• Home »
  • BARC »
  • ప్రకటనల పరిమితి కేసు 23కు: ప్రభుత్వ విధానం చెప్పాలంటున్న న్యూస్ చానల్స్

ప్రకటనల పరిమితి కేసు 23కు: ప్రభుత్వ విధానం చెప్పాలంటున్న న్యూస్ చానల్స్

టీవీ చానల్స్ లో గంటకు 12 నిమిషాలకు మించి ప్రకటనలు ప్రసారం చేయకూడదన్న నిబంధనమీద విచారణ జరుపుతున్న ఢిల్లీ హైకోర్టు ఈ కేసును మరో మారు వాయిదా వేసింది. సమాచార, ప్రసార శాఖామంత్రి అరుణ జైట్లీ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ టీవీ చానల్స్ లో ప్రకటనల వ్యవధి మీద పరిమితి ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించటాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వ వైఖరి స్పష్టంగా తెలియజేయాలని న్యూస్ బ్రాడ్ కాస్టర్ల సంఘం కోరటంతో కోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 23 కు వాయిదావేసింది.

నిజానికి కేబుల్ టీవీ చట్టం ప్రకారం టీవీ చానల్స్ గంటకు 10 నిమిషాల వాణిజ్య ప్రకటనలు, 2 నిమిషాల ప్రచార ప్రకటనలు మించి ప్రసారం చేయటానికి వీల్లేదు. అదే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని ట్రాయ్ ప్రయత్నించగా టీవీ చానల్స్ ప్రతిఘటిస్తున్నాయి. అనేక ఎంటర్టైన్మెంట్ చానల్స్ కోర్టునాశ్రయించాయి. ప్రాంతీయ చానల్స్ తమ ప్రకటనల ఆదాయం తక్కువని వాదిస్తుండగా నిర్మాణ వ్యయాలు పెరిగాయని జాతీయ స్థాయి ఎంటర్టైన్మెంట్ చానల్స్ వాదిస్తున్నాయి. డిజిటైజేషన్ పూర్తయ్యేదాకా నిబంధన అమలు చేయవద్దని కూడా కోరుతున్నాయి.

మరో వైపు న్యూస్ చానల్స్ అధికశాతం ఉచిత చానల్స్ కాబట్టి మరో ఆదాయ వనరు లేనందున ప్రకటనలమీద పరిమితి తగదని అంటున్నాయి. పైగా ట్రాయ్ కి అసలు వాణిజ్య ప్రకటనల మీద పరిమితి పెట్టే అధికారమే లేదంటూ సవాలు చేశాయి. ఈ ఏడాది జనవరిలో సమాచార, ప్రసారాల శాఖామంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా ప్రకటనలమీద పరిమితి అనవసరమని వాదించటం న్యూస్ చానల్స్ కు మరింత అండగా తయారైంది. అది ప్రభుత్వ వైఖరిగా వెల్లడిస్తే తమకు అండగా ఉంటుందని న్యూస్ చానల్స్ భావిస్తున్నాయి.

నిజానికి కోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉండగా ఏ చానల్స్ మీదా వత్తిడి తీసుకురావద్దని కోర్టు ట్రాయ్ కి సూచించటంతో ప్రస్తుతానికి ట్రాయ్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అయితే, అదే సమయంలో చానల్స్ తాము ప్రసారం చేస్తున్న ప్రకటనల వ్యవధిని ఎప్పటికప్పుడు ట్రాయ్ కి తెలియజేయాలన్న నిబంధన కూడా విధించింది. ఇటీవలే ట్రాయ్ విడుదల చేసిన సమాచారం ప్రకారం 36 న్యూస్ చానల్స్, 105 జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ గంటకు 12 నిమిషాలకు మించి ప్రకటనలు ప్రసారం చేయటం ద్వారా పరిమితిని ఉల్లంఘించాయి.