• Home »
  • News »
  • ఆనంద్ బజార్ పత్రిక గ్రూప్ ఆధ్వర్యంలో గుజరాతీ న్యూస్ చానల్ ”అస్మిత”

ఆనంద్ బజార్ పత్రిక గ్రూప్ ఆధ్వర్యంలో గుజరాతీ న్యూస్ చానల్ ”అస్మిత”

ఎబిపి న్యూస్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో గుజరాతీ న్యూస్ చానల్ ఎబిపి అస్మిత ప్రారంభమైంది. వార్త మాది, ప్రగతి మీది అనే నినాదంతో ప్రారంభమైన ఈ చానల్ లో వార్తలతోబాటు వార్తాసంబంధమైన కార్యక్రమాలు ప్రసారమవుతాయని గ్రూప్ ఎడిటర్ షాజీ జమాన్ ప్రకటించారు. తమ హిందీ, బంగ్లా, మరాఠీ చానల్స్ తరహాలోనే నాణ్యతతోబాటు తటస్థ వైఖరిని చాటుకుంటూ ముందుకు సాగుతామన్నారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అహమ్మదాబాద్ లో తీర్చిదిద్దిన స్టుడియోలో రోబోటిక్ కెమెరాలు ఏర్పాటు చేయటం గుజరాత్ లో ఇదే ప్రథమని కూడా గుర్తుచేశారు.గాంధీనగర్, రాజ్ కోట, సూరత్మ్ వడోదర లాంటి ముఖ్యమైన నగరాలన్నిటిలోనూ న్యూస్ బ్యూరోలు ఏర్పాటయ్యాయని, లైవ్ యు టెక్నాలజీతో ప్రత్యక్షప్రసారాలకు సిద్ధమయ్యామని చెప్పారు.

ఎబిపి నెట్ వర్క్ లో ఎబిపి న్యూస్ ( హిందీ ) ఎబిపి ఆనందా ( బెంగాలీ ), ఎబిపి మజా ( మరాఠీ) ఉన్నాయి. ఆనంద్ బజార్ పత్రిక గ్రూప్ లో ఎబిపి న్యూస్ నెట్ వర్క్ ఒక భాగం కాగా ఈ గ్రూప్ లో డజన్ పత్రికలు ప్రచురితమవుతున్నాయి. వాటిలో బెంగాలీ దినపత్రిక ఆనంద బజార్ పత్రిక, ఇంగ్లీష్ దిన పత్రిక ది టెలిగ్రాఫ్ ఉన్నాయి. 1922 లో కోల్ కతాలో ప్రారంభమై  స్వాతంత్ర సమరంలో ఆనంద్ బజార్ పత్రిక విశేష సేవలందించిన విషయ తెలిసిందే.