• Home »
  • Broadband »
  • చానల్స్ ఎంపికలో ఎపి ఫైబర్ నెట్ దే ఇష్టారాజ్యం, ఇచ్చినవి తీసుకోవాల్సిందే

చానల్స్ ఎంపికలో ఎపి ఫైబర్ నెట్ దే ఇష్టారాజ్యం, ఇచ్చినవి తీసుకోవాల్సిందే

ఎపి ఫైబర్ నెట్ తలపెట్టిన కేబుల్ టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ పంపిణీ కార్యక్రమం ఇంకా తప్పటడుగులు వేస్తూనే ఉంది. సాంకేతికంగా సాధ్యాసాధ్యాలు, ఎమ్మెస్వో అనుమతుల సంగతలా ఉంచితే ఏ చానల్స్ ఇవ్వాలనే విషయంలో ఇంకా ఒక స్పష్టత రాలేదు. ఉచిత చానల్స్ ను 100 కు పరిమితం చేయాల్సిన అవసరమేంటన్నది అసలు ప్రశ్న. డిజిటైజేషన్ లో ట్రాయ్ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన కనీస ఉచిత చానల్స్ సంఖ్య 100 కాబట్టి ఆ కనీస చానల్స్ నే ఇవ్వాలనుకోవటం ద్వారా ఎమ్మెస్వో/ఆపరేటర్ తన స్వేచ్ఛను వాడుకునే అవకాశం లేకుండా చేయటం మొదటి తప్పిదం.

ఎపి ఫైబర్ నెట్ అధికారులు అభిప్రాయ సేకరణ పేరుతో పంపిన మెయిల్ లో ఇచ్చిన చానల్స్ జాబితాలో అనేక పొరపాట్లు దొర్లాయి. అయితే, ఈ విషయాన్ని తెలుగు టీవీ డాట్ ఇన్ఫో వెంటనే మెయిల్ ద్వారా తెలియజేయటంతో చాలావరకు ఆ మార్పులు చేస్తూ రెండో వెర్షన్ తయారుచేసి మళ్ళీ అందరికీ మెయిల్ చేశారు. అయితే, ఈ వెర్షన్ లో సైతం తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. పైగా, చానల్స్ ఎంపికకు ఎలాంటి ప్రాతిపదికా ఉన్నట్టు కనబడటం లేదు.

మొదటి జాబితాలో లేని సివిఆర్  ఇంగ్లిష్, సివిఆర్ ఓమ్,  సివిఆర్ హెల్త్, నెం. 1 న్యూస్ , డిడి సప్తగిరి చేర్చారు. ఈటీవీ తెలంగాణ పే చానల్ అని తెలియగానే దాన్ని జాబితా నుంచి తొలగించారు. అయితే, దేశంలోనే మొట్టమొదటి హెల్త్ చానల్ అయిన టీవీ 7 హెల్త్ ప్లానెట్ తెలుగు చానల్ అయినప్పటికీ దాన్ని మాత్రం ఇంకా కలపలేదు. కారేజ్ ఫీజు కట్టలేక ఇంకా ఎక్కువమందికి అందుబాటులోకి రాలేకపోయిన ఇలాంటి చానల్ ను ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అయినా చేర్చాల్సి ఉంది.

ఇంకా అన్నిటికంటే దారుణమైన విషయమేంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ఒకే ఒక న్యూస్ చానల్ వై టీవీకి చోటు లేకపోవటం. మరీ ముఖ్యంగా తొలిదశ ప్రారంభిస్తున్న ఉత్తరాంధ్రలో విశాఖ కేంద్రంగా ఈ శాటిలైట్ చానల్స్ ప్రసారాలు వస్తున్నాయి. అయినా సరే  ఫైబర్ నెట్ అధికారులకు ఇది గుర్తుకు రాలేదు. టీవీ9 గ్రూప్ లోని కన్నడ, గుజరాతీ, మరాఠీ చానల్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయిగాని అదే గ్రూప్ నుంచి వస్తున్న జై తెలంగాణ మాత్రం మిస్సయింది.

హైదరాబాద్ కేంద్రంగా వస్తున్న రెండు ప్రాంతీయ ఉర్దూ శాటిలైట్ చానల్స్ మున్సిఫ్ టీవీ, 4టీవీ  లకు అంధ్రప్రదేశ్ లో కూడా ఆదరణ ఉన్నప్పటికీ ఎపి ఫైబర్ నెట్ ఇచ్చే ఉచిత చానల్స్ జాబితాలో ఇవి కనబడవు.  వివిధ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వటంలోనూ సమతుల్యత పాటించలేదు. ఆధ్యాత్మిక చానల్స్ కు చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినా, హిందీ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో స్టార్ ఉత్సవ్, జీ అన్మోల్ లాంటి ఉచిత చానల్స్ ను పట్టించుకోలేదు. ఇవి ప్రేక్షకాదరణ పరంగా టాప్ 10 హిందీ చానల్స్ లో ఉన్న ఉచిత చానల్స్. అన్ని అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వదలచుకుంటే మాజిక్ బ్రిక్స్ లాంటి రియల్ ఎస్టేట్ చానల్ నూ కలిపి ఉండాల్సింది.

దూరదర్శన్ చానల్స్ ఇవ్వాలన్న నిబంధన ఉంది కాబట్టి 25 చానల్స్ ఇచ్చారు. తెలుగు ఉచిత చానల్స్ అన్నీ ఇవ్వటం సమంజసమే కాబట్టి చాలావరకు అవీ ఇచ్చారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువమంది చూస్తున్న ఇతర భాషల  చానల్స్ ఏవి ఉన్నాయో  తెలుసుకొని వాటిని జాబితాలో చేర్చి ఉంటే బాగుండేది. ప్రేక్షకాదరణను లెక్కించే  బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) లాంటి సంస్థకు లేఖ రాసి ఆ సమాచారం తెప్పించుకోవచ్చునన్న కనీస అవగాహన కూడా లేకుండా ఇంత పెద్ద ఎత్తున పథకం చేపట్టటంలో అర్థం లేదు.  ఉచిత చానల్స్ జాబితాలో ఇప్పటికి రెండు వెర్షన్లు విడుదలచేసిన ఎపి ఫైబర్ నెట్ మూడో జాబితాలోనైనా అర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటుందేమో చూడాలి.