• Home »
  • Broadband »
  • బ్రాడ్ బాండ్ మీద 8% ఎజిఆర్ తొలగించాలి: డిజిటల్ కేబుల్ సమాఖ్య

బ్రాడ్ బాండ్ మీద 8% ఎజిఆర్ తొలగించాలి: డిజిటల్ కేబుల్ సమాఖ్య

డిజిటైజేషన్ నేపథ్యంలో ఒక్కో కనెక్షన్ మీద సగటు ఆదాయం పెరిగి ఈ వ్యాపారం లాభదాయకంగా ఉండాలంటే తప్పనిసరిగా బ్రాడ్ బాండ్ వ్యాపారం చేపట్టాల్సి ఉంటుందని ఆలిండియా డిజిటల్ కేబుల్ సమాఖ్య అభిప్రాయపడింది. ఆపరేతర్ల ఆదాయం మరింత తగ్గే ప్రమాదమున్న నేపథ్యంలో వాళ్ళలో ఆత్నవిశ్వాసం పెరగటానికి ఇది అనివార్యమని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇటీవలే సమాచార, ప్రసారాల మంత్రిని కలిసిన ఈ బృందం బ్రాడ్ బాండ్ సర్వీసులందించే ఎమ్మెస్వోలమీద 8% ఎజిఆర్ తొలగించాలని విజ్ఞప్తిచేసింది.

మంత్రికి అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్న ప్రధాన అంశాలివి :

  1. బ్రాడ్ బాండ్ సర్వీసులందించే ఎమ్మెస్వోలమీద విధిస్తున్న 8% ఎజిఆర్ రద్దుచేయాలి
  2. రైట్ ఆఫ్ వే కల్పించటం ద్వారా ప్రభుత్వం ఎమ్మెస్వోలకు సహకరించాలి. అదే విధంగా ఎమ్మెస్వోల మౌలిక వసతులకు రక్షణ కల్పించాలి. కొన్ని రాష్ట్రాలలో విధిస్తున్న పోల్ టాక్స్ చాలా ఎక్కువగా ఉంది. బ్రాడ్ బాండ్ కోసం చాలా ఖరీదైన పరికరాలు అమర్చవలసి ఉంటుంది కాబట్టి పన్ను భారం తగ్గించటం మంచిది. దాదాపు రూ.7 వేలనుంచి 10 వేల వరకు ఖరీదుచేసే పరికరాలకు రక్షణ కల్పించటం ద్వారా ఎమ్మెస్వోలను ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు.
  3. నెట్ వర్క్ పరికరాల మీద దిగుమతి సుంకాలను హేతుబద్ధం చేయాలని కూడా కోరింది. ప్రభుత్వం ఒకవైపు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటున్నప్పటికీ, మౌలిక సదుపాయాలకు సంబంధించిన కొన్ని పరికరాలు దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదని అందుకే భారత్ లో తయారయ్యేదాకా సుంకాల భారం తగ్గించాలని కోరింది.
  4. టెలికామ్ రంగం తరహాలోనే కేబుల్ బ్రాడ్ బాండ్ నెట్ వర్క్ కూ మౌలిక వసతుల స్థాయి కల్పించాలని సూచించింది. దాని వలన ఎమ్మెస్వోలకు బ్యాంకు రుణాలు తీసుకునే అవకాశం వస్తుందని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చునని పేర్కొంది. ఆ అదనపు పెట్టుబడులతో బ్రాడ్ బాండ్ అభివృద్ధి చేయవచ్చునని వివరణ ఇచ్చింది.

5. దేశంలో వైర్ లైన్ నెట్ వర్క్ వేసుకోవటానికి యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ నిధి నుంచి వాడుకునే వెసులుబాటు కల్పించాలని కూడా  డిజిటల్ కేబుల్ సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.