• Home »
  • Advertisement Code »
  • “పొగతాగే దృశ్యాల్లో నటించినవారే వ్యతిరేక ప్రచారంలో ఉచితంగా పాల్గొనాలి”

“పొగతాగే దృశ్యాల్లో నటించినవారే వ్యతిరేక ప్రచారంలో ఉచితంగా పాల్గొనాలి”

సినిమాల సెన్సార్ సర్టిఫికేషన్ మీద సిఫార్సులతో నివేదిక ఇచ్చిన శ్యామ్ బెనగల్ కమిటీ సినిమాలలో పొగతాగే దృశ్యాలు, జంతుహింస విషయంలో తాజాగా మరికొన్ని సిఫార్సులు చేసింది. సినిమా ఆరంభంలో తెరమీద స్థిరంగా తమ విధానాన్ని తెలియజేస్తూ దాని నేపథ్యంలో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. దానికి సైతం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నుంచి అనుమతి తీసుకోవాలని పేర్కొంది. అన్ని భారతీయ భాషలలో ఆ విధానాన్ని అందించాలని, అన్ని రకాల మీడియా వేదికలకూ అనువుగా ఆ ప్రకటన ఉండాలని కూడా స్పష్టం చేసింది.

దీన్ని దృష్టిలో ఉంచుకొని అలాంటి దృశ్యాలు పదే పదే రాకుండా చూసుకోవటం, ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవటం కూడా ముఖ్యమని పేర్కొంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఆ చిత్ర నిర్మాతలు అదే నటీనటులతో పొగతాగటానికి వ్యతిరేకంగా సందేశాత్మకంగా ఒక చిన్న ప్రచార ప్రకటన తయారుచేయవచ్చునని కమిటీ సిఫార్సు చేసింది. చిత్ర పరిశ్రమ బాగా పేరుమొసిన నటీనటులతో ధూమపాన వ్యతిరేక ప్రచార ప్రకటనలు రూపొందించాలని, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆమోదం పొందిన మీదట  వాటిని సినిమా థియేటర్లతోబాటు టీవీ చానల్స్ లో ప్రసారం చేయాలని కోరింది.

సినిమాలలో జంతువులను చూపించాల్సి వచ్చినప్పుడు లైసెన్స్ పొందిన సప్లయర్ దగ్గర నుంచి మాత్రమే వాటిని తీసుకోవాలనే నిబంధన విధిస్తే వాటి జాగ్రత్తలు, ఆరోగ్యం పట్ల అతడికి అవగాహన ఉంటుందని సూచించారు. అది నిర్మాతలకు సైతం సౌలభ్యంగా ఉంటుందని కమిటీ అభిప్రాయపడింది. ఇది అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానమేనని పేర్కొంది. ఈ లోగా నిర్మాతల సౌలభ్యాన్ని కూదా దృష్టిలో పెట్టుకొని లైసెన్స్ పొందిన వ్యక్తుల జాబితాతో డైరెక్టరీ ముద్రించాలని కమిటీ సూచించింది. అదే విధంగా ఒక పశువైద్యుడు కూడా షూటింగ్ జరిగేచోట అందుబాటులో ఉండేట్టు చూడాల్సిన బాధ్యత నిర్మాత మీదనే పెట్టవచ్చునన్నారు.