• Home »
  • Broadband »
  • ఎపి ఫైబర్ కారుచౌక ట్రిపుల్ ప్లే ఆఫర్ : ఒక అందమైన అబద్ధం !

ఎపి ఫైబర్ కారుచౌక ట్రిపుల్ ప్లే ఆఫర్ : ఒక అందమైన అబద్ధం !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబుల్ టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ మూడింటినీ కారుచౌకగా అందిస్తానంటూ ట్రిపుల్ ప్లే గురించి నానా ఆర్భాటం చేసింది.  ఒకే సెట్ టాప్ బాక్స్ ద్వారా ఈ మూడు సేవలూ అందుకోవచ్చంటూ నమ్మబలికింది. ఈ సేవలు అందుకోకపోతే నష్టపోతారంటూ ఎమ్మెస్వోలనూ, కేబుల్ ఆపరేటర్లనూ సామ, దాన, భేద, దండోపాయాలతో హెచ్చరించింది. తీరా ఇప్పుడు అలాంటి బాక్స్ ప్రపంచంలోనే లేదంటూ చేతులెత్తేసింది. ఇప్పుడు తయారుచేయాలంటే ఏళ్ళ తరబడి పట్టవచ్చునంటూ జారుకుంటోంది. కేబుల్ టీవీకి ఒక బాక్స్, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాలకు మరో బాక్స్ కలిసి నాలుగువేలు వదిలించుకోవాలంటోంది. ఇంతా చేస్తే, అసలు కేబుల్ టీవీ ప్రసారాలకు లైసెన్స్ ఉందా అంటే ఐపిటివి మీదికి నెపం నెట్టి బుకాయించ బోతోంది. అదే ఐపిటీవీ లైసెన్స్ తో సాధ్యమైతే తమిళనాడు ప్రభుత్వం చేతగాక కేంద్రం చుట్టూ నాలుగేళ్ళుగా తిరుగుతున్నదా? తీరా ప్రసారాలు అందించబోయే సమయానికి కేంద్రం అనుమతి లేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాటవేయదన్న గ్యారెంటీ ఏముంది?  అనుమతి ఉందని ట్రాయ్ చేత చెప్పించే ధైర్యం ప్రభుత్వానికుందా?

తెలుగుదేశం పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని అమలు చేయటంలో భాగంగా ట్రిపుల్ ప్లే ముందుకొచ్చింది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమని చెప్పుకుంటున్న  కేబుల్ టీవీ, ఫోన్, ఇంటర్నెట్ కారుచౌకగా అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్చి 17 న లాంఛనంగా ప్రారంభించారు. 100 ఉచిత చానల్స్ తో బాటు 15 ఎంబిపిఎస్ స్పీడ్ తో 5జిబి డేటా రూ. 150 కి ఇవ్వటం ఈ పథకంలో ప్రాథమికాంశం. ఫోన్ సౌకర్యం కూడా ఉన్నప్పటికీ అది ఈ నెట్ వర్క్ లో ఉన్నవారికి ఉచితం. మిగిలిన నెట్ వర్క్స్ కు కాల్ చేస్తే చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.3,800 కోట్లకు రాష్ట్రప్రభుత్వం రూ. 900 కోట్లు జోడించి మొత్తం 61 వేల కిలోమీటర్ల మేర ఆప్టిక్ ఫైబర్ కేబుల్ వేయటం, ఆ విధంగా ఊరూరా, ఇంటింటికీ కేబుల్ టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ అందించటం ఈ పథకం లక్ష్యం. తొలిదశలో ఓవర్ హెడ్ కేబుల్ వేసినా, ఆ తరువాత కాలంలో కేంద్రం నిధులతో అండర్ గ్రౌండ్ కేబుల్ వేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. సురక్షితమైన అండర్ గ్రౌండ్ కేబుల్ కాకుండా హడావిడిగా ఈ నిధుల వృధా ఎందుకని అడిగితే సమాధానమొక్కటే..దేశంలోనే మొట్టమొదట ఈ సేవలందించిన ఘనత దక్కించుకోవాలన్న  ఆశ.

ఈ మొత్తం పథకం పూర్తి కావటానికి 2 నుంచి 3 ఏళ్లు పడుతుంది కాబట్టి ఆ లోపే రాష్ట్ర ప్రభుత్వం మూడు దశల్లో ఆప్టిక్ ఫైబర్ వేస్తూ రాష్ట్రమంతటా సేవలందించాలని నిర్ణయించింది. మొదటి దశలో మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు, రెండో దశలో నాలుగు రాయలసీమ జిల్లాలతోబాటు తూర్పు గోదావరి జిల్లా, మూడో దశలో పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. మొదటి దశ మూడు జిల్లాల్లో లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించినా ఆగస్టు రెండో వారం నుంచి సేవలందుతాయని చెబుతున్నారు.

2011 అక్టోబర్ 25న కేంద్రం తలపెట్టిన నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్ వర్క్ దేశ వ్యాప్తంగా రెండున్నర లక్షల గ్రామపంచాయితీలను అనుసంధానం చేయాల్సి ఉంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, కమ్యూనికేషన్స్, ఐటి మంత్రిత్వశాఖ, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ఈ పథకానికి నిధులు సమకూర్చుతున్నాయి. మూడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ ఎన్ ఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రైల్ టెల్ దీన్ని అమలు చేస్తున్నాయి.

ఈ పథకాన్ని మోడీ ప్రభుత్వం వేగవంతం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రప్రభుత్వాలకు నిధులు కేటాయించటంతో ఆయా రాష్ట ప్రభుత్వాలు ఈ పథకాన్ని తమకు అనుగుణంగా మలచుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ పథకం ద్వారా  తమిళనాట మొత్తం 12,500 గ్రామీణ స్థానిక సంస్థల కార్యాలయాలను ఇంటర్నెట్ సౌకర్యంతో అనుసంధానం చేయటానికి రూ. 3,000 కోట్లు అందిస్తుండగా తమిళనాడు ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోనూ ఎపి స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఏర్పాటైంది.

మాటమార్చిన ఎపి ఫైబర్

ఫైబర్ నెట్ పథకంలో డొల్లతనం క్రమంగా బయటపడుతూ వస్తోంది. ఇంటింటికీ టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ కారుచౌకగా  ఇస్తామంటూ ఊదరగొట్టి ఇప్పుడు మాట మార్చింది. దీనికోసం వాడాల్సిన ప్రత్యేకమైన సెట్ టాప్ బాక్స్ విషయంలో సంస్థకు కనీస అవగాహన కూడా లేదని అర్థమైంది. ఒకే సెట్ టాప్ బాక్స్  సాయంతో మూడు సేవలూ అందుతాయని చెప్పింది. దీంతో అప్పటికే బాక్సులు పెట్టిన ఎమ్మెస్వోలు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వం మాటిమాటికీ ఎమ్మెస్వోలను ఈ సేవలు వాడుకోవాలంటూ బెరరింపు ధోరణిలో మాట్లాడుతూ వచ్చింది. కొన్ని సందర్భాలలో ఆపరేటర్లు కూదా నమోదు చేసుకొని ఈ సేవలు పొందవచ్చునని చెప్పింది. బాక్స్ ఖరీదు కచ్చితంగా చెప్పకపోయినా దాదాపు 3 వేల రూపాయలుంటుందని చూచాయిగా  చెప్పిన అధికారులు ఇప్పుడు అసలు విషయం బైట పెట్టారు.

అలాంటి బాక్స్ ఈ భూప్రపంచంలోనే లేదన్న వాస్తవం ఇప్పుడు తెలిసి వచ్చిందట. బాక్స్ లక్షణాలు ఎలా ఉండాలో చెప్పి ఎవరు తయారు చేస్తున్నారో టెండర్ పిలిచి అడిగితే అందరూ నవ్విపోయాక కళ్ళు బైర్లు కమ్మే నిజం తెలిసి వచ్చింది. ఆ లక్షణాలున్న బాక్సులు ప్రపంచంలో ఇప్పటివరకూ తయారు కాలేదని, ఇప్పుడు తయారు చేయటం మొదలుపెడితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోటి కనెక్షన్లకు కోటి బాక్సులు తయారుకావాలంటే ఏళ్లు పడుతుందని తెలిసి వచ్చింది. ఇప్పుడిక చేసేదేమీ లేదు కాబట్టి రెండు బాక్సులు వాడుకోమని ఉచిత సలహా ఇస్తున్నారు. అంటే, మామూలుగా కేబుల్ ప్రసారాలకోసం వాడుకునే ఒక సెట్ టాప్ బాక్స్ కు తోడు ఇంటర్నెట్, ఫోన్ కోసం మరో బాక్స్. ఈ మాత్రం ఉచిత సలహా ఇవ్వటానికి ఎపి ఫైబర్ కావాలా? అందరూ ఇప్పుడు చేస్తున్న పని అదేగా? ఎయిర్ టెల్ లాంటి సంస్థలు ఇంటర్నెట్ తోబాటు లాండ్ లైన్ ఫోన్ ఇస్తూనే ఉన్నాయి. ఎమ్మెస్వోలు/కేబుల్ ఆపరేటర్లూ టీవీ ప్రసారాలు అందిస్తూనే ఉన్నారు. రెండు బాక్సులకు రెండున్నర వేలు ఖర్చవుతూనే ఉన్నాయి.  మరి ఘనమైన ఎపి ఫైబర్ ఏం చేస్తున్నట్టు?

గతంలోనే తెలుగుటీవీ డాట్ ఇన్ఫో  ఈ విషయం ప్రస్తావించి ఇలా ప్రశ్నించింది:

ఈ సౌకర్యాలన్నీ వాడుకోవాలంటే సెట్ టాప్ బాక్స్ కు ఏయే ఫీచర్లు ఉండాలో ఇప్పుడు చెబుతున్నారు. అలాంటి ఫీచర్లతో బాక్సులు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయా? ఉంటే, ప్రభుత్వమే బేరమాడి ఎంత ధరకు ఇప్పించగలదో చెప్పాలి కదా? సిస్కోతో భారీ డిస్కౌంట్ తీసుకున్నామని పదే పదే చెప్పుకునే అధికారులు ఈ విషయం బహిరంగంగా ఎందుకు ప్రకటించరు? ఒకవేళ అలాంటిదేమీ లేనప్పుడు ఈ హడావిడి అంతా ఎందుకు? బాక్స్ ల సంగతి చూడకుండా ఎమ్మెస్వోలను బుజ్జగించే సమావేశాలెందుకు?

అయినా, అధికారులు తమదైన మొండి ధోరణి వదలకుండా ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చాలా నింపాదిగా రెండు బాక్సులు సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు.

ఫ్రీ చానల్స్ ఫ్రీ! ఫ్రీ!! ఫ్రీ!!!

ఫ్రీ చానల్స్ ఫ్రీగా ఇవ్వటంలో గొప్పేంటి అంటారా? అదే మరి ఎపి ఫైబర్ నెట్ వారి ఔదార్యం. వినసొంపుగా ఉంటుందని 100 చానల్స్ ఉచితంగా ఇస్తామన్నారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి 150 అంటున్నారు. రేపు 200 ఇస్తామన్నా ఆశ్చర్యం లేదు.  ఈటీవీ, మా, జీ తెలుగు, జెమినీ లాంటి చానల్స్ ఇస్తారేమోననుకుంటే తప్పులో కాలేసినట్టే. కేవలం ఉచితంగా గాల్లో సిగ్నల్స్ తిరుగుతూ ఉంటే అవి ఇస్తారు. అవి కూడా ఇంటికి తెచ్చివ్వరు. అది ఎమ్మెస్వో బాధ్యతే. ఎమ్మెస్వోకి తెచ్చి ఇస్తారు. అది ప్రతి ఎమ్మెస్వో సొంతగా చేసుకొగలిగిందే.

మరి ఈ ప్రచారమెందుకు అంటే సామాన్యుడికి అర్థం కాకుండా ఆశ్చర్యం మిగల్చటానికి. పైగా ఇంటర్నెట్, ఫోన్ మాత్రమే అంటే బాగుండదని టీవీ కూడా కలిపారు. అంటే, నాలుగైదు డిష్ యాంటెన్నాలు పెట్టి, ఆయా చానల్స్ ఇచ్చే రిసీవర్ బాక్సులు ( ఐ ఆర్ డి లు) పెట్టుకుంటే అందుకోగలిగే చానల్స్ గురించి మాత్రమే చెప్పింది. వీటికి ప్రభుత్వానికయ్యే ఖర్చు రెండు మూడు లక్షలు మించి ఉండదు. ఒకసారి భరిస్తే సరిపోయే ఖర్చు కాబట్టి దీన్ని ఖర్చు అనటానికే వీల్లేదు. వీటిని పంపిణీ చేయటం ఒక ఘనకార్యంగా చెప్పుకుంటోంది.

కారేజ్ ఫీజుకు గండికొట్టటమే లక్ష్యమా?

కేబుల్ వ్యాపారంలో మౌలిక సదుపాయాల కల్పనకోసం పెట్టే భారీ పెట్టుబడులమీద ఆదాయం సంపాదించుకోవాలంటే కేవలం చందాదారులు చెల్లించే  నెలవారీ చందాలు సరిపోవు. పే చానల్స్ కోసం వసూలు చేసిన సొమ్ములో అత్యధికభాగం బ్రాడ్ కాస్టర్లకే వెళ్ళిపోతుంది కాబట్టి అందులోనూ పెద్దగా మిగిలేదేమీ ఉండదు. అందువలన ఇతర మార్గాలలో ఆదాయం సమకూర్చుకున్నప్పుడే ఎమ్మెస్వోలు గాని కేబుల్ ఆపరేటర్లు గాని తమ నెట్ వర్క్ లు నడుపుకోగలరు.

స్థానిక కేబుల్ చానల్స్ ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయం, బ్రాడ్ కాస్టర్లు చెల్లించే కారేజ్ ఫీజు మాత్రమే ఈ అదనపు ఆదాయాలు. వీటివల్లనే చందాదారులమీద భారం కొంత మేరకు తగ్గుతున్నది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కారేజ్ ఫీజు ఆదాయానికి గండి కొట్టటానికి పూనుకుంది. ఉచిత చానల్స్ పంపిణీ పేరుతో ఆ చానల్ యజమానులకు  మేలు చేసి ఎమ్మెస్వోల పొట్ట కొట్టటానికే  ఈ పద్ధతిని వాడుకుంటోంది. ఇప్పటికే డిజిటైజేషన్ నిబంధనలు బ్రాడ్ కాస్టర్లకు అనుకూలంగా ఉన్నాయనుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఎపి ఫైబర్ నెట్ విధానాలు సైతం అదే దిశలో సాగుతున్నాయి.

డిజిటైజేషన్ లో కేబుల్ ద్వారా పంపిణీ చేసే చానల్స్ కనీసం 100 ఉండాలనేది ప్రభుత్వ విధానం. వాటిలో దూరదర్శన్ చానల్స్ 24 ఉండాలి. అయితే మిగిలిన చానల్స్ విషయంలో ఎలాంటి నిబంధనా లేదు. అదే సమయంలో డిజిటైజేషన్ నిబంధనలలో ఎక్కడా కారేజ్ ఫీజును వ్యతిరేకించలేదు. కారేజ్ ఫీజు వసూలు చేసుకోవటానికి వీలుండటమంటే ఉచిత చానల్ అయినా సరే ఇవ్వకుండా ఉండే హక్కు ఎమ్మెస్వో/ఆపరేటర్ కు ఉండటమే. స్థానిక చానల్స్ అన్నీ ఇచ్చేస్తే ఇక కారేజ్ ఫీజ్ కట్టేదెవరు ? ఈ విషయం ఆలోచించకుండా ఎపి ఫైబర్ నెట్ అధికారులు తీసుకున్న 100  ఉచిత చానల్స్  నిర్ణయాన్ని ఎమ్మెస్వోలు పూర్తిగా అడ్డుకుంటారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. కారేజ్ ఫీజును హక్కుగా భావించే ఎమ్మెస్వోలు దాన్ని వదులుకోవటానికి సిద్ధంగా ఉండరు.

రేపు కేంద్రం అనుమతించలేదంటారేమో!

నిజానికి ఇది జాతీయ స్థాయిలో పైలెట్ ప్రాజెక్ట్ లాంటిదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదే పదే చెబుతుండటం చూస్తుంటే ముందుముందు మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని అనుసరించే అవకాశం ఉంది. అందుకే దేశ వ్యాప్తంగా ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు ఈ నమూనాను నిశితంగా పరిశీలిస్తూ వచ్చారు. ఇప్పుడిప్పుడే ఇందులోని డొల్లతనం బయటపడుతోంది. లైసెన్స్ మీద వెల్లడవుతున్న అనుమానాలకు ఇప్పటివరకూ ఎపి ఫైబర్ నుంచి స్పష్టమైన సమాధానం లేదు.

అసలు ప్రభుత్వం ఎమ్మెస్వోగా మారటం చట్టబద్ధంగా చెల్లుబాటవుతుందా అనేది చాలా కీలకమైన ప్రశ్న. ఐపిటీవీ నిబంధనల ప్రకారం ఎమ్మెస్వో లైసెన్స్ వచ్చినట్టేనన్నది నిజమే అయినా, ఆ తరువాత ట్రాయ్ రూపొందించిన నిబంధనల ప్రకారమైతే రాష్ట్ర ప్రభుత్వాలు శాటిలైట్ చానల్స్ పెట్టటం గాని కేబుల్ వ్యాపారం చేయటం గాని నిషిద్ధం. అలాంటప్పుడు రాష్ట్రప్రభుత్వం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖనుంచి గాని, రెగ్యులేటర్ అయిన ట్రాయ్ నుంచి గాని  వివరణ తీసుకుందా? ఒకవేళ ఐపిటీవీ కింద చానల్స్ పంపిణీ చేసుకోవచ్చునని చెబితే అన్ని రాష్ట్రాలూ ఈ పద్ధతిని వాడుకుంటాయి. అప్పుడు ఎమ్మెస్వో అన్న పదానికే చోటుండదు. దేశ వ్యాప్తంగా ఇదొక పెద్ద వివాదమై కూర్చుంటుంది.

ఉచిత చానల్స్ ఇవ్వాలన్నా సరే ఎమ్మెస్వో లైసెన్స్ ఉండాలన్న విషయం ప్రభుత్వానికి తెలుసా? డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ లేకుండా పే చానల్స్ తో ఒప్పందాలు సాధ్యమవుతాయా? ఐపిటీవీ లైసెన్స్ కూ ప్రభుత్వం కేబుల్ టీవీ ఎమ్మెస్వోగా మారటానికీ మధ్య తేడా ఉందన్న విషయం ప్రభుత్వానికి తెలియదా? తమిళనాడు ప్రభుత్వం నాలుగేళ్ళుగా ఈ విషయం తెలియకనే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నదనుకోవాలా? ఆర్డర్ చేసిన సెట్ టాప్ బాక్సులను సైతం ఉపసంహరించుకున్న తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నేర్చుకోదగిన పాఠాలే లేవా? నిజంగా లైసెన్స్ ఉంటే వెబ్ సైట్ లో పెట్టి ఎమ్మెస్వోలలో నమ్మకం కలిగించటానికి ఎందుకు వెనుకాడుతున్నట్టు?