• Home »
  • Broadband »
  • ఇంటర్నెట్ పేరుతో ఎపి సర్కార్ కేబుల్ వ్యాపారమా? : ఎమ్మెస్వోల అనుమానం

ఇంటర్నెట్ పేరుతో ఎపి సర్కార్ కేబుల్ వ్యాపారమా? : ఎమ్మెస్వోల అనుమానం

దేశ వ్యాప్తంగా అమలు జరుగుతున్న మూడో దశ డిజిటైజేషన్ లో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెస్వోలకు, ఆపరేటర్లకు, కేబుల్ టీవీ  వినియోగదారులకు మరో ఆరు నెలల గడువు పొడిగించాలని చంద్రబాబునాయుడు సమాచార, ప్రసార శాఖామంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 800 మందికి పైగా ఎమ్మెస్వోలు, 9,000 మంది కేబుల్ ఆపరేటర్లు 13 జిల్లాల్లో 13 లక్షల ఇళ్ళకు ఈ మూడో దశలో సేవలందిస్తున్నారని ఆ లేఖలో ఆయన గుర్తుచేశారు.  కొద్ది మంది ఎమ్మెస్వోలకు మాత్రమే డిజిటల్  లైసెన్స్ వచ్చిందని, పైగా డిజిటల్ హెడ్ ఎండ్ ఖరీదు చాలా ఎక్కువ కావటం, తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేకపోవటం కారణంగా చాలా మంది లైసెన్స్ తీసుకోవటానికి కూడా ముందుకు రాలేకపోతున్నారని ఆ లేఖలో ప్రస్తావించారు.  ఎపి ఫైబర్ గ్రిడ్ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక డిజిటల్ హెడ్ ఎండ్ ఏర్పాటు చేసి ఎమ్మెస్వోలకు, ఆపరేటర్లకు సాయం చేసే ఆలోచనలో ఉందని కూడా పేర్కొన్నారు. ఆ హెడ్ ఎండ్  ఎమ్మెస్వోలకోసం, ఆపరేటర్లకోసం సర్వీస్ ప్లాట్ ఫామ్ గా పనిచేస్తుందని కేంద్రానికి తెలియజేశారు.

అంతవరకే చెప్పారు తప్ప ఇంటర్నెట్ తో బాటు టీవీ చానల్స్ కూడా పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నదని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. అయితే, ప్రభుత్వం మరోవైపు తన ఏర్పాట్లు తాను చేస్తూ వస్తోంది. ఎమ్మెస్వోలను కొంతమందిని ఎంపిక చేసి మరీ పిలిపించి వాళ్ళకు సూచనప్రాయంగా తన వ్యూహాన్ని వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్ లో 800 మందికి పైగా ఎమ్మెస్వోలు ఉన్నారని చెబుతున్న  రాష్ట్ర ప్రభుత్వం దాదాపు వందమందిని మాత్రమే ఆహ్వానించి తన వ్యూహాన్ని వివరించింది. అయితే, ఆ వంద మంది ఎంపిక ఎలా జరిగిందన్న విషయం మాత్ర ఎక్కడా చెప్పలేదు.  జనవరి25న  హైదరాబాద్ లో ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేసి ఎపి ఫైబర్ సంస్థ ఏం చేయబోతున్నదో ప్రయోగాత్మకంగా ప్రదర్శించి మరీ చూపారు. టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం ఎలా కల్పిస్తారో వివరిస్తూ, దానికోసం 3 వేల రూపాయల విలువచేసే బాక్స్ కొనుక్కోవాల్సిన అవసరాన్ని కూడా వివరించారు.

ప్రభుత్వం చెబుతున్న లక్ష్యాలు

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోటీ 30 లక్షల ఇళ్ళకు 10 నుంచి 15 ఎంబిపిఎస్ స్పీడ్ తో నెలకు రూ.150 కే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించటంతోబాటు 60 వేల స్కూళ్ళకు, 6,580 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కూడా ఈ సౌకర్యాన్ని విస్తరిస్తారు. కార్యాలయాలకైతే దాదాపు 100 ఎంబిపిఎస్ వేగంతో అందిస్తూ నెలకు రూ. 1,000  మాత్రమే వసూలు చేస్తారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న ఎమ్మెస్వోలను, కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములను చేస్తారు. అయితే, వాళ్ళకు మాత్రమే ఈ పంపిణీ ఇస్తారన్న గ్యారెంటీ లేదు. ఇంటర్నెట్ పంపిణీ రంగంలో ఉన్నవాళ్ళకు కూడా ఇస్తారు. ఇంటింటికీ వసూలు చేసే మొత్తంలో ఎక్కువభాగం ఆ ఎమ్మెస్వో/ఆపరేటర్/పంపిణీ దారుకే దక్కుతుందని, ప్రభుత్వం తీసుకునే మొత్తం నామమాత్రమేనని చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.

అయితే, అసలు సమస్య కేబుల్ దగ్గరే వస్తోంది. శాటిలైట్ చానల్స్ కూడా ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఒకవైపు ఎమ్మెస్వోగా లైసెన్స్ తీసుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెబుతూనే మరోవైపు బ్రాడ్ కాస్టర్లతో బేరమాడి చానల్స్ అందించటానికి డిజిటల్ హెడ్ ఎండ్ పెడతామని వెల్లడించింది. ఖరీదైన హెడ్ ఎండ్ పెట్టుకోవటం సాధ్యం కాని ఎమ్మెస్వోలకు, ఆపరేటర్లకు అండగా ఉండటమే లక్ష్యమని వివరణ కూడా ఇస్తోంది. అయితే, లైసెన్స్ లేని ఎమ్మెస్వోతో బ్రాడ్ కాస్టర్ ఎలా ఇంటర్ కనెక్ట్ ఒప్పందం కుదుర్చుకుంటాడనే సాంకేతికపరమైన అంశానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అదే సమయంలో ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు ఎమ్మెస్వో లైసెన్స్ రాదన్న విషయం కూడా కొత్తేమీ కాదు. తమిళనాడు ప్రభుత్వం నాలుగేళ్ళుగా డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. ట్రాయ్ సూచనల ప్రకారమే నడుచుకుంటున్నామంటూ కేంద్రం ఈ విషయాన్ని పక్కనబెట్టింది.

మరి ఏ ధైర్యంతో ప్రభుత్వం టీవీ చానల్స్ పంపిణీ చేస్తుందన్న ప్రశ్నకు ప్రస్తుతానికి సమాధానం లేదు. అయితే, ఈ రంగంలో ఉన్న ఒక సీనియర్ ఎమ్మెస్వో అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ఇంటర్నెట్ ద్వారా పంపిణీ చేసే ఆలోచనలో ఉండి ఉంటుందని తెలుస్తోంది. ఇంటర్నెట్ అయితే డిజిటైజేషన్ నిబంధనలేవీ వర్తించవు కాబట్టి ప్రభుత్వం ఆయా చానల్ యాజమాన్యాలతో బేరసారాలు సాగించి వీలైనంత తక్కువ ధరకు అందించే అవకాశముందని అంటున్నారు. నిజానికి ఎపి ఫైబర్ నెట్ ఏర్పాటి చేసిన సమావేశంలో కూడా ప్రభుత్వ ప్రతినిధి అదే ధీమా వ్యక్తం చేశారు. సిస్కో నుంచి 92 శాతం డిస్కౌంట్ సంపాదించటాన్ని, సునాయాసంగా బాంకు ఆర్థికసహాయం ఇవ్వటాన్ని ప్రస్తావిస్తూ చానల్స్ ను కూడా మెడలు వంచుతామని చెప్పారు. ఇందులో ఉన్న సాంకేతిక సమస్యల సంగతలా ఉంచితే, ధరలు తగ్గి టీవీ ప్రేక్షకులకు తక్కువ ధరకే ప్రసారాలు అందేలా ఎమ్మెస్వోలకు ఫీడ్ ఇవ్వగలిగితే మంచిదే.

కానీ అసలు సమస్య ఇప్పటికే డిజిటైజేషన్ బాగా వేగం పుంజుకోవటం. చాలామంది ఎమ్మెస్వోలు డిజిటల్ బాక్సులమీద పెట్టుబడి పెట్టి ఉండటం. ప్రభుత్వం మళ్ళీ ట్రిపుల్ ప్లే పేరుతో కొత్త సెట్ టాప్ బాక్సులు తీసుకోవాలని చెబుతుండటం మొత్తం కేబుల్ వ్యవస్థనే కలవరపరుస్తోంది. అందులోనూ ఒక్కో సెట్ టాప్ బాక్స్ ఖరీదు మూడు వేల రూపాయలుంటుందని చెబుతుండటంతో మళ్ళీ మొదటినుంచి తలకెత్తుకోవటం సమస్యగా తయారవుతుందని చాలా మంది అంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఇప్పుడున్న ఎమ్మెస్వోలకు ప్రాధాన్యం ఇస్తామంటూనే , అవసరమైతే కొత్త వాళ్లను కూడా ప్రోత్సహిస్తామని చెప్పటం ద్వారా ప్రభుత్వం అనారోగ్యకరమైన పోటీకి కారణమయ్యేలా ఉంది. ఇంటర్నెట్ మాత్రమే ఇచ్చి ఎమ్మెస్వోలను, ఆపరేటర్లను భాగస్వాములుగా చేసుకోవటంలో ఎలాంటి ఇబ్బందులూ ఉండకపోవచ్చుగాని కొత్తవాళ్ళను ప్రోత్సహిస్తామనటం ద్వారా కేబుల్ వ్యాపారంలో చిచ్చుపెట్టబోతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం ఏ దశలో ఉంది?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పవర్ గ్రిడ్, గ్యాస్ గ్రిడ్, వాటర్ గ్రిడ్ తరహాలోనే ఈ ఫైబర్ గ్రిడ్ కూడా మొదలైంది. ఎపి స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ద్వారా అమలు జరుగుతున్న ఈ పథకంలో భాగంగా ఇప్పటికే ఆప్టిక్ ఫైబర్ లైన్లు వేయటం మొదలైంది. నిజానికి ఇది కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన భారత్ బ్రాడ్ బాండ్ లో భాగమే. అండర్ గ్రౌండ్ కేబుల్ వేయటానికి కనీసం రెండేళ్ళు పట్టే అవకాశం ఉండటంతో ముందు ఏరియల్ ఆప్టిక్ ఫైబర్ కే మొగ్గు చూపింది. రెండో దశలో అండర్ గ్రౌండ్ కేబుల్ వేసి రెండూ ఉమ్మడిగా పనిచేసేలా ఒక రింగ్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 22,500 కిలోమీటర్ల మేర  ఏరియల్ ఆప్టిక్ ఫైబర్ లైన్ వేయటం, రెండో దశలో 61,000 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ ఆప్టిక్ ఫైబర్ లైన్ వేయటం ప్రభుత్వ లక్ష్యం. మొదటి దశ  6 నుంచి 9 నెలల్లో పూర్తి అవుతుందని అంచనావేస్తుండగా రెండో దశకు మాత్రం కనీసం రెండు మూడేళ్ళు పట్టవచ్చు. ఒకవైపు కేబుల్ డిజిటైజేషన్ చాలా వేగంగా జరుగుతూ ఉండటం వలన ఇప్పటికిప్పుడు అండర్ గ్రౌండ్ కేబుల్ విషయం పక్కనబెట్టి ఏరియల్ ఫైబర్ మీద దృష్టిపెట్టారు.

వివరాలు మొదటి దశ రెండో దశ మూడో దశ
    జిల్లాలు శ్రీకాకుళం , విజయనగరం, విశాఖపట్టణం తూర్పు గోదావరి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
 మొత్తం ఏరియల్ ఆప్టిక్ ఫైబర్ పొడవు 2,915 కి.మీ. 10,936 కి.మీ. 9,594 కి.మీ.
ఇప్పటివరకు పూర్తయిన ఫైబర్ పొడవు 2,697 కి.మీ. 1,943 కి.మీ. —-
పూర్తి చేయటానికి నిర్ణయించుకున్న గడువు 2016 ఫిబ్రవరి 27 2016 ఏప్రిల్ 21 2016 జూన్ 28

అరచేతిలో వైకుంఠం – సవాలక్ష సందేహాలు

ఐదారు నెలల్లోనే కార్యకలాపాలు ప్రారంభించటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు చెబుతున్న ప్రభుత్వం ఎపి ఫైబర్ ద్వారా విశిష్ట సేవలందిస్తామంటోంది. సెట్ టాప్ బాక్స్ ఖరీదు 3 వేలుంటుందని చెబుతూనే కేవలం టీవీ సిగ్నల్స్ కావాలనుకుంటే మాత్రం ఇప్పుడున్న సెట్ టాప్ బాక్స్ కూడా పనిచేస్తుందని హామీ ఇచ్చింది. నిజానికి హైదరాబాద్ లో ఇచ్చిన ప్రయోగాత్మక ప్రదర్శనలో హాత్ వే బాక్స్  ద్వారా  వీడియో సిగ్నల్స్ పంపింది. అయితే  ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం కావాలనుకునేవాళ్ళు మాత్రం ఈ ప్రత్యేకమైన ట్రిపుల్ ప్లే హెచ్ డి సెట్ టాప్ బాక్స్ కొనుక్కొని తీరాలి. అక్కడే అసలు సమస్య వస్తోంది. ఇప్పటికే సెట్ టాప్ బాక్స్ కొనుక్కున్నవాళ్ల సంగతేంటి ? ఆ సెట్ టాప్ బాక్సుల ద్వారా ఇంటర్నెట్ ఇవ్వటం సాధ్యం కాదా? ఈ ప్రశ్నలకు తగిన సమాధానాలు రావాలంటే మరికొంత సమయం ఆగాల్సి ఉంటుందంటున్నారు.

ప్రభుత్వం అందించే సౌకర్యం వినియోగించుకునే పక్షంలో వినియోగదారులు ఇతర నెట్ వర్క్స్ లోని ఫోన్ లకు మాట్లాడినప్పుడే  బిల్లు కట్టాల్సి వస్తుంది. ఇదే సౌకర్యం వాడుకుంటున్న వాళ్లతో మాట్లాడితే ఉచితం. మరో మాటలో చెప్పాలంటే ఆఫీసులో ఇంటర్ కామ్ లో మాట్లాడుకున్నట్టే. దీని సాయంతో వీడియో కాన్ఫరెన్సింగ్, ప్రభుత్వ బిల్లుల చెల్లింపు లాంటి అనేక ఇతర సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తాయి.  ఎమ్మెస్వోల కోణంలో ఆలోచిస్తే, ఫైబర్ లైన్లు మాటిమాటికీ తెగిపోవటం , వాటి నిర్వహణ భారం ఉండదు. ప్రభుత్వం ప్రతి విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర తన మిని హెడ్ ఎండ్ ( పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ ) ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఎక్కువదూరం కేబుల్ వేసుకొని దాన్ని నిర్వహించుకోవాల్సిన అవసరముండదు.  ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 2,449 సబ్ స్టేషన్లలోనూ ఏర్పాటు చేయటం వల్ల దాదాపుగా ప్రతి మండలానికీ సగటున మూడు స్టేషన్లున్నాయి.  రెండో దశ పూర్తయ్యేసరికి ప్రతి గ్రామపంచాయితీకి అనుసంధానం కావాలన్న భారత ప్రభుత్వ  విధానం ఆచరణలోకి వస్తుంది. మరో విషయమేంటంటే, ఎవరికైనా ఆప్టిక్ ఫైబర్ లైన్ లీజుకు కావాలన్నా ప్రభుత్వం అద్దెకిస్తుంది. ఇప్పుడు వేస్తున్న ఆప్టిక్ ఫైబర్ 24 కోర్ కావటం వలన వాణిజ్యపరంగా కూడా దాని నుంచి లాభాలు ఆర్జించే అవకాశాన్ని వాడుకోవాలనుకుంటోంది.

కానీ ఇవన్నీ  ప్రభుత్వ కోణం నుంచి చెబుతున్న విషయాలు. కానీ ఎమ్మెస్వోలకు అది అర్థమవుతున్న తీరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వం ఎవరిని ప్రోత్సహించాలనుకుంటున్నదో అర్థం కావటం లేదంటున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి సెట్ టాప్ బాక్సులు సబ్సిడీ మీద పంచిన తరువాత మళ్లీ కొత్త సెట్ టాప్ బాక్స్ లు ఇస్తామనటం మింగుడు పడటం లేదు. మరో వైపుకొత్త వాళ్ళను కూడా ప్రోత్సహించటమంటే ఇందులో రాజకీయాలు చొప్పించే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.  పాత వాళ్ళకు ప్రాధాన్యం అంటూనే పరిధి నిర్ణయించటంలో ఎమ్మెస్వో సంఘాల ప్రతినిధులను సంప్రదిస్తామనటం కూడా ప్రభుత్వం వ్యవహరించదలచుకున్న తీరు మీద అనుమానాలకు తావిస్తోంది. గత అక్టోబర్ లోనే ఈ కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం ఇంత ఆలస్యంగా ఎమ్మెస్వోలతో ఈ విషయం పంచుకోవటం మీద కూడా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

దేశానికే ఆదర్శమా ?

భారతదేశమంతా ఈ పథకం అమలు తీరుతెన్నులగురించి ఆంధ్రప్రదేశ్ వైపు ఎంతో ఆసక్తితో చూస్తున్నదని చెబుతున్నారు. ఇక్కడ విజయవంతమైతే అనేక రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేయటానికి  ఉవ్విళ్ళూరుతున్నాయి.  టెలికాం కంపెనీగా లైసెన్స్ కూడా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటింటికీ కారు చౌకగా ఇంటర్నెట్ తోబాటు ఫోన్ సౌకర్యం కల్పించటం సహజంగానే ప్రజలను ఆకట్టుకుంటుంది.  ప్రభుత్వం సామాన్య ప్రజలకు మేలు చేయటానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని యథాతథంగా అమలు చేస్తూ ఇప్పుడున్న కేబుల్ వ్యవస్థను బలోపేతం చేస్తే అంతా బాగానే ఉంటుంది. అయితే, కేబుల్ వ్యాపారాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తే మాత్రం ప్రభుత్వ ప్రయోగం వికటించే ప్రమాదముంది.  నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలకు టీవీ మీద పెత్తనం ఇస్తే స్వప్రయోజనాలకు వాడుకూంటాయన్న భయమే ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతూ వస్తోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు సొంత చానల్స్ నడుపుకోవటానికి అనుమతి కోరినా కేంద్రం నిరాకరిస్తూ వచ్చింది. చివరికి కేబుల్ వ్యాపారం ప్రారంభించిన తమిళనాడు ప్రభుత్వ సంస్థకు కూడా అనుమతి మంజూరు చేయలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబుల్ ప్రసారాలు కూడా ఎమ్మెస్వోల సాయంతో ప్రసారం చేసినా అది కేంద్ర ప్రభుత్వ విధానానికి అడ్డదారిలో గండి కొట్టినట్టు అవుతుంది. కేబుల్ వ్యాపారంలో రాజకీయాలు ప్రవేశించే ప్రమాదం ఉందన్న అనుమానాలు కచ్చితంగా నిజమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ చౌకధరకే కేబుల్ ప్రసారాలు అందించాలన్నదే కేంద్రప్రభుత్వ నిర్ణయమైతే, అందుకు తగిన విధానపరమైన నిర్ణయం ప్రకటించి అంతా పారదర్శకంగా సాగేట్టు చూడాల్సిన అవసరం ఉంది.