అమెరికాలో అల్ జజీరా టీవీ మూసివేత

మూడేళ్ళుగా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ వస్తున్న టీవీ చానల్ “ అల్ జజీరా అమెరికా “ ఎట్టకేలకు ఈ ఏప్రిల్ ఆఖరుకల్లా మూతబడుతోంది. వాస్తవానికి కేంద్ర కార్యాలయంలో శాటిలైట్ చానల్ అయినప్పటికీ అమెరికాలో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా కేబుల్ ద్వారా ప్రసారమవుతున్న  సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30 నుంచి ఆ కేబుల్ ప్రసారాలను, డిజిటల్ ఆపరేషన్స్ ను నిలిపేస్తున్నట్టు అల్ జజీరా ప్రకటించింది.

అమెరికా మార్కెట్లో ఎదురవుతున్న ఆర్థిక సవాళ్ళను ఎదుర్కోవటం కష్టమవటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరణ ఇచ్చింది. అమెరికా చానల్ మూసివేసినప్పటికీ, ఇప్పుడున్న వరక్డ్ వైడ్ డిజిటల్ సర్వీసెస్ ను అమెరికాకు విస్తరించబోతున్నట్టు ప్రకటించింది. దీనివలన 2014 సెప్టెంబర్ మొదలుకొని ఈ సంస్థ రూపొందించిన 20 లక్షలకు పైగా వీడియోలు అమెరికా వీక్షకులకు అందుబాటులో ఉంటాయి. అమెరికా ప్రేక్షకులు వార్తలకోసం  ఎక్కువగా మొబైల్ ఫోన్లు, టాబ్స్ వాడుతూ ఉండటం వలన ఈ నిర్ణయం తీసుకున్నట్టు అల్ జజీరా మీడియా నెట్ వర్క్ ఒక ప్రకటనలో చెప్పుకుంది.

రెండున్నర సంవత్సరాల కిందట అమెరికాలో కార్యకలాపాలు ప్రారంభించిన అల్ జజీరా టీవీ ఈ కొద్ది కాలంలోనే అమెరికాలో అనేక అవార్డులు గెలుచుకుంది. మిగిలిన చానల్స్ కు భిన్నంగా తన ప్రత్యేకతను కాపాడుకుంటూ వచ్చినప్పటికీ ఆర్థికంగా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. భిన్నమైన కోణాన్ని ప్రజలకు చూపించే లక్ష్యంతో మొదలైనప్పటికీ అర్థంతరంగా ఇలా ముగించాల్సి రావటం బాధాకరమని సంస్థ సీఈవో అల్ ఆన్ స్టే వ్యాఖ్యానించారు.