ఎ.పి. మన టీవీ కి కొత్త బాస్ !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాప్ నెట్ ఆధ్వర్యంలో నిర్వహించే మన టీవీకి కొత్త సీఈవోను ఎంపిక చేసింది. శాప్ నెట్ సొసైటీనుంచి ఆమోదం రావటమనే లాంఛనం ఒక్కటే మిగిలి ఉంది. తెలంగాణ ప్రభుత్వం వాటా కిందికి వచ్చిన రెండు చానల్స్ ఇప్పటికే చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు సీఈవో నియామకం మీద దృష్టి పెట్టింది.

సుప్రసిద్ధ జర్నలిస్ట్ ఇనగంటి వెంకట్రావు ( ఐవిఆర్) కుమారుడు ఇనగంటి అనిల్ పేరు ను మన టీవీ సీఈవో పదవికి ఖరారు చేసిన ప్రభుత్వం ఈ వారంలో ప్రకటించబోతోంది. అనిల్ మహా టీవీలో ఎనిమిది సంవత్సరాలుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు.

అంతకుముందు కొంతమంది జర్నలిస్టులు మన టీవీ నిర్వహణకు ఒక భారీప్రతిపాదనతో ప్రభుత్వం ముందుకు వెళ్ళారు. అయితే  ఆ ప్రతిపాదన ప్రభుత్వానికి నచ్చలేదు. దాదాపు ఏడాది గడిచిన తరువాత ప్రభుత్వం సీఈవో నియామకం చేపట్టింది. వెలుపలి సంస్థలకు అప్పగించకుండా స్వయంగా నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం అటవీశాఖ అధికారి సుందర్ తాత్కాలిక సీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  సొసైటీ ఎవరిననా సీఈవోగా నియమించుకునే అవకాశం ఉంది కాబట్టి ఇనగంటి అనిల్ ను నియమిస్తున్నట్టు సొసైటీ తరఫున లేఖ అందగానే అధికారిక ఉత్తర్వులు వెలువడతాయి.