• Home »
  • Broadband »
  • ఎపి ఫైబర్ నెట్ ముసాయిదా : ప్రచారంలో ఆర్భాటం, పాకేజ్ లో డొల్ల

ఎపి ఫైబర్ నెట్ ముసాయిదా : ప్రచారంలో ఆర్భాటం, పాకేజ్ లో డొల్ల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంతకాలంగా ఊరిస్తూ వస్తున్న ఫైబర్ నెట్ పథకం, దాని అసలు లెక్కలు ముసాయిదా రూపంలో బైట పెట్టింది. ఇంటింటికీ టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ కారుచౌకగా  ఇస్తామంటూ ఊదరగొట్టి ఇప్పుడు మాట మార్చింది. దీనికోసం వాడాల్సిన ప్రత్యేకమైన సెట్ టాప్ బాక్స్ ఖరీదు కచ్చితంగా చెప్పకపోయినా దాదాపు 3 వేల రూపాయలుంటుందని దాదాపు రెండు నెలలకిందటే చెప్పిన అధికారులు ఇప్పుడు నెలవారీ పాకేజ్ సంగతి కూడా బైట పెట్టారు. ఇందులో పెద్దగా గొప్పతనమేమీ లేదని చెప్పకనే చెప్పినట్టయింది. ఈ మొత్తం పథకంలో కేంద్రప్రభుత్వ వాటా ఎంత, రాష్ట్రప్రభుత్వ నిధులెన్ని అనే ఇబ్బందికరమైన లెక్కల జోలికి  కూడా వెళ్ళకుండా ఇప్పుడు ప్రకటించిన ముసాయిదాకే పరిమితమవుదాం.

ముందుగా ఇంటర్నెట్ విషయానికొస్తే.. ఇప్పటిదాకా చెబుతూ వచ్చిందొకటి, ఇప్పుడు చెబుతున్న దొకటి. స్పీడ్ మాత్రమే ప్రస్తావిస్తూ వచ్చిన ఎపి ఫైబర్ నెట్ అధికారులు ఇప్పుడు డేటా వాడకం పరిమితిని తెరమీదికి తెచ్చారు. ఆ విధంగా చూస్తే ఎసిటి ఫైబర్ నెట్ లాంటి ప్రైవేటు సంస్థలు కూడా దాదాపు అలాంటి పాకేజీలు ఇప్పటికే ఇస్తున్నాయి. ఉదాహరణకు 50 జిబి డేటా ఎపి ప్రభుత్వం 15 ఎంబిపిఎస్ స్పీడ్ తో ఇస్తూ  రూ. 599 ప్లస్ పన్నులు వసూలు చేయబోతుండగా దాదాపుగా అదే స్థాయిలో ఇచ్చే ప్రైవేటు సంస్థలు కూడా ఉండటం గమనార్హం.

ఎమ్మెస్వోలు, లేదా ఆపరేటర్లకు బాగానే కమిషన్ ఇవ్వజూపుతున్నట్టు ఈ లెక్కలు చెబుతుండగా నిర్వహణ ఖర్చులు ఎవరు ఏ మేరకు భరించాలనేది ఇంకా స్పష్టంగా తెలియదు. కేబుల్ కత్తిరింపులు సర్వసాధారణంగా ఉండే ఈ వ్యాపారంలో ఆప్టిక్ ఫైబర్ ల మరమ్మతు ఖర్చు ఆషామాషీ వ్యవహారం కాదు. అదే సమయంలో వినియోగదారుల కంటే పంపిణీ దారులకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. ఏ వ్యాపారంలోనూ ధరలో సగం కంటే ఎక్కువ కమిషన్ ఇచ్చే దారుణమైన పరిస్థితి ఉండదు.

చందాదారు కట్టాల్సింది నెలకు 599 రూపాయల చందాతోబాటు సర్వీస్ టాక్స్ కూడా కలిసి తడిసె మోపెడవుతుంది. ఉంటుంది. ఇలా వసూలు చేసే మొత్తంలో ఎమ్మెస్వో/ఆపరేటర్ వాటా రూ.389. అంటే, వినియోగదారుడు కట్టే మొత్తంలో సగానికంటే ఎక్కువ ఎమ్మెస్వో /ఆపరేటర్ కి వెళుతుంది. మరెక్కడా లేని విధంగా ఇంత కమిషన్ ఇచ్చి చందాదారుడికి మాత్రం పెద్దగా లబ్ధి చేకూర్చకపోవటం ఎలాంటి ఉదార స్వభావమనుకోవాలో అర్థం కాదు. నిజానికి ఎక్కువమంది వినియోగదారులు తీసుకోవటానికి మొగ్గుచూపుతారనుకున్న విభాగంలోనే ఇలా చేయటం ఉద్దేశపూర్వకంగా జరిగిందనే అనుకోవాల్సి వస్తుంది.

ఇక కేబుల్ టీవీ చానల్స్ విషయానికొస్తే, ఉచిత చానల్స్ విషయం మాత్రమే ప్రభుత్వం వెల్లడించింది. అంటే, నాలుగైదు డిష్ యాంటెన్నాలు పెట్టి, ఆయా చానల్స్ ఇచ్చే రిసీవర్ బాక్సులు ( ఐ ఆర్ డి లు) పెట్టుకుంటే అందుకోగలిగే చానల్స్ గురించి మాత్రమే చెప్పింది. వీటికి ప్రభుత్వానికయ్యే ఖర్చు రెండు మూడు లక్షలు మించి ఉండదు. ఒకసారి భరిస్తే సరిపోయే ఖర్చు కాబట్టి దీన్ని ఖర్చు అనటానికే వీల్లేదు. వీటిని పంపిణీ చేయటం ఒక ఘనకార్యంగా చెప్పుకుంటోంది. “గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం“ అన్నట్టుంది ప్రభుత్వ సేవ.

ఈ విధంగా ప్రభుత్వం ఇవ్వజూపిన 100 చానల్స్ ఎంపిక ఎలా జరిగిందో చెప్పటానికి ప్రాతిపదిక ఏదీ కానరాదు. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఇచ్చి తీరాలన్న దూరదర్శన్ చానల్స్ ను మాత్రం ఈ జాబితాలో చేర్చింది. ఈటీవీ తెలంగాణ చానల్ ఇస్తున్నట్టు జాబితాలో ఉంది. అదే సమయంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ మాత్రం కనబడటం లేదు. నిజానికి ఈ రెండు చానల్స్ పే చానల్స్. ఎపి ఫైబర్ నెట్ అధికారులు ఈటీవీ తెలంగాణ అనే పే చానల్ ను ఈ జాబితాలో తెలిసి చేర్చారా, తెలియక చేర్చారా అనేది అర్థం కాదు.

ఉచితంగా ఇచ్చే తెలుగు న్యూస్ చానల్స్ అన్నిటినీ చేర్చే ప్రయత్నం చేశారు గాని ఇందులో “ నెం.1 న్యూస్ “ అనే చానల్ జాడ లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, పొరబాటా? అదే విధంగా భారత్ టుడే అనే చానల్ పేరు రెండు సార్లు కనబడుతుంది. లైసెన్స్ పొందిన చానల్స్ జాబితాలో లేవు కాబట్టి స్టుడియో వన్, 6టీవీ, 6 టీవీ తెలంగాణ అనేవి చేర్చలేదని అర్థం చేసుకోవచ్చు.

భక్తి చానల్స్ లో సివిఆర్ ఓమ్ ఎందుకు మినహాయించారో అధికారులే చెప్పాలి. ప్రజలకు అవసరమైన హెల్త్ చానల్స్ విషయంలోనూ అదే నిర్లక్ష్యం కనిపిస్తుంది. టీవీ7 హెల్త్ , సివిఆర్ హెల్త్ అనే చానల్స్ ఉన్నట్టు తెలియకనో, తెలుసుకోవటానికి ప్రయత్నించకపోవటం వల్లనో వాటిని పక్కనబెట్టి వాళ్ళకు తెలిసిన ఎఫ్ టీవీ ని మాత్రం చేర్చారు. బహుశా ఆ మాత్రం కలాపోసన ఉండాలనుకున్నారేమో.

స్థానికంగా సివిఆర్ న్యూస్ అనే ఇంగ్లిష్ చానల్ ఉండగా దాన్ని పట్టించుకోకుండా టీవీ 5 మోడే ఏషియా అనే చానల్ తెచ్చి పెట్టారు. సరిహద్దుల్లో ఉండే ప్రజలకోసం తమిళ, కన్నడ భాషల్లో ఉన్న ఉచిత చానల్స్ ఇద్దామన్న ఆలోచన కూడా అధికారులకు రాలేదు. కనీసం ఇరవై చానల్స్ పేర్లు ఎక్కువమంది జనం విని కూడా ఉండరు. దూరదర్శన్ యాదగిరి చేర్చారు గాని దూరదర్శన్ సప్తగిరిని మాత్రం వదిలేశారు.

స్థూలంగా చెప్పాలంటే, ఎపి ఫైబర్ నెట్ ప్రకటించిన పాకేజీలు వినియోగదారులకు ఎంతమాత్రమూ ఆసక్తికరంగా కనబడటం లేదు. ప్రచారం జరిగినప్పుడు కనబడ్డ ఆర్భాటంతో పోల్చుకుంటే ఉసూరుమనిపించినట్టే ఉన్నాయి. కొంతలో కొంత ఎమ్మెస్వోలను ఆకట్టుకునే ప్రయత్నం మాత్రమే జరిగింది. ఉచిత చానల్స్ ను గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరమేమీలేదు. పే చానల్స్ తో బేరమాడి తగ్గించగలిగిన సత్తా ఉంటే అప్పుడు తమ గొప్పతనం చెప్పుకోవచ్చు. ట్రిపుల్ ప్లే అని చెప్పుకున్నారే తప్ప టెలిఫోన్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఇంతకీ వినియోగదారులు కొనాల్సిన సెట్ టాప్ బాక్స్ ఖరీదెంతో చెబితే అప్పుడు ప్రభుత్వం తలపెట్టిన ప్రజాసేవ అసలు స్వరూపం స్పష్టంగా కనబడుతుంది. ( సెట్ టాప్ బాక్స్ తయారీ/సరఫరాదారు వివరాలు చెప్పనక్కర్లేదు సుమా! )