• Home »
  • Broadband »
  • ఎమ్మెస్వోలకు, ఆపరేటర్లకు మధ్య చిచ్చు: ఎమ్మెస్వో రూపంలో ’ఎపి ఫైబర్’ వ్యూహం

ఎమ్మెస్వోలకు, ఆపరేటర్లకు మధ్య చిచ్చు: ఎమ్మెస్వో రూపంలో ’ఎపి ఫైబర్’ వ్యూహం

ఒకవైపు ఎమ్మెస్వోలకు నచ్చజెబుతూనే వాళ్ళమీద వత్తిడి పెంచేందుకు ఎపి ఫైబర్ సరికొత్త వ్యూహం అమలు చేస్తోంది. ఎమ్మెస్వోలకు, కేబుల్ ఆపరేటర్లకు మధ్య చిచ్చుపెట్టటమే ఆ వ్యూహం సారాంశం. విభజించి పాలించటానికి సిద్ధమై స్వయంగా ఎమ్మెస్వో అవతారం ఎత్తింది. ఐపిటివి లైసెన్స్ ద్వారా తనకు ఎమ్మెస్వో లైసెన్స్ ఉన్నట్టేనని చెప్పుకుంటూ వచ్చినా ఎమ్మెస్వోగా పనిచేసే ఉద్దేశం లేదంటూ ఇంతకాలం ఎమ్మెస్వోలకు నచ్చజెప్పింది.

నేరుగా ఆపరేటర్లు రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని  ఇటీవల ఉత్తరాంధ్ర జిల్లాల కేబుల్ ఆపరేటర్ల సమావేశంలో డిమాండ్ చేయటం ఎపిఎస్ ఎఫ్ ఎల్ ప్రోద్బలంతోనే జరిగిందని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఎమ్మెవోలతో నిమిత్తం లేకుండా తమకే నేరుగా ఇంటర్నెట్ ఇవ్వాలని ఆ సమావేశంలో డిమాండ్ చేయటం వెనుక అసలు ఉద్దేశం అదే.  ఆ విధంగా వాళ్ళ డిమాండ్ నూ పరిశీలిస్తున్నామనే సంకేతం పంపటం ద్వారా ఎమ్మెస్వోలను భయపెట్టవచ్చునన్నది ఎపి ఎస్ ఎఫ్ ఎల్ అభిప్రాయంగా కనబడుతోంది.

ఐపిటీవీ లైసెన్స్  తీసుకున్నవాళ్ళు మళ్ళీ ఎమ్మెస్వోగా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదన్న విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూనే ఎమ్మెస్వోగా మారే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెబుతూ వచ్చిన ఎపి ఎస్ ఎఫ్ ఎల్ ఇప్పుడు మెల్లగా తన నిజ స్వరూపం బయటపెడుతోంది.  బ్రాడ్ కాస్టర్లతో చర్చిస్తున్నామని చెప్పటమంటే పే చానల్స్ కూడా ఇవ్వటానికి సిద్ధమవుతున్నట్టే. అంటే, ఆపరేటర్లు ఇకమీదట ఎమ్మెస్వోలమీద  ఆధారపడకుండా ఎపి ఫైబర్ స్వయంగా పే చానల్స్ కూడా అందిస్తుందన్నమాట.

ఇది కచ్చితంగా ఎమ్మెస్వోలను కలవరపరచే విషయం. అదే సమయంలో అనుకూలంగా ఉండే ఎమ్మెస్వోలతో ఒక రకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారనుకునే ఎమ్మెస్వోలతో మరో రకంగా వ్యవహరించేందుకు కూడా దీన్నొక అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెస్వోలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే చాలా కీలకమైన అంశం కాబోతున్నది.

ఎమ్మెస్వోలు అయినా, కేబుల్ ఆపరేటర్లయినా ప్రధానంగా రెండు అంశాల్లో చిక్కులు తప్పేటట్టు లేవు.  ట్రాయ్ నిబంధనల ప్రకారం వంద ఉచిత చానల్స్ కు రూ.100 వసూలు చేసుకునే అవకాశం ఎమ్మెస్వో/ఆపరేటర్ కు ఉంది. దాన్ని ఇద్దరూ 40:60 నిష్పత్తిలో పంచుకోవాలి. అయితే, ఇక్కడే అసలు సమస్య ఉంది. ప్రభుత్వం పదే పదే ఉచిత చానల్స్ ఉచితంగా ఇస్తున్నట్టు చెప్పుకుంటోంది. దీనివలన ప్రజలలో ఎమ్మెస్వోలు/ఆపరేటర్ల పట్ల ప్రతికూల ఆలోచన కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నా వీళ్ళు డబ్బు వసూలు చేస్తున్నారనుకునే ప్రమాదముంది. నిజానికి ఈ మొత్తం నెట్ వర్క్ నిర్వహణకు, బిల్లుల తయారీకి, పంపిణీకి అయ్యే ఖర్చు.

ఇంటింటికీ కేబుల్ ఉన్నప్పటికీ చాలా చోట్ల ఆర్ ఎఫ్ కేబుల్ మాత్రమే వాడుతున్నారు. ఇంటర్నెట్, ఫోన్ ఇవ్వటానికి ఈ కేబుల్ పనికిరాదు. అనివార్యంగా ఎఫ్ టిటిహెచ్ ( ఫైబర్ టు ద హోమ్ ) ఉండి తీరాలి. దీని ఖర్చు ఎవరు భరించాలనేది పెద్ద సమస్య అవుతుంది. పెట్టుబడి చాలా అవసరమవుతుంది కాబట్టే కేబుల్ ఆపరేటర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని భరించాల్సిందిగా కోరుతున్నారు.

ఎమ్మెస్వోలతో నిమిత్తం లేకుండా ఆపరేటర్లతో నడపాలనుకుంటే చాలా మందికి ప్రభుత్వమే ఈ సహాయం చేయాల్సి ఉంటుంది. అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదా అనేది చాలా ముఖ్యమైన విషయం. కొన్ని చోట్ల ఎమ్మెస్వోలే ఎఫ్ టి టి హెచ్ ఖర్చు భరించారు. అలాంటి చోట ఇంటర్నెట్ ఆదాయం పంపిణీలో నిష్పత్తి తేడా రావచ్చు. అందుకే ప్రభుత్వం ఈ నిష్పత్తిని నిర్ణయించకుండా ఎమ్మెస్వో, ఆపరేటర్ కే వదిలెయ్యాలి.

ఇక ప్రభుత్వమే పే చానల్స్ తో మాట్లాడటమంటే ఒప్పందాలకు సిద్ధమవటమే. అయితే, జాతీయ స్థాయి ఎమ్మెస్వోలకంటే తక్కువకు బేరమాడగలదా అన్నదే ప్రశ్న. పైగా, ఈటీవీ వంటి చానల్స్ ఐపిటివి, డిటిహెచ్ ప్లాట్ ఫామ్స్ విషయంలో బేరసారాల బాధ్యతను ఇండియాక్స్స్ట్ యుటివి మీడియా డిస్ట్రిబ్యూషన్ లాంటి సంస్థలకు అప్పగించాయి. ఆ విధంగా చూస్తే తక్కువ ధరకు బేరమాడగలదా అనేది అనుమానమే. అయితే, ఇందులో ప్రభుత్వం ఎలాంటి లాభాపేక్షాలేకుండా వ్యవహరిస్తే మాత్రం నెలవారీ చందా తగ్గే అవకాశం ఉంది.

ఇప్పుడు అందరి మెదళ్ళనూ తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే. ప్రభుత్వం నిజంగా ఎమ్మెస్వోలతో ఘర్షణ పూర్వక ధోరణి అనుసరించటానికే నిర్ణయించుకున్నదా, లేక కేవలం బెదరింపేనా అన్నది. ఒకవేళ పైకి అలాంటి ఘర్షణ కనిపించేట్టు చేసినా పాలకపక్షానికి అనుకూలంగా ఉండే ఎమ్మెస్వోలను మాత్రమే కాపాడుతూ ప్రతికూలంగా ఉండే ఎమ్మెస్వోల పరిధిలో మాత్రం కేబుల్ ఆపరేటర్లను ప్రోత్సహించి ఆ ఎమ్మెస్వోల వ్యాపారన్ని దెబ్బతీస్తుందా అనేది కూడా తేలాల్సి ఉంది.

ఇవన్నీ  ఒక ఎత్తయితే, ప్రభుత్వం ఎమ్మెస్వోగా మారటం చట్టబద్ధంగా చెల్లుబాటవుతుందా అనేది చాలా కీలకమైన ప్రశ్న. ఐపిటీవీ నిబంధనల ప్రకారం ఎమ్మెస్వో లైసెన్స్ వచ్చినట్టేనన్నది నిజమే అయినా, ఆ తరువాత ట్రాయ్ రూపొందించిన నిబంధనల ప్రకారమైతే రాష్ట్ర ప్రభుత్వాలు శాటిలైట్ చానల్స్ పెట్టటం గాని కేబుల్ వ్యాపారం చేయటం గాని నిషిద్ధం. ఇక్కడ ఈ రెండు నిబంధనలూ పరస్పర విరుద్ధమైనవి. ఈ విషయంలో ట్రాయ్ తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పాల్సి ఉంది. ఒకవేళ ఐపిటీవీ కింద చానల్స్ పంపిణీ చేసుకోవచ్చునని చెబితే అన్ని రాష్ట్రాలూ ఈ పద్ధతిని వాడుకుంటాయి. అప్పుడు ఎమ్మెస్వో అన్న పదానికే చోటుండదు. దేశ వ్యాప్తంగా ఇదొక పెద్ద వివాదమై కూర్చుంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ న్యాయపరమైనచిక్కులనుంచి ఎలా బయటపడుతుందో చూడాలి. ఈ విషయంలో జాతీయ స్థాయిలో ఎమ్మెస్వోలు కోర్టుకెక్కే అవకాశముంది.