• Home »
  • Data & Projections »
  • 2018లో ఇంటర్నెట్ ప్రకటనలు టీవీని మించిపోతాయ్: జెనిత్ ఆప్టిమీడియా

2018లో ఇంటర్నెట్ ప్రకటనలు టీవీని మించిపోతాయ్: జెనిత్ ఆప్టిమీడియా

ఒక వైపు డెస్క్ టాప్ ఇంటర్నెట్ కంటే మొబైల్ ఇంటర్నెట్ ప్రకటనలు వేగంగా పెరిగి పోతుండగా మొత్తంగా ఇంటర్నెట్ ప్రకటనల మార్కెట్ వాటా టీవీని సైతం భయపెట్టే స్థాయికి ఎదుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రకటనలమీద ఖర్చు పెడుతున్న మొత్తం 2017 నాటికి 34 శాతం ఉంటుందని అది టీవీ వాటా కంటే 1.9 శాతం మాత్రమే వెనుకబడి ఉంటుందని జెనిత్ ఆప్టీమీడియా అంచనా వేసింది. మరో ఏడాది గడిచేసరికి టీవీని దాటిపోయి ఇంటర్నెట్ ముందుంటుందని కూడా వెల్లడించింది.

అదే విధంగా పత్రికల ప్రకటనల ఆదాయం 2008 నుంచి పడిపోతున్న ధోరణి అలాగే కొనసాగిస్తున్నదని, 39.4శాతం నుంచి ఈ ఏడాదికి వచ్చేసరికి 19.6 శాతానికి చేరిందని ఆ నివేదిక పేర్కొంది. ఇది మరింత తగ్గిపోయి 2017లో 16.7 శాతానికి చేరుకుంటుందని కూడా అంచనావేసింది. మొబైల్ ఇంటర్నెట్ ప్రకటనలు 2016 నాటికే పత్రికలను మించిపోతాయని కూడా జెనిత్ ఆప్టిమీడియా స్పష్టం చేసింది.

అంతర్జాతీయంగా ప్రకటనల మీద పెట్టే ఖర్చు 2015 లో 4 శాతం పెరుగుతుందని, రియో లో జరిగే సమ్మర్ ఒలంపిక్స్ కారణంగా 2016 లో ఆ పెరుగుదల 5 శాతానికి చేరుకుంటుందని కూడా ఆ సర్వే వెల్లడించింది. అయితే, 2017 లో మాత్రం 4.4 శాతానికి పరిమితమవుతుందని పేర్కొంది