• Home »
  • Entertainment »
  • ప్రకటనల పరిమితి కేసు ఆగస్టు 1కి వాయిదా

ప్రకటనల పరిమితి కేసు ఆగస్టు 1కి వాయిదా

టీవీ చానల్స్ లో ప్రసారమయ్యే ప్రకటనలమీద పరిమితి అమలుచేయాలన్న ట్రాయ్ నిబంధన అమలు ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశాలేవీ కనబడటం లేదు. మళ్లీ ఇంకోసారి వాయిదా పడింది. ఈ సారి ఢిల్లీ హైకోర్టు ఈ కేసును ఆగస్టు 1 కి వాయిదా వేసింది. ఇతర అర్జెంట్ కేసులెన్నో ఉన్న కారణంగా ఈ కేసును వాయిదా వేస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టు  ప్రధానన్యాయమూర్తి జి. రోహిణి, న్యాయమూర్తి జయంత్ నాథ్ ప్రకటించారు. వచ్చే వాయిదా సమయంలో కేసు విచారణ చేపట్టినప్పుడు ఈ కేసులో మధ్యలో చేరిన హోమ్ సిటీ కేబుల్ నెట్ వర్క్ దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ జరుగుతుందని తెలుస్తోంది. ప్రకటనల పరిమితిని మీరిన చానల్స్ కి ఇచ్చిన స్టే తొలగించాలని కోరుతోంది.

టీవీ చానల్స్ లో గంటకు 10 నిమిషాల వాణిజ్యప్రకటనలు, 2 నిమిషాల సొంత కార్యక్రమాల ప్రచార ప్రకటనలు మించకూడదని కేబుల్ టీవీ చట్టంలో ఉండగా ఆ నిబంధనను అమలు చేయాలని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) నిర్ణయించింది. అయితే, చాలా చానల్స్ ఈ నిబంధనను వ్యతిరేకించాయి. ట్రాయ్ కి ఆ అధికారం లేదంటూ వాదించాయి. అయితే, ఈ నిబంధన తాను రూపొందించింది కాదని, కేబుల్ టీవీ చట్టంలో ఉన్నదేనని ట్రాయ్ వాదించింది. ఏమైనప్పటికీ కొన్ని చానల్స్ ఈ నిబంధనను అమలు చేయటానికి ఒప్పుకున్నప్పటికీ కొన్ని చానల్స్ మాత్రం కోర్టుకు వెళ్ళి దీన్ని సవాలు చేశాయి.

చానల్స్ కార్యక్రమాల రూపకల్పనకయ్యే ఖర్చులు బాగా పెరిగిపోవటం వలన ప్రకటమ్నల ఆదాయానికి గండికొట్టటం సరికాదన్నది కోర్టుకెక్కిన కొన్ని చానల్స్ వాదన. మరికొన్ని ప్రాంతీయ చానల్స్ కూడా కోర్టుకెళ్ళి జాతీయ స్థాయి చానల్స్ తో తమను పోల్చవద్దని, ప్రత్యేకంగా పరిగణించాలని విన్నవించాయి. ఎంటర్టైన్మెంట్ చానల్స్ అన్నిటినీ ఒకే గాటన కట్టటం సమంజసం కాదని, మ్యూజిక్ చానల్స్ వంటివాటిని విడిగా చూడాలని కోరాయి.  ఇక న్యూస్ చానల్స్ ది మరోవాదన. ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో ఎక్కువభాగం పే చానల్స్ కాబట్టి వాటికి ప్రకటనల ఆదాయంతోబాటు చందా ఆదాయం ఉండటం వలన నష్టాలొచ్చే ప్రసక్తి ఉందదని, న్యూస్ చానల్స్ అందుకు భిన్నమని, తమకు ఎలాంటి పరిమితులూ లేనప్పుడే ఖర్చుల్లో కొంతయినా రాబట్టుకోగలుగుతామని న్యూస్ చానల్స్ కోర్టును కోరాయి.

మరోవైపు న్యూస్ చానల్స్ ఈ విషయంలో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖతో సంప్రదింపులు ప్రారంభించాయి. న్యూస్ చానల్స్ కు మినహాయింపు ఇవ్వాలంటూ న్యూస్ బ్రాడ్ క్లాస్టర్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. ఒక దశలో కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి అరుణ్ జైట్లీ కూడా ఈ పరిమితి విధించాల్సిన అవసరం లేదని వ్యక్తిగతహోదాలోనైనా వ్యాఖ్యానించటంతో ఇది మరో మలుపు తిరిగింది. న్యూస్ చానల్స్ మాత్రం ఆయన మాట మీదనే ఆధారపడుతూ ఈ కేసు విచారణ సందర్భంగా మంత్రిత్వశాఖ అధికారులు కూడా పదే పదే సమయం తీసుకుంటూ పాలసీ నిర్ణయం తీసుకొబోతున్నట్టు చెప్పటం గమనార్హం.

అయితే, ఈ వివాదం కోర్టుకెక్కిన తరువాత కోర్టు స్టే ఇవ్వటంతో చాలా చానల్స్ ఆ అవకాశాన్ని ఉపయోగించు కుంటూ పరిమితి మించి ప్రకటనలు ప్రసారం చేస్తూనే ఉన్నాయి. పే చానల్స్ ఒకవైపు ప్రజలనుంచి చందాలు వసూలు చేస్తూనే మరోవైపు అపరిమితంగా ప్రకటనలు కూడా ప్రసారం చేయటాన్ని హోమ్ కేబుల్ సంస్థ మరో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు చానల్స్ కు అనుకూలంగా ఇచ్చిన స్టే ను రద్దు చేయాలని కోరింది. ఈ కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉండగా మార్చి 29 నాటి విచారణ సందర్భంగా మంత్రిత్వశాఖ ఈ నిబంధన మీద ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు చెప్పింది. అయితే, హోమ్ కేబుల్ తరఫు న్యాయవాది వివేక్ శరిన్ తన వాదన వినిపిస్తూ వీలైనంత త్వరగా విచారించి స్టే రద్దు చేయాలని కోరారు.

ఈ కేసు విచారణ వాయిదాలమీద వాయిదాలు పడుతుండగా కోర్టు ఆదేశం ప్రకారం చానల్స్ తాము ప్రైమ్ టైమ్ లో ప్రసారం చేసిన ప్రకటనల వివరాలను ఎప్పటికప్పుడు ట్రాయ్ కి అందజేస్తూ ఉన్నాయి. పరిమితి దాటిన చానల్స్ వివరాలను ట్రాయ్ ప్రతి మూడు నెలలకొకసారి తన వెబ్ సైట్ లో  పెడుతూనే వస్తోంది.