• Home »
  • Advertisement Code »
  • ప్రకటనల పరిమితి కేసు సెప్టెంబర్ 29 కి వాయిదా

ప్రకటనల పరిమితి కేసు సెప్టెంబర్ 29 కి వాయిదా

టీవీ చానల్స్ లో ప్రకటనల మీద పరిమితి అమలు చేయాలన్న ట్రాయ్ ప్రతిపాదనకు ఇప్పట్లో మోక్షం కనబడేట్టు లేదు. ఒకవైపు చానల్స్ స్టే తెచ్చుకొని అపరిమితంగా ప్రకటనలు ప్రసారం చేస్తూనే ఉన్నాయి.  ఈ కేసు విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు విచారణను మళ్ళీ సెప్టెంబర్ 29 కి వాయిదా వేసింది. అంతకుముందు మే 13 న కేసు విచారణకు రాగా చీఫ్ జస్టిస్ జి. రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్ ఈ పాక్షికంగా విచారణ జరిపిన కేసు వినటానికి సమయం లేకపోవటంతో వాయిదా వేశారు.

ఈ సారి కేసు విచారణకు వచ్చినప్పుడు హోమ్ కేబుల్ నెట్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ వేసిన జోక్యం పిటిషన్ కూడా విచారణకు వస్తుంది.  ప్రకటనల పరిమితి ఉల్లంఘించి గంటకు 12 నిమిషాలకంటే ఎక్కువ సేపు ప్రకటనలు ప్రసారం చేస్తున్న పే చానల్స్ కు ఇచ్చిన స్టే  ఎత్తివేయాలని హోమ్ కేబుల్ తన పిటిషన్ లో కోరింది. మార్చి 29 న  కేసు విచారణకు వచ్చినప్పుడు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తరఫున హాజరైన న్యాయవాది ప్రభుత్వమే ఈ నిబంధనను తగిన విధంగా మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలియజేశారు.

పే చానల్స్ కు స్టే ఇవ్వటం తగదంటూ హోమ్ కేబుల్ నెట్ వర్క్ దాఖలు చేసిన పిటిషన్ లో స్టే ఎత్తివేయాలని కోరింది. ఒకవైపు ప్రేక్షకుల నుంచి చందాలు వసూలు చేసుకుంటూ మరోవైపు ప్రకటనల ద్వారా ఆదాయం పొందటానికి అపరిమితంగా ప్రకటనలు ప్రసారం చేయటం తగదని పిటిషనర్ వాదిస్తున్నారు. పరిమితి పాటించవలసిన అవసరం లేదంటున్న చానల్స్ కు అవకాశం కల్పిస్తూ స్టే ఇవ్వటం వలన  ప్రేక్షకులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ పిటిషనర్ వాదించారు. దీనిమీద నాలుగు వారాల్లోగా  నోటీసుకు  సమాధానమివ్వాలంటూ మంత్రిత్వశాఖను కోర్టు ఆదేశించింది.

కేబుల్ టీవీ చట్టం ప్రకారం టీవీ చానల్స్ గంటకు 10 నిమిషాల వాణిజ్య ప్రకటనలు, 2 నిమిషాలపాటు ప్రచార ప్రకటనలు ప్రసారం చేసుకునేందుకు మాత్రమే అనుమతి ఉంది. అయితే, ఈ నిబంధనలు చాలా చానల్స్ పట్టించుకోవటం లేదు. ఈ పరిస్థితుల్లో ట్రాయ్ ఆ నిబంధనను గట్టిగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. అందుకు అనుగుణంగా ఆదేసాలు జారీచేయగా అలాంటి నిబంధనలు విధించే  అధికారం ట్రాయ్ కి లేదంటూ కొన్ని చానల్స్ వాదించాయి.  అయితే, ఇది ట్రాయ్ స్వయంగా రూపొందించిన నిబంధన కాదని, కేబుల్ టీవీ చట్టంలో ఉన్నదానినే అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నదని వివరణ ఇచ్చింది. అయితే కొన్ని చానల్స్ కోర్టుకెళ్ళి ప్రకటనల పరిమితి అమలు మీద స్టే తెచ్చుకున్నాయి.

స్టార్ ఇండియా, డిస్కవరీ నెట్ వర్క్స్ ఏషియా పసిఫిక్ లైసెన్సులు రద్దు చేయాలని పిటిషనర్ హోమ్ కేబుల్ నెట్ వర్క్ ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తిచేశారు. అప్ లింకింగ్ మార్గదర్శకాలలోని 5.2  క్లాజు ప్రకారం, డౌన్ లింకింగ్ మార్గదర్శకాలలోని 5.1 క్లాజు ప్రకారం ఈ చానల్స్ తమ లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘించినందున వాటి లైసెన్సుల రద్దుకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఈ చానల్స్ నిబంధనలకు కట్టుబడి ఉంటామంటూ అఫిడవిట్ కూడా దాఖలు చేశాయని, ఇప్పుడు ఉల్లంఘించినందువల్ల ఆ అఫిడవిట్ ఆధారంగా చర్యలు తీసుకోవచ్చునంటూ విజ్ఞప్తి చేసింది. పైగా,  ఈ గ్రూప్ చానల్స్ విదేశాలలో ప్రకటనల పరిమితి నిబంధనను పాటిస్తూ భారతదేశంలో మాత్రమే ఉల్లంఘించటం దారుణమని హోమ్ కేబుల్ వాదించింది.

అదే విధంగా మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్న  ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్ ద్వారా పే చానల్స్ అన్నిటిలో ప్రసరమవుతున్న ప్రకటనల వివరాలు సేకరించి అదనంగా ప్రసారమవుతున్న ప్రకటనల వివరాలను కూడా  నెలవారీగా ప్రభుత్వం దృష్టికి తెచ్చే అవకాశాలు పెంచుకోవాలని కోరింది .  పే చానల్స్ తాము నిబంధనలను ఉల్లంఘిస్తున్నామని ఒప్పుకుంటూ వారం వారం ప్రకటనల ప్రసార వివరాలను ట్రాయ్ కి తెలియజేస్తూనే ఉన్నాయి.

ఈ విషయంలో మంత్రిత్వశాఖకు అనేకమార్లు వినతిపత్రాలు అందించినప్పటికీ ఎలాంటి స్పందనా కనబడలేదని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. అయితే, ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ చానల్స్ కు ప్రాతినిధ్యం వహించే ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ మాత్రం తమ సభ్యులు ప్రకటనలపరిమితికి కట్టుబడి ఉంటారని పేర్కొంటూ పిటిషన్ ను ఉపసంహరించుకోవటం విశేషం. మరోవైపు  న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ మాత్రం ఎక్కువ న్యూస్ చానల్స్ పే చానల్స్ కాదుగాబట్టి నష్టాలు భర్తీ చేసుకోవటానికి వీలుగా ప్రకటనలమీద పరిమితి విధించరాదంటూ కోర్టుకెక్కాయి.

మరికొన్ని ప్రాంతీయ చానల్స్ తమ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఆదాయం సమకూర్చుకోవటానికి వీలుగా ఆంక్షలు లేకుండా చూదాలని కోరాయి. అన్ని ఎంటర్టైన్మెంట్ చానల్స్ నూ ఒకే విధంగా చూడకూడదని, ఎంటర్టైన్మెంట్ చానల్స్ కు వచ్చినట్టు తమకు ఆదాయం రాదని మ్యూజిక్ చానల్స్ కోర్టుకు తెలియజేశాయి. ఈలోగా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోబోతున్నామంటూ కోర్టుకు చెప్పటంతో ప్రధాన పిటిషన్ వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ లోపు తమ పిటిషన్ మీద విచారణ జరపలని హోమ్ కేబుల్ పదే పదే కోర్టుకు విన్నవిస్తూ వస్తోంది. ముందుగా స్టే తొలగించాలని, కేసు తేలేదాకా 12 నిమిషాల పరిమితి పాటించేట్టు చూడాలని వాదిస్తూ వచ్చింది.

నిజానికి ఈ పిటిషన్ మే 19 నాడే విచారణకు వచ్చినప్పటికీ అప్పటికే  ప్రకటనల పరిమితి కేసు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి సారధ్యంలోని ధర్మాసనం విచారిస్తున్నందున అక్కడికే బదలీ చేయాలని నిర్ణయించారు.  విచారణ చేపట్టిన న్యాయమూర్తులు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు నోటీసు జారీచేస్తూ నాలుగువారాల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించారు. అయితే ప్రతివాదులుగా  పిటిషనర్ పేర్కొన్నప్పటికీ స్టార్ ఇండియాకు గాని, డిస్కవరీ కమ్యూనికేషన్స్ కు గాని నోటీసులు జారీకాలేదు.