• Home »
  • Advertisement Code »
  • ప్రకటనల పరిమితి కేసు మళ్ళీ వాయిదా : త్వరగా విచారించాలన్న హోమ్ కేబుల్

ప్రకటనల పరిమితి కేసు మళ్ళీ వాయిదా : త్వరగా విచారించాలన్న హోమ్ కేబుల్

ప్రకటనల పరిమితి కేసు మళ్ళీ వాయిదా పడింది. వచ్చే నెల (మార్చి) 29 న విచారిస్తామని ఢిల్లీ హైకోర్టు వెల్లడించించి. ఇతర కేసుల రద్దీ కారణంగా వాయిదా వేస్తున్నట్టు కోర్టు పేర్కొంది. గతంలో కూడా అనేక సార్లు వాయిదా పడినప్పటికీ గడిచిన నవంబర్ 27 న ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు స్వయంగా ప్రధానన్యాయమూర్తి జస్టిస్ జి. రోహిణి ఈ కేసును వచ్చే విచారణలో ముగిస్తామని చెప్పారు. అందుకే ఈ సారి వాయిదా పడటానికి ప్రాధాన్యం పెరిగింది. డిస్కవరీ కమ్యూనికేషన్స్ సంస్థ ఈ కేసులో తననూ చేర్చాలంటూ కోరింది.

గత నవంబర్ లో ఈ కేసు విచారణ సందర్భంగా మొదటిసారిగా హాజరైన సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాము న్యూస్ బ్రాడ్ కాస్టర్ల సంఘంతో చర్చలు జరుపుతున్నామని కోర్టుకు తెలియజేసింది. ఈ కేసు విచారణ వేగంగా జరపాలని హోమ్ కేబుల్ నెట్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫు న్యాయవాది వివేక్ శరిన్ కోరగా అ మేరకు లిఖితపూర్వకంగా నివేదిస్తూ ఎందుకు వేగంగా విచారించాలో తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. ఆ మీదట పరిశీలిస్తామని చెప్పింది. మరోవైపు డిస్కవరీ కమ్యూనికేషన్స్ కూడా ఈ కేసులో ఇంప్లీడ్ కావాలని నిర్ణయించుకుంది. ఆ మేరకు కోర్టుకు తెలియజేయగా, వచ్చే విచారణలో పరిశీలిస్తామని చెప్పింది.

హోమ్ కేబుల్ అభ్యర్థనను జనవరి 5 న ఢిల్లీ హైకోర్టు ఆమోదించింది. పే చానల్స్ ఒక వైపు చందాలు వసూలు చేస్తూ మరోవైపు  ప్రకటనలు ప్రసారం చేయటాన్ని ఎలా ఆమోదిస్తారంటూ హోమ్ కేబుల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్రాడ్ కాస్టర్లు కేబుల్ టీవీ చట్టంలో పేర్కొన్న విధంగా 10+2 ప్రకటనల నిబంధన పాటిస్తామని ఇంకా హామీ ఇవ్వలేదని కూడా పేర్కొంది.

ట్రాయ్ మీద, కేంద్ర ప్రభుత్వం మీద 9x మీడియా, న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్.దాఖలు చేసిన కేసు పదేపదే వాయిదాలు పడుతూ వస్తోంది. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నందున మరికొంత సమయం కావాలంటూ న్యూస్ బ్రాడ్ కాస్టర్లు చేసిన విజ్ఞప్తి మేరకు హైకోర్టు వాయిదాలు వేస్తూ వచ్చింది. ఈ లోపు చానల్స్ మీద ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని ట్రాయ్ ని హైకోర్టు ఆదేశించటం, ఎన్ని నిమిషాలు ప్రకటనలు ప్రసారం చేసిందీ నమోదు చేసి ట్రాయ్ కి తెలియజేయాలని బ్రాడ్ కాస్టర్లనూ ఆదేశించటం తెలిసిందే.

న్యూస్స్ బ్రాడ్ కాస్టర్లకు తోడుగా సార్థక్ ఎంటర్టైన్మెంట్, పయొనీర్ చానల్ ఫాక్టరీ, ఇ24 గ్లామర్, సన్ టీవీ నెట్ వర్క్, టీవీ విజన్, బి4యు బ్రాడ్ బాండ్, 9x మీడియా, కలైంజ్ఞర్, సెలెబ్రిటీస్ మేనేజ్ మెంట్, ఈనాడు టెలివిజన్, మా టీవీ, రాజ్ టెలివిజన్ కూడా ఢిల్లీ హైకోర్టులో ట్రాయ్ ఆదేశాలను సవాలు చేశాయి. ట్రాయ్ మాత్రం తాను కొత్తగా నిబంధనలు తయారుచేయలేదని, కేబుల్ టీవీ చట్టంలో ఉన్న నిబంధనలను మాత్రమే అమలు చేస్తున్నామని చెప్పుకుంటోంది.