పూర్తిగా మారిపోతుండగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ సంస్థను స్పాన్సర్ గా ఆహ్వానించటంతోబాటు మంత్రి కెటిఆర్ ను ఈ ప్రదర్శన ప్రారంభోత్సవానికి ఆహ్వానించి ఆయన చేత కేబుల్ పరిశ్రమకు వరాలు ప్రకటింపజేయటంలోనూ రాము ప్రత్యేకత చాటుకున్నారన్నారు. 24 ఫైబర్ కేబుల్ లో కొన్ని లీడ్స్ కేబుల్ ప్రసారాల కోసం కేటాయిస్తామని చెప్పటం, బ్రాడ్ బాండ్ వ్యాపారం కేబుల్ ఆపరేటర్ల ద్వారా చేపడతామని చెప్పటం చాలా గొప్ప వరాలని, ఈ వేదిక వల్లనే అలాంటి ప్రకటనలు సాధ్యమయ్యాయని సుభాష్ రెడ్డి అభివర్ణించారు.

ప్రదర్శనకు ముందునుంచీ ప్రాచుర్యం కల్పించటంలోనూ, మూడు రోజుల ప్రదర్శనకు హాజరుకాలేని వారికిసైతం ఇక్కడి విశేషాలు అందించటంలోను విశేషంగా సహకరించిన మీడియాకు రాము, సుభాష్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

డిజిటైజేషన్ కీలక దశలో ఉండగా జరిగిన ఈ ప్రదర్శన ద్వారా అందుకున్న విజ్ఞానాన్ని మోసుకుంటూ రెండు రాష్ట్రాలనుంచి వచ్చిన కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు, పరిశ్రమ సిబ్బంది, సాంకేతికనిపుణులు తిరుగుముఖం పట్టారు. హైటెక్స్ ను కళకళలాడించిన మూడు రోజుల కేబుల్ పండుగ ముగిసి మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామా అనే ఆతృత మిగిల్చింది.